మానవ తత్వాలు;-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
  ఉత్తములు, మధ్యములు  అధములు, అని భర్తృహరి మానవ తత్వాలను విభజిస్తే  మంచి చెడు అనే వేమన చెప్పాడు. ఏ విషయాన్ని అయినా గురుముఖతః నేర్చుకోవాలి అని వేమన అనేకసార్లు అనేక పద్యాలలో  మనకు వివరించారు. వేమన గారు గురువులను మూడు భాగాలుగా విభజించారు. కపట గురువులు, మధ్య గురువులు, ఉత్తమ గురువులు  ఇవాళ సమాజంలో ప్రజలను మోసగించడానికి కాషాయం  ప్రధాన వస్తువు అయింది.  కాషాయం చూడగానే పవిత్రత  మన మనసు లోకి వచ్చి వారికి పాదాభివందనం చేయడానికి కూడా సిద్ధపడతాం. ఎవరు ఎందుకు కాషాయం కట్టారో అని ఏ మాత్రం ఆలోచించకుండా  నిర్ణయం తీసుకుంటాం. ఇది మంచా చెడా అన్న విషయాన్ని  కాలం నిర్ణయిస్తుంది. వారితో పరిచయం అయిన తర్వాత  అతడి ప్రవర్తన బట్టి పూజలు పునస్కారాలు చూసి వాడి మంచితనమో, చెడ్డతనమో నిర్ణయించ గలుగుతాం. చెడ్డవాడు అని తెలిసిన తర్వాత మనం చేయగలిగింది ఏముంటుంది? అప్పటికే అతను ఎన్నో మోసాలు చేస్తూ  డబ్బు సంపాదించడం కోసమే వేషాలు వేస్తూ,  స్త్రీలను మానభంగం చేస్తూ, మనకు తెలియని వింత పశువుగా భావించి అతని గురించి, అతనికి చాలా దూరంగా వస్తాం.మరొక రకం గురువు ఉంటాడు మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు  వారిని ఆశ్రయిస్తే  మంత్రంతో కానీ తంత్రంతో కానీ దానిని పరిష్కరించుకోవచ్చు అని చెప్పి  కపటనాటకాలాడి డబ్బు పొందడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప మన సమస్య సమస్యగానే మిగిలిపోతుంది.  చివరి గురువు ఉత్తమమైన మంచి చిత్తశుద్ధి కలిగిన గురువు. వారి పాదాలను ఆశ్రయించి నప్పుడు యోగ విద్యను మనకు తెలియజెప్పి  మోక్ష మార్గాన్ని చూపిస్తాడు  వారు చెప్పినది మనం నిష్టతో చేసినప్పుడు యోగ సామ్రాజ్యాన్ని  పరిపాలించ గలిగిన వారమవుతాం. అలా చేయక  పాతవారిని ఆశ్రయిస్తే  ధనాన్ని పోగొట్టుకోవడమే కాక  చెడ్డ పేరు కూడా సంపాదించు కొంటాము. ఇలాంటి ఎన్నో మంచి విషయాలను విడమరచి చెప్పాడు కనుక  ఇన్ని సంవత్సరాలైనా వారి పద్యాలు ప్రజల నాలుక పైన  నిలిచి ఉన్నాయి.


కామెంట్‌లు