జానపద వాజ్మయోద్ధారకుడు....;-- ప్రమోద్ ఆవంచ-- సీనియర్ జర్నలిస్ట్ 7013272452

 వేల సంవత్సరాల నుంచి పల్లె పాటలు మనుగడలో ఉన్నాయి.జాతి పుట్టుకతోనే పదాలు,పల్లె పాటలు పుట్టాయి.ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల,పల్లెల్లో ప్రజల నోళ్లలో నానుతూ ఇంకా జీవించే ఉన్నాయి అనడంలో, ఎలాంటి సందేహం లేదు.కానీ ఆ పల్లె పాటలు, పదాలు రాసిన కవులు మాత్రం మనకు తెలియదు.వాళ్ళ చరిత్ర ఎక్కడా కనిపించదు.రామాయణ,భారత, భాగవత కథలను,పాటగా కూర్చి పాడుకునేవారు.ఆ పురాణాల కంటే,ఆ పాటలే అద్బుతంగా వుండేవి.అవి కూడా వారి వారి మాండలికాల్లో,లలితంగానూ రసవత్తరంగానూ,రసహృదయాలను, ఆకట్టుకునేవి.
                         రోజు ప్రజలు,పాడుకునే, పల్లె పాటలను, అనేక కష్టనష్టాలను ఓర్చి సేకరించిన ఘనత
 నేదునూరి గంగాధరం గారిది.రాజమహేంద్రవరం కి చెందిన ఈయన దాదాపు నాలుగు వేల పల్లె పాటలను
 సేకరించారు.నేడు ఆయన జయంతి.ఈ సందర్భంగా
 ఆయనను స్మరించుకుంటూ, దేశంలో,పల్లె పాటల సాహిత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేసిన విదేశీయులు, భారతీయుల గురించి చర్చించుకుందాం.
                         పల్లె సాహిత్యం గొప్పతనాన్ని మొట్టమొదటగా, వెలుగులోకి తెచ్చింది ప్రాశ్చాత్యులే.1784 సంవత్సరంలో, విలియం జోన్స్,అనే ఆయన బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ స్థాపించి, ఆసియా దేశాల సంస్కృతి, సాహిత్యం, చరిత్ర, మొదలైన వాటిని శాస్త్రీయంగా, విమర్శనాత్మకంగా, పరిశోధన చేసారు.
ఆ తరువాత రాయల్ ఏషియాటిక్ సొసైటీ 1804 లో, బొంబాయిలో,అటు పిమ్మట 1829లో బ్రిటన్, ఐర్లాండ్ 
లలో,1845లో శ్రీలంకలో ఏర్పడి పల్లె సాహిత్యం పై ఎంతో కృషి చేశారు.వాళ్ళ పత్రికల్లో పల్లె పాటలపై అనేక వ్యాసాలు వచ్చేవి.1872లో,Antiquary అనే పత్రిక, పల్లె సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
అలాగే 1886లో, బొంబాయికి చెందిన Anthropological సొసైటీకి చెందిన పత్రిక, ఒరిస్సా, బిహార్ కి చెందిన Mythic, మరియు Research సొసైటీ పత్రికలు పల్లె సాహిత్య గొప్పతనాన్ని గురించి వ్యాసాలు రాసాయి.1868లో, ఓల్డ్ డక్కెన్ డేస్ పల్లె కథలను సంపుటిగా ప్రచురించింది.భారత దేశంలో పల్లె కథలపై తొలి సంకలనం అది.1878లో,లండన్ లో Folk Lore సొసైటీ ఏర్పడింది.ఈ సొసైటీ తరుపున sir
James George Frazar చేసిన కృషి అమోఘం.పల్లె సాహిత్యంపై ఈయన రచనలు The Golden Baugh
( పన్నెండు సంపుటాలు),Folk Lore in the old testament గొప్ప పుస్తకాలు.1898 లో, English Folk Lore సొసైటీ ఏర్పడింది.ఈ సంస్థ వేల పల్లె పాటలను సేకరించింది.
                           పల్లె సాహిత్యాన్ని సేకరించిన భారతీయ ప్రముఖులలో దేవేంద్ర సత్యర్ది పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఆయన 25 సంవత్సరాలు దేశమంతా తిరిగి 50 బాషలో నుంచి మూడు లక్షల పల్లె పాటలను సేకరించారు.తెలుగు పల్లె పాటలు కొన్నింటిని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి చక్కని అనువాదం చేసారు.ఈయనే కాకుండా పల్లె సాహిత్యోద్యమంలో,ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖులలో, రవీంద్రనాథ్ ఠాగూర్,రామనరేష్ త్రిపాఠి ( హిందీ గ్రామగీత్ సంకలన కర్త),జావేద్ చాంద్ మేఘాని,కాకా కాలేల్కర్,సానే గురూజీ,హర్జీత్ సింగ్ ( పంజాబ్),రామ్ ఇక్బాల్ సింహారాకేశ్( మైథిలి), కృష్ణదేవ ఉపాధ్యాయ ( బోజ్ పూరి),సూర్యకిరణ్ పాఠక్,రామసింహా,నరోత్తమ్ దాస్ ( రాజస్థాన్),లను పేర్కొనవచ్చు.
                           వందల ఏళ్ల క్రితమే దక్షిణాదిన పల్లె సాహిత్యోద్యమం ప్రారంభమైంది.1871లో, చార్లెస్ ఈ గోవర్, ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా అని దక్షిణాది పల్లె పాటల సంకలనాన్ని ప్రచురించారు.ఇందలో తమిళం, మళయాళం, కన్నడ,బడగ,కూర్గ్,కురళ్,బాషల పల్లె పాటలు ఉన్నాయి తప్ప తెలుగు పాటలు లేవు.కానీ వేమన పద్యాలు ఉన్నాయి.ఆ తరువాత 1874లో,J.A.Boyle 
అనే ఆయన తెలుగు బాలెడ్ పోయెట్రీ అనే వ్యాసాన్ని 
ది ఇండియన్ ఆంటిక్వరీ పత్రికలో రాసి,అందులో ఆరు తెలుగు పల్లె పాటలను, సేకరించి, ప్రచురించారు.తెలుగు పల్లె పాటలను సేకరించిన తొలి వ్యక్తిగా ఆయన ప్రఖ్యాతి పొందారు.
                         క్రమంగా తెలుగు వారు కూడా పల్లె పాటల సేకరణ మీద దృష్టి సారించారు.1900,1903 సంవత్సరాలలో, ఏలూరు కి చెందిన నందివాడ చలపతిరావు గారు స్త్రీ పాటలు అనీ రెండు సంపుటాలు వెలువరించారు.మంగు వెంకట రంగనాథ్ రావు, కాకినాడ నుంచి ఒక సంపుటి ప్రచురించారు.1905 లో,ఎస్.వెంకటస్వామి కొన్ని పల్లె పాటలను వెలుగులోకి తెచ్చారు.ఆ తరువాత సురవరం ప్రతాపరెడ్డి,ఆది నారాయణ శాస్త్రి, అక్కిరాజు ఉమాకాంతం, వేటూరి ప్రభాకర శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, పల్లె సాహిత్యం గొప్పతనాన్ని ప్రచారం చేశారు.చింతా దీక్షితులు, డాక్టర్ బి.రామరాజు, డాక్టర్ తూమాటి దోణప్ప, కృష్ణశ్రీ,ప్రయాగ నరసింహశాస్త్రి,హరి ఆదిశేషు, ఎల్లోరా, డాక్టర్ నాయిని కృష్ణ కుమారి గార్లు పల్లె పాటలను సేకరించి సంపుటాలు వేసారు.పరిశోధనా వ్యాసాలు రాసి విశ్వవిద్యాలయ పట్టాలు పొందారు.
                         పల్లె పాటలను, పదాలను సేకరించడంలో నేదునూరి గంగాధరం తన జీవితాన్ని ధారపోసి, పల్లె సాహిత్యాన్ని వెలికితీసేందుకు ఎంతో కృషి చేశారు.1904, జులై 4 వ తేదీన, రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న కొంతమూరు గ్రామంలో ఆయన 
జన్మించారు.వెంకటేశ్వర్లు, మంగమ్మ గార్లు తల్లిదండ్రులు.గంగాధరం గారు పెద్ద చదువులు చదవలేదు. చిన్న వయసులోనే, పండితులైన గురువుల వద్ద వివిధ శాస్త్రాలు నేర్చుకున్నారు.మనవిల్లి రామకృష్ణ కవి దగ్గర పరిశోధనలో అనుభవం సంపాదించుకున్నారు.పల్లె పాటల సేకరణకు ఉన్న భూమిని, చివరకు భార్య మెడలో పుస్తెలు కూడా అమ్మేసారు.
                           గంగాధరం గారు, నాలుగు వేలకు పైగా పల్లె పాటలను, పదాలను, సేకరించారు.అందులో 
కొన్ని భారతి, మరియు ఇతర తెలుగు జర్నల్స్ లో ప్రచురించబడ్డాయి.చాలా వరకు ఎక్కడా ప్రచురించబడలేదు.తెలుగు వారికి గర్వకారణం గంగాధరం గారు.కేవలం తెలుగు నేలనే కాదు, ఖండాంతరాలలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి.సుప్రసిద్ద సాహితీ వేత్త రామానంద చటర్జీ,తన మాడ్రన్ రివ్యూ పత్రికలో,విశ్వభారతి పట్టం పొందిన,కుంజ బిహారీదాస్
తన పల్లి గీత సంచయనంలోను, ప్రఖ్యాత జానపద సాహిత్య మహారధి దేవేంద్ర సత్యార్థి తన హిందీ, ఇంగ్లీషు గ్రంధాల్లో, గంగాధరం గారిని ఘనంగా ప్రశంసించారు.
                       గంగాధరం గారు తాను విన్నది  విన్నట్టు,దొరికినవి దొరికినట్టు పల్లె పాటలను,పదాలను,తన మిన్నేరు, మున్నీరు
 సంకలనాలలో, ప్రచురించారు.
 (జులై 4 నేదునూరి గంగాధరం గారి జయంతి)
                            
కామెంట్‌లు