*శ్రీ శివపురాణ మాహాత్మ్యము*-*రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము-(౧౧౦ - 110)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సృష్టి వర్ణన*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు -
*తమోగుణము, దుఃఖము, సత్వగుణము, సత్యం, రజోగుణము లతో కూడుకున్న అయిదు విధాలైన సృష్టి ని చేసిన తరువాత మహత్తత్వ సర్గము, తన్మాత్రల సర్గము, వైకారిక సర్గము అనే మూడు ప్రాకృత సర్గలు ఏర్పడ్డాయి. ప్రాకృత, వైకృత సర్గలను కలిపితే ఎనిమిది సర్గలు అవుతాయి. ఇక తొమ్మదవది కౌమారసర్గ. ఈ కౌమారసర్గ ప్రాకృతము మరియు వైకృతము కూడా.*
*ప్రాకృతము, వైకృతము అయిన సర్గను ద్విజాత్మక సర్గ లేక కౌమారసర్గ అంటారు. ఈ సర్గలో సనకసనందనాది కుమారుల మహత్వపూర్ణ సృష్టి జరిగింది. ఈ సనకసనందనాది కుమారులు బ్రహ్మనైన నాతో సమానమైన వారు. ఉత్తమమైన వ్రతము పాటిస్తూ వుంటారు. సాంసారిక చింతన లేకుండా వుంటారు. సృష్టి కార్యములో పాలుపంచుకోమని బ్రహ్మ నైన నేను చెప్పినా కూడా వారు వినలేదు. ఆక్షణం మోహం నన్ను ఆవరించి వున్నందువల్ల సనకసనందనాదుల మీద విపరీతంగా కోపం వచ్చింది. నేను విష్ణు భగవానుని కోసం తపస్సు చేసాను. నా తండ్రి ప్రత్యేకమై నీవు సదాశివుని ప్రసన్నం చేసుకోమని చెప్పారు. అప్పుడు నీలలోహితుని ప్రార్థిస్తూ కఠోరమైన ఘోరమైన తపస్సు చేసాను. అలా తపస్సు లో వున్న నా కనుబొమ్మలు, నాసిక మధ్య భాగమైన "అవిముక్త"నామక స్థలమైన భృకుటి నుండి పూర్ణాంశము, సర్వేశ్వరుడు, దయాసాగరుడు, భగవంతుడు అయిన శివుడు, "అర్ధనారీశ్వర" రూపంలో ప్రకటితము అయ్యారు.*
*జన్మరహితుడు, తేజోరాశి, సర్వజ్ఞుడు, సమస్తమును సృష్టి చేయువాడు, అయిన అంబాపతిని ఎదురుగా చూచి, భక్తి భావముతో నమస్కారం చేస్తూ ఎంతో ఆనందించాను. ఆ మహేశ్వరుని "రకరకాల జీవులను సృష్టి చేయమని" అడిగాను. నా ప్రార్ధనతో కూడిన కోరికను మన్నించారు మహాశివుడు. "జనన మరణముల భయముతో ఉండే జీవులను" సృష్టి చేయమని మళ్ళీ అడిగాను. అప్పుడు, సదాశివుడు, " నేను వీరి సృష్టి చేస్తాను. కానీ వీరు కర్మలకు అధీనులై వుండి అనేకమైన దుఃఖములలో మునిగి వుంటారు. ఇలాంటి వారిని గురువుగా చేరదీసి, ఉత్తమ జ్ఞానము ఇచ్చి, సంసార సాగరాన్ని వారు దాటేటట్టు చేస్తాను. నా ఆజ్ఞ తో సృష్టి చేస్తున్న నిన్ను మాయ ఏమీ చేయలేదు. అందువల్ల దుఃఖము లో కొట్టమిట్టాడే జీవుల సృష్టి నీవే చేయి." అని చెప్పి తన పార్షదులతో (శివ సేవకులు) కైలాసానికి అంతర్ధానం అయ్యారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు