జడివాన వెతలు (మణిపూసలు);-చైతన్య భారతి పోతుల -నాగర్ కర్నూల్ జిల్లా 7013264464
 1. 
నింగిలోని మేఘాలు 
ఉరుములతో గర్జనలు 
దిక్కులన్ని పిక్కటిల్లి 
హోరుమనే శబ్దాలు 
2. 
ముసురు ముసురు వానలు 
తడిసిపోయె మేనులు 
చిరుజల్లుకు చిందులేసి 
మురిసిపోయె బాలలు 
3.
కారు చీకటి కమ్మింది 
గాలివానే  మొదలైంది 
భీతిల్లిన ప్రాణులకు 
గుండెలో దడ పుట్టింది.
4.
మెల్లగాను మేనుతాకె 
చల్లనైన చినుకు నాకె 
మిడిసిపాటు మేఘమా 
మాయాలోన ముంచబోకె 
5.
చినుకు చినుకు మెల్లిగా 
చిటపటల సవ్వడిగా 
జడివానగా మారింది 
కుంభవృష్టి జోరుగా 
5.
నింగినేల నొకటిచేసి 
దారులన్నీ ముంచేసి 
అందరిని భయపెట్టెను.
పనులన్నీ ఆపేసి 
6.
పక్షి గూడు చెట్టుపైన 
చెదిరిపోయె వానలోన 
పసిగుడ్డు వణికిపోయె
జడివానా చలిలోన 
7.
పంటచేలు ఏటిపాలు 
కష్టమంత నీటిపాలు 
దడపుట్టెను వానలతో 
ఎలా తీరు మా బాధలు?
8.
వీధులన్ని నదులాయెను 
సామాన్యుల వెతలాయెను 
కుండపోత వానలతో 
అస్తవ్యస్తమాయేను.
9.
ఇంతలేసి వర్షాలకు 
నగరాలలో జనాలకు 
స్తంభించెను జనజీవనం 
ఉప్పెనే సామాన్యులకు 
10.
ప్రభుత్వాలు మేల్కొనిన 
జాగ్రత్తలు చేపట్టిన 
కష్టాలు తీరును కదా!
శాశ్వత పనులు చేసిన 
11.
ఆకాశం చిల్లుపడెను 
జలధారలు ఆగవేను 
దిక్కులార చెప్పండి.
ఆపమనీ మీరైనను 
12.
వానజోరు తగ్గింది 
నిశ్శబ్దమలుముకుంది 
సంద్రాలను తలపించి 
తిన్నగా జారుకుంది... 

కామెంట్‌లు