శబ్ద స్ఫూర్తి సినారె కవితా సృష్టి;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.
అతడు 
అక్షరాల తోటలో వాడిని పువ్వు
పరిచిన పరిమళం మట్టి మనిషి
ఆకాశం అంచులు దాటిన కవిత

అతడేగా
నాగార్జున సాగరమై ప్రవహించిన
గేయ కావ్య బుద్ధుడు
కర్పూర వసంత రాయలు పలికిన
లకుమాక్షర సుందర గేయ బద్ధుడు
చరిత్ర లిఖించిన కావ్య లేఖిని శబ్ద స్ఫూర్తి 

అతడే గదా
విశ్వ వీణపై మనిషిని నిలిపి
విశ్వంభర కావ్యసృష్టిని మీటినాడు
ప్రకృతి ప్రేమతో అక్షర గవాక్షాలు తెరిచి
ప్రపంచపదుల గేయకావ్యామృతం
విశ్వ వీధులందాలపించినవాడు

అతడే గదహో!
గాలిబ్ గజల్ ప్రేమ గీతాలవోలే
సినారె గజళ్ళు స్నేహ భావాలు రాసే
అమ్మ ఘనతను నొక్కి నొక్కి చెప్పినాడు
పసుల పోచమ్మతో పలికిన కలం అక్షర సిరి మూలవాగు ఊట
వ్యసోపన్యాసాల హన్మాజిపేట రాత 
మంటలు మానవుని తాకిన కవి కొండ
అక్షరాల కర్పూర కవిత్వ దండ సినారె
జలపాతాలు హొయలతో దూకితే
జ్వలపాతాలు పుట్టించే ఉష్ణతాపం
సినారె కవితా సృష్టి 
నదులు, ప్రకృతి,కవితా ప్రేమలతలై
పరుచుకొన్నది సినారె కళా హృదయం

అతడే జయహో
బుచ్చమ్మ కొంగు బంగారు అక్షర ఉలి
మల్లన్న చూపు నేత్రం కావ్యమాలలై
ఒదిగి ఎదిగిన భారతీయ జ్ఞానపీఠం
కరీంనగర్ మట్టి నడిచిన అక్షర పాదాలు
భాగ్యనగర ఘన సాహితీ సిగలో తురిమిన మరుమల్లె సిరిమల్లే 
మానవీయ మహా కవి సినారె

అతడే ఔనౌనహో
పదవులెన్ని పొందిన గానీ
విద్యా విశారద శరధి సినారె
తృప్తి దీప్తులు దశదిశ వ్యాపించ
గురుపీఠమెక్కిన సామాన్యుడు
శిశ్యప్రశిశ్యులతోడ అసమాన్యడు
తపన బోధనయందు మెరిసి నిలిచే
"సమగ్రాంధ్ర సాహిత్యము సంప్రదాయాలు,ప్రయోగాలలు"   
 పరిశోధనలో ఉద్గ్రంధ శోధనై వెలిగే
ప్రామాణిక పరిశోధక సాహిత్య గవాక్షం
విశ్వ విను వీధుల్లో రెపరెపలాడే 
 తెలుగు సాహితీ శిరశ్శిఖరం ఊపిరి

అతడే సినారే 
చిత్రం భళారే విచిత్రం
పగలే వెన్నెల జగమే ఊయల
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, 
 తోటలో నా రాజు 
 ఒంపు ఒయ్యారాలు ఒంపిన
 శ్లిష్ట సినీ గీతాలెన్నో అలా..అలా..
నిన్నటి అందాలను నిదురలేపే నేటికీ సినీ వినీలాకాశంలో
ఆడదే మయూరీ,శివరంజనీ
సుధా రాగసుధా అనురాగసుధా,
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరం రాగ పదయోగ సమభూషితే
పద పదంలో కావ్య భాష ముద్ర   
 వెలిగించిన సాహితీ వల్లభుడు సినారె
బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె భువిని గాలిలో నడయాడె కావ్యమై

(29-7-2022నాడు డా‌. సినారె గారి 91వ,జయంతి సందర్భంగా...)

కామెంట్‌లు