*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము-(౧౦౮ - 10 8)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*వివిధ రకాలైన పువ్వులతో, అన్నములతో, నీటితో చేసే శివపూజ మాహాత్మ్యము*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు -
*మహాదేవుని కి బియ్యముతో పూజ చేస్తే మానవులకు అన్ని సంపదలు అభివృద్ధి చెందుతాయి. అభిషేకానికి వాడే బియ్యము ముక్కలు గా వుండకూడదు. బియ్యపు గింజ పూర్తిగా వుండాలి. రుద్ర ప్రధాన మంత్రము లతో పూజించి శివుని మీద శుభ్రమైన తెల్లని బట్ట వుంచి, బియ్యమును సదాశివునికి సమర్పించాలి. ఇది ఎంతో ఉత్తమమైన విధము. గోధుమలతో వండిన అన్నముతో చేయబడే శివపూజ సర్వోత్కృష్టమైన ఫలితాలు ఇస్తుంది, సంతాన వృద్ధి కలుగుతుంది.జొన్నలతో చేసే పూజ స్వర్గసుఖములు, పెసలతో చేసిన పూజ సుఖమును, కొర్రలతో పూజించిన ధర్మ, అర్ధ, కామ, భోగములు, కలుగుతాయి. కంది చెట్టు ఆకులతో శివుని అలంకరించాలి. లక్ష శంఖ పూవులు ఒక ప్రస్థ లేక అయిదున్నర కిలోలతో సమానమవుతాయి. పదకొండు ప్రస్థముల మల్లెపూలు ఒక లక్షకు సమానము అవుతాయి. నిష్కాముడై ఉపాసకులు శివ మహాదేవుని పూజ చేసి, ఆ దేవుని సన్నిధిలో పదకొండు మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి.*
*శతరుద్రీయ మంత్రము తో, భక్తి భావముతో శివలింగానికి విధి పూర్వకముగా జలధారలు సమర్పించాలి. రుద్రమంత్రముల జపము, పంచసూక్తముల పఠనంతో, ఆరురుచలతో కలిసిన మహా మృత్యుంజయ మంత్రము తో, గాయత్రీ మంత్రము తో, "ఓం".... " నమః" జోడించిన శివ నామాలతో, భస్మము పెట్టకొనిన ఉపాసకుడు శివపూజ చేయాలి. శివసహస్ర నామాలతో దేవదేవుని మీద మంచి నేతి ధారతో అభిషేకం చేస్తే సాధకునకు సత్సంతాన వృద్ధి కలుగుతుంది. చక్కెర కలిపిన పాల ధారతో చేసిన అభిషేకం బుద్ధి మాంద్యాన్ని తగ్గిస్తుంది. మంత్రము నడుస్తున్నంతసేపూ శివుని మీద ధార ఆగకూడదు. పరిమళ తైలము(సెంటు), తేనె, చెరకు రసము, గంగాజలములతో మృత్యుంజయ మంత్రము చదువుతూ అభిషేకం చేయాలి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు