దేనికైనా అంకితభావం ప్రధానం;-- యామిజాల జగదీశ్
 ఓరోజు ఒక భక్తుడు ఆ పిచ్చుక కథేమిటీ అని అడిగారు.
"అదా!" అంటూ భగవాన్ రమణ మహర్షి ఆ పిచ్చుక కథ చెప్పారిలా....
ఓ పిచ్చుక తన ముక్కతో ఓ గుడ్డుని తీసుకుపోతుండగా అది జారి సముద్రంలో పడిపోయింది. అయితే ఆ గుడ్డుని సముద్రంలోంచి బయటకు తీయాలనుకుంది పిచ్చుక.
పిచ్చుక సముద్రంలోని నీటినంతా తన ముక్కుతో తీసి ఒడ్డున పడేద్దామనుకుంది. 
అప్పుడు సముద్రంలో పడ్డ తన గుడ్డు దొరుకుతుందనుకుంది. అనుకున్నదే తడవుగా అది ముక్కుతో నీటిని తీయడం, ఒడ్డున పడేయడం కొనసాగించింది. 
కానీ ఎంతసేపటికీ సముద్రంలో నీరు రవ్వంతకూడా తగ్గలేదు. 
అయినా పిచ్చుక తన ప్రయత్నం మానలేదు. 
 
ఇంతలో అటువైపు వచ్చిన నారదుడు ఆ పిచ్చుక చేస్తున్న పనిని గమనిస్తూవచ్చాడు. అది ఎందుకలా చేస్తోందో తెలుసు కోవాలనిపించింది నారదుడుకి.
"ఏమిటి విషయం?" అడిగాడు నారదుడు పిచ్చుకను.
పిచ్చుక తన ప్రయత్న విషయాన్ని చెప్పింది.
అప్పుడు నారదుడు "ఓసీ పిచ్చిదానా, అది నీవల్ల అయ్యే పనేనా?" అని అడిగాడు.
"అవుతుందా? అవదా? అనే దిగులు నాకు లేదు.  పట్టు వదలక చేస్తూ ఉంటే పైనున్న ఆ దేవుడ చూస్తూ ఊరుకుంటాడా? సాయం చేయకపోడా" అంది పిచ్చుక.
అంతట నారదుడు పిచ్చుక నమ్మకానికి సంతషించి గరుత్మంతుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి "మీ పక్షి జాతికి చెందిన ఓ బుల్లి పిచ్చుక అంత శ్రద్ధగా ప్రయత్నిస్తుంటే నువ్విక్కడ ఉత్తినే ఉండవచ్చా? నువ్వెళ్ళి దానికి సాయం చేయొచ్చు కదా?" అని అడిగాడు.
నారదుడు చెప్పినదంతా విన్న గరుత్మంతుడు ఆ క్షణమే ఎగురుకుంటూ వెళ్ళి రెక్కలతో విసరగా సముద్రజలం రెండు భాగాలైంది. మధ్య ఏర్పడిన ఖాళీ జాగాలో సముద్రంలో జారిపడిన పిచ్చుక గుడ్డు కనిపించింది. గరుత్మంతుడికి కృతజ్ఞతలు చెప్పి పిచ్చుక గుడ్డుని ముక్కుతో తీసుకుని ఆనందంతో ఎగిరిపోయింది.
గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి. శ్రీ మహావిష్ణువు వాహనంగా ప్రసిద్ధి చెందాడు గరుత్మంతుడు. అతను మహాబలశాలి.  వినయశీలి.
అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, మంచి పనులు చేసేవారు "ఇది తన శక్తికి మించిన పని అనుకోకుండా తనకెవరూ సాయం చేసేవారు లేరని ఆందోళన చెందక తామనుకున్నది అంకితభావంతో శ్రద్ధగా చేస్తే పరమేశ్వరుడి తోడు తప్పక ఉంటుంది.
పిచ్చుక ముక్కుతో తీసి ఒడ్డున వేస్తే సముద్రజలం తగ్గతుందా? పాపం, దానికా వాస్తవ స్థితి తెలీదు. అయినా అది శ్రద్ధగా పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నాన్ని కొనసాగించింది. పిచ్చుక ప్రయత్నానికి గరుత్మంతుడెలా తోడ్పడ్డాడో అలాగే ఓ మంచిపని కోసం అంకితభావంతో కృషి చేసే వారికి తప్పకుండా ఏదో ఒకరోజు భగవంతుడి దయవల్ల సత్ఫలితం లభిస్తుంది. శ్రమ వృధా పోదు. ఏ పని చేసినా నమ్మకం అంకితభావం ముఖ్యమన్నారు భగవాన్ రమణ మహర్షి.

కామెంట్‌లు