లక్ష్యం వైపు అడుగులు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 అందరికీ జీవితంలో 
ఏదో ఒకటి చెయ్యాలని...
ఏదో ఒకటి సాధించాలని...
వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవాలని ఆశ వుంటుంది....
కళ్ళ ముందు వందల కొద్ది వ్యవహారాలను
చూస్తున్నప్పుడు వేల కొద్ది ఆలోచనలు పుడుతూ వుంటాయి...
క్షణాలలో మిణుగురులై మాయమై పోతుంటాయి...
కొన్ని ఆలోచనలను లాంఛనంగా ఆరంభించినా, అర్ధాంతరంగా 
వచ్చిన అవాంతరాల కారణంగా మధ్యలోనే మనుగడను కోల్పోతుంటాయి....
నిజానికి....కాగితం పై రాతలను చెరిపినంత సులభం కాదు
అరచేతి గీతలను చెరిపేయడం...
మాటలు చెప్పినంత సులభం కాదు అదే మాటలను
ఆచరణలో అనుసరించడం...
వెతికే కలల తీరం దూరమైతే వెళ్ళే దారి కూడా భారమైపోతుంది...
ఎడారిలో సవారీ చేస్తున్నప్పుడు ఎండమావుల నీడలు...
నడి సంద్రాన నావలో పెను ఉప్పెన లాంటి అలల జాడలు... 
సహజమే అయినా... లక్ష్యం లెక్క తప్పినప్పుడు
భయం మరింతగా భయపెట్టడం మెదలుపెట్టి
పరుగులకు అడుగుల సమాధిని కట్టేస్తుంది...
కష్టాలకు కుంగిపోతే,,, కన్నీళ్ళకు లొంగిపోతే,,,
కనులు కన్న కలల ప్రపంచ ఆనవాళ్ళను సాధనతో శోధించేడెప్పుడు...???
విజయాన్ని సాధించేడెప్పుడు...???
నీ కాళ్ళ పై నువ్వు నీ భరోసాతో నిలిచేడెప్పుడు..???
నిండైన జీవితాన్ని నీవుగా గెలిచేడెప్పుడు...???


కామెంట్‌లు