విజయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 హరి పూలమాలలు అల్లేవాడు.రాజగృహనగరంలో ఒకగోష్ఠి జరుగుతోంది. అందుకే పూలకు గిరాకీ పెరిగింది. హరి అతని భార్య పూలుకోసి బుట్టలనిండా నింపారు.వారు  ఒక  యక్షుని భక్తులు! దగ్గరలోనే యక్షుని ఆలయం ఉంది. అందులో  కేవలం కొయ్యవిగ్రహం మాత్రమే ఉంది. ఆరోజు గుడిలో ఆరుగురు ఉన్నారు. గోష్ఠిలో పాల్గొనాలి అని వచ్చారు.వారి కన్ను హరిభార్యపై పడింది. అతన్ని చెట్టుకి బంధించి ఆమెపై మృగాల్లా విరుచుకు పడ్డారు. హరి నిస్సహాయంగా రోదిస్తూ యక్షుని విగ్రహం వైపు  చూస్తూ  ఉరిమాడు."నిన్ను ఇన్నాళ్లు మేము భక్తి శ్రద్ధలతో కొలిచాం! నీముందు ఇంత రాక్షస దౌర్జన్యాలు జరుగుతుంటే చూస్తూ ఉన్నావా?" అని అరుస్తూ స్పృహ తప్పాడు.భయంకరమైన శబ్దం వినవచ్చింది.హరి బంధవిముక్తుడై యక్షవిగ్రహం చేతిలోని బల్లెంతీసుకుని దుర్మార్గులని చంపేశాడు.భార్య శవమై పడుంది.ఆరోజు నించి పూలవ్యాపారి హరి  పిచ్చి వాడిలా మారి కన్పడేవారిని నరికి పోగులు పెట్టేవాడు. జనం భయంతో అతనికి  దూరంగా వేరే బాటపై నడిచేవారు. కొన్నాళ్ళకి భగవాన్ మహావీరుడు రాజగృహానికి వచ్చాడు. ఆయక్షుని ఆలయం ముందు నించే మహావీరుడు బసచేసిన ప్రాంతం కి వెళ్ళాలి.కానీ జనం భయంతో ఇళ్లల్లోనే కూచున్నారు.సుదర్శనుడు అనే భక్తుడు భగవాన్ దర్శనంకోసం బైలుదేరితే తల్లి దండ్రులు ఏడ్వసాగారు"నాయనా! మాకంటి దీపానివి.ఆపిశాచి నిన్ను చంపేస్తాడు "అని చెప్పినా మొండిగా  బైలుదేరాడు.ఆలయం దగ్గర హరి యముడి లా నిలబడి హుంకరించాడు"నన్ను ధిక్కరించి అడుగు ముందుకు వేయలేవు.ఖబడ్దార్!" "నేను భగవాన్ మహావీరుని శిష్యుడు ఉపాసకుడిని.హింస భయం వదిలేస్తే  మోక్షం సిద్ధి కలుగుతాయి.చావు సత్యం!" "సరే కాచుకో" అంటూ బల్లాన్ని చేతుల్లోకి తీసుకున్న హరి చేతులు  అలాగే  ఉండి పోయాయి.ఎంత ప్రయత్నిస్తున్నా బిగుసుకుపోయిన చేతులు చూసి బావురుమన్నాడు.హరిలో గొప్ప మార్పు వచ్చింది."నేనూ భగవాన్ శిష్యుడిగా మారుతా"అని వెక్కి వెక్కి ఏడుస్తూ  బల్లెంని గిరాటేసి సుదర్శనుడితో కల్సి భగవాన్ మహావీరుని దర్శించాడు. అతని మనోవికారాలు మాయమైనాయి.సన్యాసి గామారాడు.కానీ అతన్ని చూస్తూ నే జనం భయంతో హాహాకారాలు చేశారు. "వీడే నాతండ్రిని చంపాడు..వీడే నాకొడుకు ని పొట్టన పెట్టుకున్నాడు "అని రాళ్లు  కర్రలతో చితకబాదుతున్నా శాంతంగా భరిస్తున్న హరి ని చూసి జనం విస్తుబోయారు. ముక్కున  వేలేసుకున్నారు.వారికి విసుగెత్తింది.ఆ పై వాడిపై సానుభూతి కలిగింది. అలా హింసపై అహింస  విజయం సాధించింది. 🌹
కామెంట్‌లు