దుర్గుణాలు;- : సి.హెచ్.ప్రతాప్
 రామా పురానికి ఒక సాధువు వచ్చారు. ఊరిలో వున్న రామాలయంలో బస ఏర్పాటు చేసుకున్న భక్తులతో సద్గోష్టి తో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలను చేయసాగారు.ఎందరో భక్తులు నిత్యం ఆయనను దర్శించుకుని తమ సందేహాలను తీర్చుకోవడం తో పాటు ఆయన ఆశీర్వచనాలను కూడా పొందేవారు.
ఒకరోజు ఒక జమీందారు ఆయనను దర్శించుకునేందుకు వచ్చాడు. రెండు చేతులతో బొత్తాయి పళ్ళను పట్టుకొని సాధువు దర్శనం కోసం ఆయన ఎదుట నిల్చున్నాడు.
ఆ సమయంలో సాధువు ధ్యానంలో వున్నారు. కాస్సేపటి తర్వాత ఆయన కళ్ళు తెరిచి జమీందారును దానిని కింద పడెయ్యి అన్నారు.
తొలుత ఆ మాటలు జమీందారుకు అర్థం కాలేదు. సాధారణం గా ఎడమ చెయ్యిని భారతీయులు అపశకునంగా భావిస్తారు.బహుశా తన ఎడమ చేతిలో వున్న ఫలాలను కింద పడెయ్యమంటున్నారనుకొని రెండు బొత్తాయిలను కింద పారేసాడు.
సాధువు మళ్ళీ" దానిని కింద పడెయ్యి" అన్నారు.
ఈసారి కూడా ఎందుకు కింద పడెయ్యమంటున్నారో జమీందారుకు అర్ధం కాలేదు. సాధు సత్పురుషులను దర్శించుకునేందుకు వెళ్ళేటప్పుడు  పండ్లు, ఫలాలను తీసుకు వెళ్ళలంటోంది శాస్త్రం.


బహుశా తాను ఎడమ చేతితో పట్టుకున్న ఫలాలు అపవిత్రం అయ్యి వుండవచ్చునని లేదా ఈ సాధువుకు పళ్ళు లేదా ఫలాలు తీసుకోవడం ఇష్టం లేకపోయి వుండవచ్చునని అనుకున్న ఆ జమీందారు మిగతా ఫలాలు కూడా కింద పారేసాడు. అప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించాడు.


ఆ సాధువు తిరిగి " దానిని కింద పారెయ్యి" అని అన్నారు.ఇప్పుడు ఏం చెయ్యాలో జమీందారుకు పాలుపోలేదు. తన చేతిలో లేని వస్తువులను ఎలా కింద పారేయ్యాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఆ మాటే సాధువుతో అన్నాడు.
" నాయనా, నేను కింద పారెయ్యడం అంటే త్యజించడం లేదా ఒదిలి పెట్టమని  అర్థం. నీలో వున్న అహంకారాన్ని, ధనార్జన కాంక్షను, గొప్ప జమీందారునన్న అహంభావం, కింద వారిని, తోటి ప్రజలను చులకనగా చూసే తత్వాన్ని,పన్నుల భారంలో ప్రజలను పీడించుకొని తినే మనస్తత్వాన్ని.ఇప్పుడు నీలో కామం, క్రోధం, మోహం, లోభం , మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువులు లాంటి దుర్గుణాలు వున్నాయి. వాటిని వదిలించుకోకపోతే నిజమైన ఆనందం అనుభవం అవదు. పైగా చేసిన పాపాలను ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో అనుభవించక తప్పదు. అలా అనేక జన్మల చక్రభ్రమణం లో పడిపోతే ఇక మోక్షం ఎలా దొరుకుతుంది ? అందుకే దుర్గుణాలను వదిలెయ్యి. సుగుణాలను వృద్ధి పరచుకో. సాటి వారి పట్ల, సాటి జీవుల పట్ల ప్రేమ, కరుణ, దయ పెంపొందించుకొని ఆనందంగా జీవించు"
సాధువు యొక్క ఉపదేశం తో జమీందారు లోని అజ్ఞానం పటాపంచలై పోయింది. నాటి నుండి తనలోని దుర్గుణాలను తొలగించుకొని, సుగుణాలను పెంపొందించుకుంటానని ధృఢంగా  సంకల్పం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు.

కామెంట్‌లు