...గుర్తుకొస్తున్నాయి;-పెద్ద కంచుకంచం-చిన్నకంచుకంచం;- సత్యవాణి 8639660566
  'చిన్నారి పెళ్ళాకూతురు 'సీరియల్ చుస్తున్నప్పుడు,ఆసీరియల్  లో వాళ్ళందరూ అస్తమానూ తినడమేపనన్నట్లు, రోటీ,దాల్ ,మొదలైన పది,పదిహేను రకాలైన పదార్థాలు వడ్డించుకొని పెద్దపెద్ద కంచాల్లో తింటుంటే, మా చిన్నప్పటి మా రౌతులపూడిలోని ,మా పుట్టింట్లోవుండే పెద్దకంచు కంచం-చిన్నకంచు కంచం గుర్తుకొచ్చేవి.
    ఆకంచాలు బహుశా బరంపురం కంచుతోచేసినవనుకొంటాను.పెద్దకంచం  మూడు కేజీలపైన బరువుండేది. చిన్నది కేజీకి పైన బరువుండేది.
       మా పెద్దమామ్మయ్య మడికట్టుకొని వంటలోకెళ్ళేముందుగా,ఆ పెద్దకంచుకంచంలో బహుశా శేరుబియ్యం అన్నానికి కొంచంతక్కువగానో,ఎక్కువగానో,ఒకరోజు పచ్చావకాయ కాయలోని పిండితో,మరోరోజు ఎర్రావకాయ కాయలోపిండితో,మరో రోజు మాగాయతోనూ ఆ అన్నంకలిపి, పురిషళ్ళకొద్దీ నెయ్యిపోసి, ఇంట్లోవున్నపిల్లలందరినీ కంచంచుట్టూ గుండ్రంగా కూచోపెట్టి,ఆ అన్నాన్ని గుండ్రాయంతటిముద్దలు చేసి చేతుల్లోపెట్టేది.తినకుండా దిక్కులు చూసేవారికేసి ఆవిడ గుడ్లురిమి చూసిందంటే, గుటుక్కున నోట్లోపెట్టుకొని,నమిలో,నమలకుండానో మింగితీరవలసిందే. ఆ వాయనం పూర్తయ్యాకా, మిగిలిన అన్నంలో సత్తుగిన్నెడు పెరుగుపోసి, అదరికీ ఆవకాయ కాయలనుండి విడదీసిన గొడ్డలంతత  పెచ్చులు పీక్కోడానికి చేతుల్లోపెట్టి, పెరుగుముద్దలు ఒక్కొక్కరికీ, మామ్మయ్య మా నోటికదిస్తుంటే, చెేతిలోని పెచ్చును, పీచు వూడొచ్చేలా పీక్కు తింటుంటే,'ఆహా ఏమిరుచి ,అనరా మైమరచీ'బహుశా డైరెక్టర్ కృష్ణారెడ్డి ఈ రుచిని ఆస్వాదించే ఆ పాటను ఎత్తుకొనివుంటాడు అదేదోసినీమాలో.
   పెరుగన్నం అయిపోయినా,ఆ ఆవకాయడొక్కుకు మిగిలినపీచుతో, పెద్దకంచుకంచం అరిగిపోతుందా అన్నట్లు కంచం ఊడ్చుకు ఊడ్చుకు తింటుంటే ఆ మజా మరెక్కడా లభించదు.పైగా మామ్మయ్య "ఊడ్చుకు తిన్నవాళ్ళకే -ఉద్యోగం" అని అప్పటికప్పుడు తానే ఉద్యోగమిస్తున్నట్లు ప్రకటించేది.దాంతో మరింతగా విజృభించేవాళ్ళం.దాంతో మా పెద్దకంచు కంచం పెచ్చులపులుపుకు బంగారంకంచంలా మిలమిలా మెరిసిపోయేది.
