తీర్థం!!?; - ప్రతాప్ కౌటిళ్యా
ఇన్నాళ్లు రామచిలుకలు
జ్యోతిష్యం చెప్పాయేమో కానీ
ఇప్పుడు సీతాకోచిలుకలు
దండుగా ఖండాలు దాటుతున్నవి!!!


చీకటిని తాగిన మినుగురు పురుగులు
నక్షత్రాలకు రెక్కలై
విశ్వమంతా ఎగురుతున్నవీ!!?

బెల్లం ఉన్నంతసేపు
ఈగలు ముసురుతాయేమో కానీ
తేనెటీగల గురించి
తెలియనట్లుంది!!?
తూనీగలు గగనతలంపై
తలలు ఎగిరేస్తున్నవి!!?

సముద్రానికి నీలిరంగు అందం
మకరందం తుమ్మెద కు ఆనందం
పూలకు ఎంగిలేమిటీ
పొలాలకు కౌగిలేమిటి!!?

పరుగులు తీసే ప్రపంచం
పురుగుల లోకంతో
ఎప్పుడు గెలుస్తుంది!!?

మట్టిలోంచి పుట్టిన చెట్టు
మనసులోంచి పుట్టిన గుట్టు
మనిషి సమాధుల దగ్గర
నిద్దుర పోతున్న వేళ
కనీసం కాకుల ఆకలి తీర్చలేక పోతున్నాయి

ఎత్తుగడలు తెలియని విత్తుకు
నిలువెత్తు విగ్రహం కట్టిన
రైతు ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు
పురుగులకు మందు
బ్రతుక్కు మందయింది!!?

మందగా ఎగిరే పక్షులు
గంధం వనంలో
అందంగా ముస్తాబ్ అవుతున్నాయి!?

పైరుకు పేరంటం పిలుపు వచ్చింది
అభయారణ్యాలను
ఆభరణాలుగా ధరించాలనుకుంటున్నాయి!

ఒదిగిన భూమి
స్త్రీగా మారాలనుకుంటుందేమో
ఆడతనం లేని ఆకుపచ్చని పొలాల్లో
రెక్కల పూలై వెన్నెలను తాగుతుంది
రేపటికల్లా ఒళ్లంతా
తెల్లని వస్త్రాలను కప్పుకుంటుంది!!?

మంటలను పుట్టించిన చెకుముకి రాయి
మంటల్లో కరిగి
మహా పర్వతమైనట్లు
అరణ్యాలన్నీ కాలిపోతూ
శపిస్తున్నాయి!!?

సముద్రం
ఉప్పెనలే కాదు
ఉప్పును కూడా ఇస్తూ
తీరం రుణం తీర్చుకుంటూ

శంఖంలోని నీరు
తీయని తీర్థమైనట్లు
ఆశీర్వదిస్తుంది!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు