"బ్రహ్మసత్యం జగత్ మిథ్య";-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.విజయవాడ కేంద్రం.94928 11322
 ఏ జీవి అయినా  తల్లి గర్భం నుంచి భూమ్మీదకు ఒంటరిగానే వస్తాడు రాగానే అమ్మను, నాన్నను, రక్త సంబంధీకులను  గుర్తు పడతాడు. కొంచెం వయస్సు వచ్చిన తరువాత  బంధువులు, స్నేహితులు వారంతా దగ్గరవుతారు ఎంత బలం ఉంది నాకు అనుకుంటాడు. ఆ బలగాన్ని చూసి ఎంతో మురిసిపోతాడు.  తనకు వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసుకొని  పిల్లలకు జన్మనిచ్చి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతాడు ఆ ప్రయత్నంలో ఎన్ని కష్టాలనైనా ఆనందంగా అనుభవిస్తాడు కొంచెం వయసు మీద పడిన తరువాత తానెవరో, భార్య ఎవరో, పిల్లలు ఎవరో అన్న మీమాంస వస్తోంది. వీరందరూ నాతో ఉండేవారా? ఈ సంబంధాలు ఏమిటి అని ఆలోచనలో పడతాడు.
రక్తం పంచుకు పుట్టిన వారి మీద  ఎంతో ప్రేమాభిమానాలను పెంచుకుంటాడు. కన్నవారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. నిజానికి ఈ తనువు పంచభూతాలలో కలిసేది తప్ప శాశ్వతం కాదు అని తెలిసినా నమ్మడు. జీవి  వేరే యోనిని వెతుక్కొని ఆమె గర్భంలో ప్రవేశిస్తుంది. మళ్ళీ జన్మ, పెరుగుదల, మరణము  మళ్లీ జననం అని ఆదిశంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాన్ని వేమన గారు  సంస్కృతంలో కాకుండా  ప్రజల జనభాషలో అందరికీ అర్థమయ్యేలా ఆటవెలదిలో చెప్పి  గొప్ప వేదాంతాన్ని  మన మనసులకు పట్టేలా చేశాడు.  అందుకే వారి పద్యం చదివి తీరాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
జగత్ మొత్తానికి గురువు అనిపించుకున్న శంకరాచార్యులవారు "బ్రహ్మసత్యం జగత్ మిథ్య" అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ద్వైతమే అర్థం కాని వారికి అద్వైతం ఏం అర్థమవుతుంది? ఆలోచనలతో అలా కుమిలిపోతూనే ఉంటాడు. ఈ ఆలోచన వేమన మహా యోగికీ వచ్చింది. తాను ఏమన్నారంటే, తాను ఎవరో, తన వారు ఎవరో తెలిసీ తెలియని వారు తిక్క నరులు  అన్నారు.


కామెంట్‌లు