అస్తిత్వం;-డా.స్వాతి నీలం,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.630281161
 సామర్ధ్యం కన్నా సంకల్ప బలం గొప్పది...
పనితనం కన్నా ప్రయత్నం గొప్పది...
నిర్ణయం కన్నా నిబద్ధత గొప్పది...
శక్తి కన్నా స్పృహ గొప్పది...
అర్హత కన్నా ఆశయం గొప్పది...
అవును.. అంధత్వం వారి అస్తిత్వమే అయినా....
ఆత్మవిశ్వాసానికి వారు care of adress...
చీకటి రాజ్యాన్ని పాలిస్తున్న ధృతరాష్ట్రుని వారసులే అయినా...
ఓటమిని అంగీకరించరు... వెనకడుగూ వెయ్యరు...
దాతృత్వపు పరిమళాలను శ్వాసిస్తూ...
చేతల సహచర్యాన్ని స్పృశిస్తూ... 
మాటల ధైర్యాన్ని మూటగట్టుకుని 
ముందడుగు వేస్తుంటారు ఈ సమ్యోధులు..
బలం బలహీనతలు వారి నమ్మకాలే తప్ప 
లోపాలు కాదంటారు ఈ మార్గదర్శకులు...
పోటీ తత్వంతో, పట్టుదలతో విజయాల 
పరంపరని సాగిస్తున్న ప్రతిభావంతులు...
అంతర్లీనంగా క్రాంతి కిరణాలను 
ప్రజ్వలింప చేయగల సమర్థులు...
రంగురంగుల ఊహలను కను రెప్పల 
వెనుక చిత్రించగల చిత్రకారులు...
పల్లవించిన ప్రకృతి రాగాల  
సూక్ష్మాలను పసిగట్టగల ప్రావీణ్యులు...
విజ్ఞాల జ్యోతుల కాంతులతో 
విశ్వాన్ని మేల్కొలుపుతున్న
మేధావులు...
అసంపూర్ణమన్న అభద్రతా భావాన్ని
అంగీకరించక
ఆత్మస్థైర్యాన్ని అణువణువున నింపుకుంటూ,
వారిని వారే మలుచుకుంటూ
వారికెవ్వరూ సాటి లేరని నిరూపిస్తూ...
మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న 
అసమాన్యులు...మనందరి ఆత్మీయులు...
అందుకే వారు గౌరవనీయులు...ఆదర్శప్రాయులు...
 


కామెంట్‌లు