     అయితే అంతమంది పిల్లలం కచంచుట్టూ గుమిగూడినా,అది వద్దనికానీ,ఇది కావాలనికానీ,వాడికి పెద్దముద్దపెట్టేవనిగానీ,నాకు చిన్నముద్ద పెట్టేవని పేచీలుగానీ,అల్లర్లుగానీ,కంచంచుట్టూ మెతుకులు పోయడంకానీఎరగం. 'ఆవకాయన్నంతో కడుపునిండిపోయింది మామ్మయ్యా'అంటే,నీవాటా పెరుగన్నం నీతలకు రుద్దేస్తాననేది.అందుకని గుడ్లనీరు గుడ్లేమింగగా,పెరుగన్నం మేము మింగేసేవాళ్ళం.
    ఇక్కడ పెరుగన్నం తలకు రుద్దండం విషయంలో మా పెద్దమామ్మయ్యకు సంబంధించిన విషయం ఒకటి చెప్పుకోవాలి.మా పెద్దమామ్మయ్య బాల్యవితంతువు.చెల్లెలింట్లో,అదే మా రౌతులపూడిలోనేవుండేది. అదే ఆవిడ పుట్టిల్లుకూడా.అంటే మా తాతయ్యగారు పూళ్ళసత్యన్నారాయణమూర్తిగారు , మామామ్మయ్యి బాపనమ్మగార్నిపెళ్ళి చెేసుకొని, ఇల్లరికంగా మూలపేటనుండి వచ్చేసేరు. ఆవిధంగా మా పెద్దబామ్నమగారికి మా ఇల్లు పుట్టిల్లు,అఅలాగే చెల్లెలిల్లుకూడాఅయ్యింది.మా పెద్దమామ్మయ్య అత్తారిఊరు  శంఖవరంమండలంలోని జగ్గంపేట.అప్పుడప్పుడు కథలకిర్యాలకీ వెళ్ళివస్తూవుండేదికానీ,ఎక్కువగా మా రౌతులపూడిలోనేవుండేది. ఆవిడకు  పెద్దతండ్రి కొడుకైన మా పెద్దవేంకటరావు మావయ్యను దత్తతతీసుకొని,తన చెల్లెలికూతురైన మా అత్తయ్యరామలక్ష్మిని,(ఆవిడే దరిమిలా నా అత్తగారుకూడా) ఇచ్చి పెళ్ళిచేయాలని ఇంట్లో తెచ్చిపెట్టుకొందిటఅపిల్లాడిని.(ఆవిడ పెద్దతండ్రిగారిది పక్కఇల్లే)అయితే అప్పుడుకూడా ఇలాంటి చద్దెన్నాల ప్రహసంనంలోనే, ఆ పెంచుకోవాలనుకొన్న పెద్దవేంకట్రావు మావయ్య పెరుగన్నం ససేమీరా తిననుగాక తిననిమొరాయించేడట.ఇంకేముంది,మా మామ్మయ్యకి బాగా కోపంవచ్చింది. అతగాడికి పెరుగన్నం నిజంగానే నెత్తికి పట్టించి వదిలేసిందట. అంతే,  అతడి తండ్రి  లక్ష్మింపతి తాతగారు."నీకూ,నీదత్తతకూ ఒకనమస్కారం.నీకు కోపమొస్తే నాపిల్లాడిని చంపేస్తావో ఏమో"అని తనపిల్లాడినితీసుకునిపోయేడట.ఆమటాన అది ఆ అన్నాచెల్లెళ్ళ యిద్దరిమధ్య జన్మవైరమైయ్యిందట. ఆవిషయంకూడా మా చద్దెన్నాల సమయంలో నిజాయితీగా చెప్పేది మాపెద్దమామ్మయ్య... దాంతో ఆవిడ వుత్తిత్తినేమాటలని వూరుకొనే మాటలమనిషికాదనీ,చేతలమనిషనీ,, నిజంగానే పెరుగన్నంవద్దంటే నెత్తికి రుద్దుతుందన్నవిషయం అర్థమైపోయిందిమాకు.అందుకనే గప్ చుప్ గా ఆవిడ పెట్టిందేదో గమ్మున తినేసేవారం.
