*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౧౦౪ - 104)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*భగవానుడు అయిన శివుని గొప్పతనము - శివపూజ చేసుకోవలసిన అవసరము*
* మానవునికి తాను చేసే పనిలో నమ్మకం, విశ్వాసం వుండాలి. చేసే పని వల్ల తన ఉన్నతికి ఉపయోగపడే ఫలితం భగవానుడు ఇస్తాడు అని మనసా, వాచా, కర్మణా అంటే త్రికరణ శుద్ధిగా నమ్మిన తరువాత ఆ పనిచేయాలి. ఇటువంటి నమ్మకం మనకు రావడానికి సదాశివుని ఆరాధించాలి. మానవులకు మంచి చేయడానికి పరమేశ్వరుడు అనేక రూపాలలో కనిపిస్తారు. ప్రతక్ష నారాయణుడైన సూర్యుడు ఒక్కడే. కానీ, వేరు వేరు వస్తువులలో తానే వున్నట్టు కనిపిస్తారు కదా, అలాగ. ఈ ప్రపంచంలో "సత్", " అసత్" అన్ని రూపాలు, కనబడతాయి, వినబడతాయి. కానీ ఇవి అన్నీ కూడా ఆ పరమేశ్వరుని రూపాలే. ఇది అంతా కూడా పరబ్రహ్మ రూపమైన శివతత్వమే అని మనం గ్రహించగలగాలి. అప్పటి వరకు లింగ రూపములో వున్న ఆ సర్వేశ్వరుని పూజిస్తూ వుండాలి. ఎదో ఒకనాడు, ఆ పరాత్పరుని కృపతో ఈ సృష్టి లో ఉన్నదంతా, నా తో సహా శివుడే గానీ వేరొకటి కాదు, అని తెలుసుకో గలుగు తాము.*
*అజ్ఞానం లో వున్నవారు విగ్రహాలను పూజించడాన్ని అవహేళన చేస్తూ ఉంటారు. అటువంటి వారిని భగవానుడే సన్మార్గంలో కి తీసుకురాగలడు. ఎవరైనా వారి జన్మ కారణంగా చేయవలసిన కర్మానుష్టానములు గతి తప్పక చేస్తూనే వుండాలి. ఇది ప్రతి ఒక్కరికీ ప్రకృతి లేదా సదాశివుడు విధించిన ధర్మం. ఈ ధర్మాన్ని తప్పి నడవడిక వుండ కూడదు. భక్తి తో, ఇష్టం తో, పెద్దలు చెప్పగా విన్న పద్ధతులు పాటిస్తూ శివపూజ నిత్యమూ చేయాలి.  పూజలు, దానములు చేయకుండా, మనం తెలిసి గాని తెలియకగానీ చేసిన పాప కర్మ ఫలం, మనలను విడిచి పెట్టదు.*
*శ్లో: యత్ర యత్ర యథాభక్తిః కర్తవ్యం పూజానాదికమ్ !*
*వినా పూజన దానాది పాతకం న చ దూరతః !!*
                              ‌‌‌‌         (శి.పు.రు.సృ.ఖం.12/6)
                             
*బట్ట, మురికిగా వున్నంత వరకు, దానికి ఏ రంగు అద్దినా అంటుకోదు. అదే బట్టను శుభ్రము చేసి రంగు వేస్తే వెంటనే రంగు నిలుస్తుంది. అలాగే, మన మనసు, శరీరము, చేసే పని  శుభ్రంగా వుండాలంటే శివపూజ మొదలు పెట్టాలి. పూజ అలవాటు చేసుకున్న మనసు నిర్మలంగా అవుతుంది. అప్పుడు ఆ మనసు కు జ్ఞానము అనే రంగు అంటుకుని నిలుస్తుంది. అలా జ్ఞానము పొందిన మనసు విజ్ఞానముతో వెలిగి పోతుంది. విజ్ఞానము కలిగిన మనసు లో నేను, పరమాత్మ వేరు అనే భేదభావము పోతుంది. ఈ భేదభావం పోయిన తరువాత దుఃఖము, బాధ వాటంతట అవే తొలగిపోతాయి. ఇటువంటి స్థితి ని పొందిన మానవుడు శివుడే.*
*మానవుడు ఈ సంసార బంధనములో వున్నంత వరకూ అయిదుగురు దేవతలలో ముఖ్యుడు (శివ పంచాయతనం), అందరి దేవతలకూ పూజ్యడు అయిన శివ భగవానుని పూజ చేయాలి. ఎలా అయితే చెట్టు మొదలులో నీరు పోస్తే, ఆ నీరు వల్ల వచ్చే బలం చెట్టు మొత్తానికి లభిస్తుందో, అలాగే శివపూజ ఒక్కటి మనస్పూర్తిగా తదేక ధ్యానము తో చేస్తే దేవతలు అందరూ సంతోషిస్తారు. మనకు అందవలసిన ఫలితాన్ని సుళువుగా మనకు అందిస్తారు. అంతిమంగా మనకు కావలసిన జీవన్ముక్తి తో సహా అన్ని కోరికలనూ మన అర్హతను బట్టి తీర్చ గలిగిన శంకర భగవానుని పూజ ప్రతి రోజు చేయాలి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు