"ఆద్య ఆరియాలతో మేము ";-ఏ.బి ఆనంద్,-డా.నీలం స్వాతి
 బాల్యం ఎంత ముచ్చటగా ఉంటుందో అంత అందంగా ఉంది ఈ నవల. గురువుగారి తొలి ప్రయత్నం సఫలీకృతమైనది. ఈ పుస్తకం చదివిన తర్వాత మీ అనుభవం ఏదైనా,
ఈ నవల చదువుతున్నంత సేపు మీరు చిన్నపిల్లలయిపోయి ఉండడం నిజం. పసిడి నవ్వులతో, పాల బుగ్గలతో పసితనపు పరదాల క్రింద ఆద్య, ఆరియా అనే ఇద్దరి చిన్నారులు నిర్మించుకున్న అందమైన ప్రపంచం. ఈ అక్కా చెల్లెళ్ళ ఆటలు, పాటలు, అందమైన అమాయకత్వమే  ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి. పిల్లల అభిరుచులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఈ చిన్నారుల ముచ్చట్లన్నీ విన్నాక సారీ సారీ...! చదివాక వారి మనస్తత్వాల పై
కాస్తంత అవగాహన అయితే వచ్చింది. ఆరియా వయసు రెండేళ్లయినా తన అలవాట్లు మాత్రం పరిణతి చెందినట్లే  కనిపిస్తున్నాయి. అక్కను అనుసరించడం ఆరియాకు అలవాటు. అక్కతో గొడవ అయితే పడుతుంది కానీ, కాస్తంత ఎడబాటును కూడా తట్టుకోలేదు. ఆద్యకు సృజనాత్మకత ఎక్కువ అందుకే ఎప్పుడు తన 
హాబీస్ అయిన డ్రాయింగ్, పెయింటింగ్ లో తన సత్తా చాటుతుంటుంది. నిజం చెప్పాలంటే ఆప్యాయతలు, అనురాగాలే మన ఆస్తులు. 
ఆ బంధాలే లేకపోతే జీవితమంతా 
ఒక్కరై ఒంటరితనాన్ని  అనుభవించాల్సి వస్తుంది. 
అవగాహన పూర్తిగా లేకపోయినా ఆద్యకు తన అత్తతో వున్న చనువును, తాతయ్య, నానమ్మల ప్రేమను కోరుకోవడం చూస్తుంటే  పాశ్చాత్య సంస్కృతిలో తెలుగుదనం పరిమళించిందా అనిపించింది. ఓ 
వైపు పిల్లల చేష్టలను వివరిస్తూనే మరోవైపు న్యూజిలాండ్ లోని ప్రకృతిని, వాతావరణాన్ని, పరిసరాలను, వింతలను, అందాలను
మనకు పరిచయం చేశారు సూరి గారు. అంతేకాదు అక్కడ విద్యా విధానాన్ని, 
పిల్లల అభిరుచుల పట్ల తల్లిదండ్రుల తీరును సున్నితంగా వర్ణిస్తూ మన వ్యవస్థలోని లోపాలకు గల కారణాలను సమాధానపరిచేలా సలహాలను అందించారు.
ఒక్కోసారి ఈ పిల్లల నడవడికను గమనిస్తే
ఆశ్చర్యమేస్తుంది ఇన్ని తెలివి తేటలు ఎలా వచ్చాయా అని? తాతయ్యకు ఆద్య ఇచ్చిన సలహా డబ్బు గురించి, సమయం గురించి తన ముద్దు ముద్దు మాటలతో వివరించిన తీరు నేటి తరాలు ఎంత పరిశీలన కలిగి ఉన్నారో అనడానికి ఇదో ఉదాహరణ. ముఖ్యంగా ఈ పుస్తకంలో నాకు నచ్చినవి ఈ చిన్నారుల ఛాయచిత్రాలు (ఎన్ని పోజులో). బుక్ డిజైనింగ్ కూడా చాలా అందంగా వచ్చింది. జ్ఞాపకాలకు అక్షరాల రూపాన్ని అందించి పదిలమైన కానుకగ ఆద్య ఆరియాలకు బహూకరించడం సమంజసం.
ఆద్యా -ఆరియా
మీ తాతయ్య అందించిన ఈ గిఫ్ట్ మీకే కాదు మాకు నచ్చింది.
ఈ ఇద్దరి బంగారు తల్లుల జర్నీ ఇలా హ్యాపీ హ్యాపీగా  సాగిపోవాలని బుజ్జి తల్లుల వివరాలను అందంగా మన చేతికి అందించిన గురువు గారికి కృతజ్ఞతలతో...

మీ కుటుంబ సభ్యులు,
ఏ.బి ఆనంద్,
డా.నీలం స్వాతి

కామెంట్‌లు