   ఇకపోతే  మా ఇంట్లో సామాన్లను  మామూలుగా బిందె,చెంబు,అనడంకాదు.వాటికి సాధారణంగా ఏదో ఒకపేరుండేది.మా అమ్మ పుట్టింటినుండి చలిమిడితో సారె తెచ్చుకున్న బిందేను చాగంటారిబిందెఅని అనడంతో,మా అమ్మపుట్టింటారు చాగంటివారని అర్థమైపోతుందికదా! అలాగే బుచ్చెమ్మగారిబిందె అంటే  మానాన్నకి అమ్మమ్మగారావిడ. గున్నమామ్మ మరచెంబని,గున్నమామ్మ అంటే,మానాన్న మేనత్తగారు.అలాగే అన్నపూర్ణచెంబులనీ,కాశీచెంబులనీ వుండేవి.,బహుశా మా పెద్దమామ్మయ్య కాశీ పద్ధెనిమాదిసార్లు వెళ్ళిందికదా!ఆ సందర్భంలో దఫదఫాలుగా కాశీనుండి తెచ్చుంటుంది వాటిని.బరంపురంగిన్నెలని,పిఠాపురం కంచుగ్లాసులని, మా పెద్దమామ్మయ్య అన్నంతినే వెండరిటాకూ,మాచిన్నాన్న వెండి అడ్డాకూ  ,తుమ్మాయమ్మగారి స్టీలు కంచం .ఇలా రకరకాల ఊర్లపేరులతోనూ ,బంధువుల పేర్లతోసహా సామాన్లంటినీ పిలిచేవారం.నేను మా పుట్టింటినుండివచ్చేసి ఏభైఏళ్ళపైమాటైయ్యింది కనుక, చాలాసామాన్లపేర్లు మరచిపోవడం సహజమేకదా!అలాగే మరచిపోయేను. ,  అలా వచ్చిచేరినవే పెద్దకంచుకంచం-చిన్నకంచు కంచం.
    తమాషా ఏంటంటే, బుచ్చెమ్మగారూ,గున్నమామ్మ,తుమ్మాయమ్మగారూ ఇలాంటివాళ్ళని మేము చూడకపోయినా, వాళ్ళపేర్లుమాత్రం మాయింట్లోవాళ్ళ నాలుకల మీదనడిచేవి.పిల్లలకు పెద్దలపేర్లు పెట్టిపిలుచుకొన్నట్లు మాఇంట్లో సామాన్లకి ఏదోఒకపేరుండేది.
    ఇంకామాఇంట్లోవున్న కంచుసామాన్లైన, బరంపురంగిన్నెలు ,రకరకాల సైజులలోవుండేవి.అలాగే ముద్దుముద్దుగావుండేవి.వాటిని దోసకాయమరచెంబనీ,గుమ్మడికాయమరచెంబనీ మరచెంబుకి అడుగునవుండే మట్టు విరిగిందికనుక కుంటిమరచెంబనీ పిలుచుకొనేవాళ్ళం.ఇలా బరంపురంగిన్నెలూ, మరచెంబులూ,బూరెలమూకుళ్ళూ మొదలైన కంచు సామాన్లన్నీ మా మూడోమేనత్త చిట్టెమ్మగారి భర్త చల్లపల్లి హనుమాన్లుగారు బరంపురంలో ఇంజనీరుగా వుద్యోగం చేసినప్పుడు, ,మా చిట్టత్తయ్య పుట్టింటికి కొని తెచ్చినవైవుంటాయి. ఆవిడపుట్టింట్లో ఏవైతే కంచు సామాన్లున్నాయో, ఆవిడ అక్కలిద్దరిళ్ళలోనూ కూడా అచ్చంగా అలాంటి సామాన్లే వుంటాయి.
    ఇక ఈ మన కథానాయికలైన కంచుకంచాలుకూడా అలా అక్కడనుంచి వచ్చినవే అయివుంటాయి.
     పెద్దకంచుకంచం చద్దన్నాలవిషయంలో చెప్పుకొన్నాంకదా!అదైపోయాకా, ఆ పెద్దకంచుకంచం ,నారెండవ చెల్లెలు ప్రకాశి బాగా చిన్నపిల్లగా వున్నప్పుడు దానిభోజనానికి ఒకవిధంగా వుపయోగపడిందని చెప్పుకోవాలి .
    మా చెల్లెలు ప్రకాశి అదే, సూర్యకుమారి బాగాచిన్నప్పుడు  కంచందగ్గరకూర్చొని అన్నంతినేదికాదు.అన్నంపెట్టేకా, కంచం నెత్తిమీదపెట్టుకొని  అక్కడికీ ,ఇక్కడికీ దానిష్టమొచ్చినదగ్గరికి పట్టుకుపోతూ ,ఇల్లంతా తిరుగుతుండేది. మడికట్టుకొని  మా మామ్మయ్య వంటచేస్తే,మా తాతయ్యగారు సత్యనారాయణమూర్తిగారు మడిబట్టకట్టుకొని,సంద్యవార్చుకొని భోజనానికి కూర్చుంటే, మామామ్మయ్య ఆయనవిస్తట్లో పప్పువడ్డించేసరికి, ఆయనకి వడ్డించిన ,పప్పులోని కందిగింజలకోసం మాతగారి విస్తట్లో కలబడేదది. మామ్మయ్య, మాతాతయ్యగారి మడి మైలపడిపోతోందని లబలబలాడేది. మా తాతగారు మనవరాలిని ఒక్కమాటైనా అననిచ్చేవారుకాదు. "పిల్లలంటే దేవుళ్ళని,వాళ్ళకు మడి,మైలా అంటవనీ,ఎంగిలీగింగిలీ అనకూడదు"అని మామ్మయ్యకి నచ్చచెపుతూ, తనపప్పులోని కందిగింజలన్నీఏరి ,దానికంచంలోవేస్తే అదిపట్టుకు పోయేది. ఇంతకీ మాచెల్లాయి కంచం ఏదనుకుంటున్నారు? మూడుకేజీలు పైన బరువుండే పెద్దకంచుకంచం.
 ఆ కంచాన్ని బాలభీముడిలా అవలీలగా పైకి లేపి తనెక్కడకెళ్ళాలంటే అక్కడికి పట్టుకు పోతుండేది నెత్తిమీదపెట్టుకొనో,పొట్టకానించుకొనో.మరి పెద్దకంచు కంచంగురించి యింత చెప్పి,చిన్నదానిగురించి అసలుచెప్పకపోతే అది చిన్నపుచ్చుకొంటుందికదా!
    దాన్ని మరీ అంత అల్లరి చేయని నాకో ,నాతరవాతచెల్లెలు చిన్నపాపకో పెట్టేవారు.
     అలాకాలం నడుస్తుండగానే, మేమూ పెద్దవాళ్ళమైపోతుండగా,ఇత్తడి ,కంచుసామాన్లపై ,తళతళా మెరిసే స్టీలు సామాన్లు వచ్చి దాడిచేయడంతో ,అవి తమఉనికిని కోల్పోయి, మొహాలు చిన్నబుచ్చుకొని ,అటకలెక్కిదాక్కోడమో,అటకలెక్కికూర్చోడమో,లేకపోతే, తమతమ విలువను కోల్పోయి ,వస్తుమార్పిడిలోభాగంగా,ఊరుదాటి పోవడమో జరిగింది.
    అయితే మాకంచు కంచాలనిమాత్రం ఎలకలు వాటిని ఎంతమాత్రమూ ఎత్తి పడదోయలేవుకనుక ,ఏ ఉప్పు రాచ్చిప్పపైనో, చింతపండురాచ్చిప్పపైనో మూతలుగా, తమ ప్రకాశాన్ని,ప్రాభవాన్నీ కోల్పోయి చింతిల్లుతూ చాలారోజులు కనిపించేవిగానీ,ఈమధ్య  మా తమ్ముడు -మరదలి హయాంలో అవి ఆమాత్రంగాకూడా కనిపించకుండా పోయాయి .ఈ సారి మా రౌతులపూడి వెళ్ళినప్పుడు  ఆరాతియ్యాలి మన కథానాయికలగురించి.
    

కామెంట్‌లు