మతతత్త్వం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు. 6302811961.
 ఏళ్ళకు ఏళ్ళు గడుస్తున్నా
సరే ఇక్కడ ఏ విధమైన మార్పూ లేదు...
విజ్ఞాన దీపాలు వెలుగుతున్నా సరే అంధకారాన
అజ్ఞాన పొరలు మాత్రం తొలగడం లేదు...
ఇప్పటికి..ఇప్పటికి కూడా,
వర్ణాల వివాదాలు,
వర్గాల విభేదాలు,
కుల కుతంత్రాలు,
మత మారణహోమాలు
జరుగుతూనే ఉన్నాయి
ఇంకా జరుగుతూనే వుంటాయి....
అందరూ సమానమే అంటూ ఓ పక్క మతగ్రంధాల సిద్ధాంతాలు మొత్తుకుంటుంటే...
కాదు,మాకు మేము వేరంటూ రాజకీయాల రాద్ధాంతాలు మరోపక్క రేగుతూనే ఉన్నాయి...
ప్రాణాలు తీసే పైశాచికత్వం, పోరుకై పచ్చజెండాను ఊపుతుంటే...
వ్యవస్థల, విధానాల, వ్యక్తిత్వాల, ముర్ఖత్వాలు
శత్రుత్వాల పెను చిచ్చును రేపుతూనే వున్నాయి...
నిజానికి,,,
హద్దులలో....సరిహద్దులలో
బహిరంగ యుద్ధాలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా...
హెచ్చు తగ్గుల హెచ్చరికల అంతర్గత యుద్ధాలకు మాత్రం 
అనాదిగా పునాదులు పడుతూనే ఉన్నాయి...
ఒకరు మేమే గొప్పంటే...
మరొకరు వాళ్ళు కాదు మేమంటారు...
ఒకరు తక్కువ కాదంటారు...
మరొకరు తగ్గేది లేదంటారు...
తరాలు మారుతున్నాయి కానీ...
ఈ తగవులు తీరడం లేదు..
ఆధునికత వైపు అడుగులు వేస్తున్నా 
ఆలోచనా విధానాలు మారడం లేదు...
భేదాల, విభేదాల
రోగాలు విధ్వంసాలకు దారి తీస్తున్నా...
కులాల కంచెలు కూలడం లేదు...
మతాల మొహమాటం
మనం అనే ధోరణిలో ముందుకు సాగడం లేదు...
ప్రేమకు, పరువుకు పెట్టిన పందేలలో పసి ప్రాణాలు నెగ్గడం లేదు...
తులాభారాన తూయగా
మతతత్త్వం ముందు మానవత్వం మొగ్గడం లేదు...


కామెంట్‌లు