మా ఈరవ్వ కథ ....!!-----రామశాస్త్రి.నాగిళ్ల --హన్మకొండ.
  ఇది మాతాత దగ్గరినుంచి మొదలైంది.
మాకు పక్క ఊరిల పురోహితం ఉండె.ఆ వూర్ల ఒక యాదవుల ఇంట్ల అమావాస్యనాడు ఒక ఆడపిల్ల పుట్టింది.
"అమాసనాడు ఆడిపిల్ల పుట్టింది అష్టదరిద్రం  పెంటమీద పారేస్తం "అని ఆపిల్ల తలిదండ్రులన్నరట.మాతాత అదేంకాదు అని నచ్చచెప్పేప్రయత్నం చేసిండట.అయ్యగారి మాటలకంటె కులప్రభావం ఎక్కువగాపనిచేసి ఆపిల్లను పారెయ్యటానికి నిశ్చయించుకున్నరట.మాతాత చెంద్రయ్య గారు ఇట్లన్నడట "" మాఇంట్లపనిచేసే ఆమె ఒకామె ఉన్నది దానికి పిల్లలు లేరు . లచ్చమ్మ దానిపేరు..దానికియ్యున్రి  సాదుకుంటది. ఎట్లైన పారేస్తరంటున్నరుకద .లచ్చమ్మకిస్తే మీకేం నష్టముండదిగద "అని నచ్చ చెప్పి కులపెద్దలతోటి మాట్లాడి ఆపిల్లను లచ్చమ్మకిప్పించిండు. లచ్చమ్మ ఆపిల్లకు'వీరమ్మ' అని పేరుపెట్టి సాది,వాళ్ళ కులం పిల్లగానికిచ్చి లగ్గంచేసింది. కాని వీరమ్మ ఆయనను వదిలి పెట్టి ఇంకోకులంల తనకు నచ్చినోనితోటిమార్మానం బోయింది.ఈయనది వేరే కులం .ఆయనకిదివరకే లగ్గం ఐంది కాని వీరమ్మను మనువాడటానికి తయారుగుండె.మార్మానం బొయినా సాదుకున్న తల్లి దగ్గరనే ఉండి మా ఇంట్ల పనిచేసేది తల్లితోపాటుగ .లచ్చమ్మ అప్పటికే పెద్దమనిషి. "నావశమైతలేదు బిడ్ఢా నువ్వు అయగారింట్ల పని జెయ్యి నీపానం గాపాడినోడ"ని అనంగనే వీరవ్వ "అట్లనే "అన్నది.వీరవ్వను మార్మానం తెచ్చుకున్నాయన కూడా ఒప్పుకున్నడు మాఇంట్ల పనిచేయటానికి.మా  పెద్దన్న పుట్టినప్పటినుంచి వీరవ్వ మాఇంట్ల పని చేసుడు మొదలు పెట్టింది.మాఇంట్ల అన్నిపనులు జేసి  తన ఇంటికి బొయ్యేది.మాపెద్దన్న పుట్టిన సంవత్సరం శుక్ల నామసంవత్సరం( అంటె1930  సుమారు). అష్పటినుంచి మాఇంటితో తనకూ విడదీయరాని అనుబంధం. తనకు పిల్లలు లేరు ఐనా తన సవతిపిల్లలనే తన పిల్లలనుకున్నది వాళ్ళకు కూడా వీరవ్వమీద పావురం. అట్లనే మాఇంట్ల మేమందరం అంటే గూడ చాన పావురం.మేం పొయిన వాండ్లు పోంగ ఆరుగురం .ముగ్గురు మొగ ముగ్గురు ఆడ.
మాఅందరినీ అన్నితీర్ల అరుసుకునేది.నాకంటేముందరి వాండ్ల నెట్ల అరుసుకున్నసంగతి మా అన్నలు అక్కా చెప్పంగ విన్న నాతర్వాత వాండ్లసంగతిప్రత్యక్షంగచూసిన..
అట్ల మాఅన్నలకు పిల్లలైనాక .మా అక్కకు పిల్లలైనాక మాకు( నాకు) పిల్లలైయేవరకు వయసు పైబడ్డా పిల్లలందరినీ ఆమే చూసుకునేది.
 నాకు బాగా యాది మేమేమన్నా లొల్లి జేస్తే "ఇగొ రామచంద్రయ్యా ఈపుమీద ఒక్కటి గుద్దుతమరి.ఏమనుకుంటాన్నవో .?నీలొల్లిసంగతిఅమ్మకుచెప్త "అని బెదిరించేది.
 మాఅందరికీ మాఅమ ఎన్ని సేవలు చేసిందో అన్ని సేవలు చేసింది ఈరవ్వ.మా పెండ్లిళ్ళు ఐపోయినాక కూడా మా పిల్లలు కొద్దిగ పెరిగినాక కూడా,రెణ్ణెల్లకో మూణ్ణెల్లకోవరంగల్ వచ్చి చూసి పోయేది. మా అమ్మ కాన్సర్ తో బాధపడుతున్న రోజుల్లో  మాఅమ్మకు సకలసేవలూ తనే. తను దాదాపు తొంభైఏండ్లు బతికి దేహం చాలించినప్పుడు అందుబాటులో వున్న మాచిన్నన్న ఆమె అంత్యక్రియలలో పాల్గొని మాకుటుంబం రుణం కొంత తీర్చుకోగలిగిండు.
---రామశాస్త్రి

కామెంట్‌లు