నిస్వార్థపరుడు బాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.విజయవాడ కేంద్రం.9492811322
 ఆకాశవాణి  విజయవాడ కేంద్రం మొదటిసారిగా లలిత సంగీత పోటీలను ఏర్పాటు చేసింది దానికి ఎస్పీ  బాలసుబ్రమణ్యం హాజరయ్యారు. బాలు తండ్రి  మా సంగీత విద్వాంసులు మల్లిక్ గారికి సన్నిహిత మిత్రుడు. ఆయన అనేక సార్లు విజయవాడ కేంద్రంలో హరికథలు చెప్పారు. దానితో మాకు సన్నిహిత సంబంధం ఉంది. కార్యక్రమం మూడు రోజులు జరిగింది చివరి రోజున  న్యాయనిర్ణేతలు బాలుకు మా కేంద్రంలో పనిచేస్తున్న లైబ్రేరియన్  వి. ఎస్ నారాయణ మూర్తికి సమాన మార్కులు ఇచ్చారు.  దానితో మా కేంద్ర సంచాలకులు, నన్ను నారాయణ మూర్తి ని పిలిచి  నీకు బహుమతి ఇస్తే రేడియో వాళ్ళు బహుమతులు పంచుకున్నారని చెడ్డ పేరు వస్తుంది కనుక బాలు కి ప్రథమ బహుమతి నీకు ద్వితీయ బహుమతి ఇస్తే నీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగారు. మీ ఇష్టం మీరు ఎలా నిర్ణయిస్తే అలా చేయండి నాకేమీ అభ్యంతరం లేదు అని సమాధానం చెప్పాడు. దాంతో నన్ను నారాయణమూర్తిని  బాలు బస చేసిన లాడ్జి కి పంపి సమాచారం అందించమన్నారు. అలాగే ఇద్దరం వెళితే బాలు సాదరంగా ఆహ్వానించాడు.  కాఫీ తెప్పించాడు తాగుతూ మేము వచ్చిన విషయాన్ని చెప్పాను అందుకు ఆయన కొంచెం బాధపడుతూ అదేమిటి అలా ఇస్తే ఆయన బాధపడతాడు కదా ఎందుకు ఇద్దరికి ఇవ్వచ్చు కదా అని అన్నాడు. జరిగిన విషయం మొత్తం చెప్పిన తర్వాత  నారాయణ మూర్తి ని పరిచయం చేస్తే అలాగే అని అన్నాడు. ఆ వయసులోనే అంత సంస్కారం కలిగిన వ్యక్తి.
బాలు తో నా స్నేహం పెరిగిన  తరువాత మద్రాసులో చాలాసార్లు కలిశాను  తాను సాధన చేసే పద్ధతి  మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది  అందరినీ కూడగట్టుకొనే మనస్తత్వం  పెద్ద చిన్న అన్న తారతమ్యం లేకుండా అందరితోనూ ఎంతో మర్యాదగా  ఆనందంగా నవ్వుతూ పలకరించటం ఆయన అలవాటు  కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమ  ఇంతా అంతా అని చెప్పడానికి  వీలు లేదు వారి చెల్లెలు శైలజ  సుధాకర్ ని వివాహం చేసుకున్న తరువాత  కొన్ని కష్టాలు కూడా పడింది. బాలు తలచుకుంటే  ఒక క్షణంలో వారిని లక్షాధికారిని చేయగలడు కారణం తెలియలేదు నాకు రక్తం పంచుకు పుట్టిన చెల్లి,  గారాబంగా పెంచుకున్న చెల్లికి సహకరించ లేడా అనిపించింది  రెండు మూడు పర్యాయాలు  నోటి వరకు వచ్చినా అడగలేక పోయాను  ఒకరోజు చాలా ఆనందంగా హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంగా  నాకు ఒక సందేహం తీర్చగలరా అంటే  మీకు అడ్డేముంది గురువుగారు అడగండి అన్నాడు.  ఏమీ లేదు  మీరు అనుకుంటే మీకు సహగాయనిగా  యుగళ గీతాలను పాడడానికి  శైలజ ను  పిలవవచ్చు కదా వారి పరిస్థితి మీకు తెలుసు అలా ఎందుకు చేయడం లేదు అన్నది నా ప్రశ్న అంటే
ఆనంద్ జీ మీ మదన  నాకు అర్థం అయింది  నేను ఒక నియమం పెట్టుకున్నాను నేను నా సొంత గొంతుతో వచ్చాను  నా స్వరం  కోదండపాణి గారికి నచ్చి వారు సంగీత దర్శకుడిగా ఉన్నప్పటికీ సినిమాలో నన్ను పాడించారు  అంతే తప్ప నేను ఎవరిని అడగలేదు. అలాగే చెల్లి కూడా తన పాటలు పాడుతుంది  సంగీత దర్శకుడు కోరితే వారే పిలుస్తారు. నా నియమావళి నేను వీడలేను అన్నాడు 
బాలు ఒక ఆశయానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా నాకు  బాలు మీద గౌరవం పెరిగింది అలాంటి తెలుగు వారు చాలా అరుదు.


కామెంట్‌లు