త్యాగరాజ స్వామి తన్మయత్వంతో పాడుతుంటే వారి శిష్యులు అప్పటికప్పుడు స్వరాలను రాయగలిగే వారు అంటే ఆ రకమైన అభ్యాసమే వారిది. ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్, కరీం ఖాన్, రోష్ణారా బేగమ్ వంటి దిగ్గజాల సంగీతం విన్న కారణంగా హిందూస్థానీ సంగీతం మీద ఆయనకు మోజు పెరిగింది. ఒక స్వరం మీద నిలిపి పాడే పద్ధతి ఆయనను ఎక్కువగా ఆకర్షించింది. ఆ గుణాలను సాధనతో సాధించి తన బాణీ కి అనువుగా మలుచుకున్న విద్వాంసులు ఓలేటి వారు. క్రియలో ఒదిగి ఉన్న స్వరాల కూర్పుని ఆయన అర్థమయ్యేలా వివరించి పాడి బోధించేవారు. అందులో రాగ భావం శ్రోతకు, ప్రేక్షకునికి ప్రస్ఫుటంగా కనిపించేది. దీక్షితుల వారి నవావరణ కృతులు, స్వాతి తిరునాళ్, నవరాత్రి కీర్తనలు మల్లాది సూరిబాబు నేర్చుకున్నది వీరి దగ్గరే. కర్ణాటక సంగీతంలో హిందూస్థానీ సంగీత ఛాయలను పలికించడం అందరివల్లా కాదు. ఆయనకు మాత్రం వెన్నతో పెట్టిన విద్య. శోబిల్లే సప్తస్వర సుందరులను తనివితీరా దర్శించ గలిగిన విద్వాంసుదంటే ఓలేటి వారే. 1956 నాటి మాట ఆకాశవాణి కేంద్రంలో సాహిత్య కార్యక్రమాల ప్రయోక్త పింగళి లక్ష్మీకాంతం గారు, రంగస్థల ప్రయోక్త- సూత్రదారుడు- నాటక శాఖ సంచాలకులు బందా కనక లింగేశ్వర రావు గారు, ఓలేటి వెంకటేశ్వర్లు సంయుక్తంగా రూపొందించిన కూచిపూడి యక్షగాన ప్రదర్శనం ఆదర్శ పరిణామాలకు కారకులు. భామాకలాపం, గొల్లకలాపం, ప్రహ్లాద, శశిరేఖా పరిణయం ఉత్తర రామాయణం లాంటి కూచిపూడి యక్షగాన రచనలు తీసుకుని ఆయా నాటకాలలో ఆయా పాత్రల వేషధారణలో ప్రామాణికతను ఏర్పరుస్తూ ఆయా నాటకాలలో వినబడే దరువులలోని రాగాలను సమన్వయపరుస్తూ స్వరయుక్తంగా నిర్దేశిస్తూ ఓలేటి వారు పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. జెమిని వారి దో దుల్హే హిందీ చిత్రంలో మొహమ్మద్ రఫీ తో పోటాపోటీగా పాడి సంగీత దర్శకుడైన బాలకృష్ణ కల్లా, రఫీ తదితర ప్రముఖులను ఆశ్చర్యచకితులను చేశారు. అలాంటి మహానుభావులు మా కేంద్రంలో పనిచేయడం నా నాటకాలలో పాడవలసిన పాటలూ, పద్యాలూ పాడడం నాకు కలిసొచ్చిన అదృష్టం. నా నాటకాలు విజయవంతం కావడానికి బందా గారు ఎంత ముఖ్యకారకులో వీరు కూడా అంతే...
సంగీత విద్వాన్... ఓలేటి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి