కన్హరీ గుహలు ...; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
కన్హరీ గుహలు .ముంబాయి నగరమునకు దాదాపు 20 మైళ్ళ దూరములో ఉన్నాయి. ఇవన్నియు మొత్తము 108 అని చెప్పవచ్చును. ఈ గుహ వర్గమందు చాల గుహలందు శిల్పవాస్తుప్రదర్శన ఏమియు కనబడదు. నిర్ణయక్రమము రీతిగాని వీటియందు కనబడదు. రాతిని మలచిన గూండ్లవలె ఉండును. క్రీ.పూ. దాదాపు 100 సం.లనుంచి 800 సం.ల వరకు మలచి నిర్మితమయిన మహాగుహవర్గము. ఇచట అనేక గుహలు, మరల మరల మార్పులు చెంది, తొలిరూపము తెలియకుండా మార్పు చెందినవి. ఈ గుహలందు బ్రాహ్మీలిపి శాసనములు అనేకము ఉన్నాయి. ఆంధ్రశాతకర్ణి రాజుల చరిత్ర ఇచట చాలావరకు లిఖితమయి ఉన్నదని పండితుల అభిప్రాయము. వెళ్ళడానికి రూట్ : బోరివలి నేషనల్ పార్క్ . లోకల్ రైల్వే స్టేషన్ : వెస్ట్రన్ రైల్వే లైన్ - బోరివలి స్టేషన్ 
చిన్నపుడు ఇసుకలో ఆటలు ఆడుకునే ఉంటారుకదా..ఇసుకలో ఆటలాడు కోవడం తడి తడిగా వున్నఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వారా మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసినవిషయమే., మీ జ్ఞాపకాలకి ఆలోచనని జోడిస్తే కొండలను తొలచిన విధానం మీ ఉహకు అందుతుంది. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహాలయాలను నిర్మించారు.మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు
కన్హరీ గుహలయందు అనేక గుహలు నేడు మనము ఎరిగిన గృహనిర్మాణపద్ధతులను అనుసరించే నిర్మితమయి నేటికిని వాసయోగ్యముగ ఉండును. ఈగుహలందు కొన్ని మాత్రమే రూపశిల్పములచే అలంకృతమయినవి. ఒకటి తెందు గుహలందు చిత్రలేఖనము కానవచ్చును. అనేకకారణములవలన శిథిలమయిన ఈగుహల తొలిశోభ నేడు మనము చూడలేము.
ఈగుహలందు ముఖ్యముగా గమనింపదగగినది మొదటి గూహ అయిన ఒక మహా చైత్యగుహ. ఈగుహ ద్వారబంధముపైన యజ్ఞశ్రీశాతకర్ణి శాసనము ఉంది.ఈ చైత్యము నిజముగా ఆనాడే ఏర్పడినప్పటికి, అనేక రూపాలంకారశిల్పములు చాల కాలమూయిన తరువాత ఇందు మలిచినందువలన, దీని పూర్ణప్రథమస్వచ్ఛ రూపము మనకు తెలియదు.
ఈగుహ ఏర్పాటంతయు కార్ల గుహలు పోలినది. గుహకు ఎదురుగా, కొలదిదూరమున ఒక చిన్నఅడ్డగోడ ప్రాకరమును ఉద్దేశించును. ఈ ఆడ్డగోడ బాహ్యమతయు శిల్పముచే అలంకృతమయినది. ఈ అలకారశిల్పము గౌతమిపుత్రగుహ అడ్డగోడశిల్పమువలెనే ఉండి, అమరావతీ ప్రాకారశిల్పమును స్మృతికి తెచ్చును. బహుశా ఈ అడ్డగోడ అలంకారము గుహనిర్మాణమయిన కొంతకాలము తరువాత చేర్చియుండబడి ఉండవచ్చును. ఈ గుహముఖమంతయు గౌతమిపుత్ర గుహముఖమును పోలియున్నది. ఈగుహాశిల్పములందు ఒక చిత్రమందు ఏర్పడిన జంతురూపచక్రసంకలనము అమరావతిశిల్పశైలిని అనుకరించబడి ఉంది. ఈ గుహకు ఎదురుగా ఇరువైపుల రెండు ధ్వజస్తంభములు ఉన్నాయి. ఒక స్తంభమునకు శిరస్సుపైన అశోక స్తంభములకువలె నాలుగు సింహములు ఉన్నాయి. రెండవదానిపై మూడు కుబ్జరూపములు మలిచి ఉన్నాయి. వీటికి పైన పెద్ద ధర్మచక్రములు నిర్మితమై ఉండినట్లు పండితుల ఊహ.
గుహలోపల చైత్యమందు 34 స్తంభములు ఉన్నాయి. వీటియందు 12 మాత్రమే పీఠము, అధిష్టానము, కుంభము, గ్రీవము, బోధిక మొదలయిన భాగములు కలిగి, పుర్ణముగా ఉన్నాయి. ఈ స్తంభముల వాస్తు కార్ల గుహలను పోలి ఉన్నాయి. కాన మానప్రమాణములు సమముగా ఏర్పడక కొంతమోటుగా ఉన్నమాట వాస్తవము. స్తంభశిరస్సులందు బోధికభాగమున ఏర్పడిన శిల్పములు సయితము, స్వచ్ఛతను తప్పి, కొంత లోటు పడిన మాట వాస్తవము. చైత్యోపరిభాగమున కప్పుకు ఆనాడు నిర్మించిన కొయ్యచట్టమంతయు శిథిలమయి అదృశ్యమైనది. ఈగుహ అంతర్భాగము దాదాపు 17 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు కలిగి ఉండును.
ఈ గుహాంగణమందు అనేకశిల్పములు ఉన్నాయి. ఇవి చాల శిథిలయినవి. ఇక్కడ బాగా ఆకర్షించునవి పార్స్యకుడ్యములందు మలిచిన బుద్ధరూపములు. ఇవి 13 అడుగుల ఎత్తున అద్భుతముగ ఉండును. ఈ బుద్ధముఖములందు మహాయానస్థులు సిద్ధంతీకరించిన కరుణ అతి స్పష్టము. ఈ మహాశిల్పములు గుహ నిర్మితమయిన రెండుమూడువందలఏండ్లకు మలిచి ఉండవచ్చును.
గుహ సింహద్వారమునకు ఇరువైపుల గోడన మలిచిన రూపశిల్పములు తొలినాటివే. ఇవి సంపూర్ణముగా ఆంధ్రములు. ఇక్కడ బాగా ఆకర్షించునవి సోదర శిల్పములు. ఈ సోదరరూపములు ఆనాడు ఈగుహనిర్మాణమునకు కావలిసిన ధనమునిచ్చిన ధనికులవని ఆనాటి శాసనములు తెలుపుచున్నవి. ఇవి మనిషి ప్రామాణమున ఉన్నాయి. ఈ రూపములు సంపూర్ణజీవము కలవయి, తాము నిర్మించిన చైత్యగుహకు అందరిని ఆహ్వానించుచున్నరీతిని గోచరించును. ద్వారబంధమునకు ఎడమవైపునున్న స్త్రీముఖమందలి మందహాసము, ఐరోపానందు అతిప్రఖ్యాతి వహించిన డావించీ మోనాలిసా తైలవర్ణ చిత్ర మందహాసమువలె నుండును. దుష్టులెవరో ఈమె పెదిమలను ఛేదించిరి. అయినను ఆ పెదిమలందు తాండవించుచున్న అపూర్వమందహాసమును ఏమాత్రము మాపలెకపోయిరి. ఈకుడ్యముఖముననే, పైభాగమున చిత్రితమయిన సప్తమానుష బుద్ధరూపములు, ఒక అవలోకితేశ్వర రూపశిల్పములు సయితము, తొలినాటి శిల్పములు కాక, చాలాకాలము తరువాత మలిచినవే.
మిగిలిన గుహలందు కళాభావనము పరికింపదగిన విశేషము లంతగా లేవు. అయినప్పటికీ రూపశిల్పములతివిరివిగా మలిచియున్న 3,4 గుహలను ఒకింత గమనించవచ్చును.ఈగుహలందు అనేక బుద్ధ, బోధిసత్వ, స్తూపరూపము లమితముగా కనిపించును. ఈ శిల్పములందు పునరుక్తి ఎక్కువ అయి, దూషరూపమునే వహించును. ఇవన్నియు క్రీస్తు తరువాత మలచినవే.
ఈ శిల్పములందు రెండు కల్పనలు మాత్రము గమనించదగినవి. ఈశకల్పనలందు శిల్పవిశేష మేమియు లేకున్నప్పటికిని, చిత్రమయిన భావవిశేషములు మాత్రము ఉన్నాయి. ఒక కల్పన యందు బుద్ధుడు ఉపవిష్టుడయిన పద్మము ఒక నిటారుకంబముపైన ఉండును. ఈ కమబమునకు క్రిందిభాగమున నాగపురుషులిద్దరు ఇరువైపుల తన్ని పట్టి కంబమును నిలుపుచుందురు, కంబమధ్య భాగమునుంచి ఇరువైపుల రెండుపద్మములు మొలచును. ఈ పద్మములందు నాగపురుషులో, లేక భక్తులో కానవచ్చెదరు. ఈ కల్పన అనేకమార్లు అనేకమార్లు కనిపించును. అప్పుడప్పుడు రచన యందు కొంత భేదము కానవచ్చినను, రూపు మాత్రము పోలికి ఉండును.
ఇక రెండవ కల్పన ఒక బోధక శిల్పము. దీనిలో కేంద్రమున అవలోకితేశ్వరుడుండును. కుడివైపున పైనుంచి క్రిందకు వరుసగా ఒక పురుషుడు ఏనుగు, సింహము, సర్పము, అగ్ని, నావచ్చేదనము మొదలయిన బాధలకు లోనయి, భయమున నుండును. ఎడమ పార్స్వమందు ఇదేరీతిన కారాగార, గరుడ, సితాళ (బౌద్ధుల పోలేరమ్మ) ఖడ్గ, విరోధిబాధలు చిత్రించి యుండును. ఇటువంటి సర్వబాధలనుంచి అవలోకేతేశ్వరుడు రక్షించగలడని ఈ చిత్రభావము. ఈ చిత్రకల్పనయందు చిత్రితమయిన ప్రతిఒక బాధను గూర్చిన కథలు సయితము ఉన్నాయి.మహాయానము ప్రబలుచున్న కాలమున, నీరసించుచున్న అంతర్యస్వభాగవతులందు ఉద్భవించిన కల్పనలివి.
ఈ కన్హరీ గుహలు ఇంత ప్రబలమయిన దయినను ఒక్క విహారమయినను ఇందు కానము. మొదట చెప్పిన ఒక మహాచైత్యము తప్ప, మిగిలనవన్నియు విడి భిక్షుక గృహములె. సర్వగుహములందును ముఖ్యముగా విదితమవు ప్రధానలక్షణములు గుహాంగణమందలి వరాండా, అరుగులు. ఆతిధ్యభావమున ఉదయించిన, ప్రత్యేక ఆంధ్రవాస్తు లక్షణమయిన వరాండా పూర్ణవిని యోగము, వాస్తువునందిది కల్పింపగల సొంపు కన్హరీ గుహలందు ప్రస్ఫుటతమయినది.
ఈ వర్గమందు విహారములు లేనందున, ఇచటి పరివ్రాజక వర్గమమందు సామాజికజీవనము లేదనుటకు వీలులేదు. అందరు కూడి ధర్మమును చర్చింటుకకయి మహాశాలలు రెండు ఈగుహలందు ఉన్నాయి. ఇందు ప్రఖ్యాతి వహించినది దర్బారుగుహ. ఈగుహ నిర్మాణక్రమము నాడు అజాతశత్రువు రాజగృహసంగీతము కొరకు నిర్మించిన మహాశాల ననుకరించినని పండితాభిప్రాయము. ఇచట నిర్మితమయిన ప్రతి గుహయందు, ముందు వరాండాయేగాక, తపశ్చ్యకొరకు ఏర్పరిచిన ఉపగదితోపాటు, అరుగులు కలిగిన ఒక చావిడి సయితము ఉంది. కొన్ని గుహలందు ఈచావిడుల వెనుక భాగమున, ఒక చిన్న ఆదిత్యమును సయితము కల్పించి, ఆదిత్యమందు ఒక బుద్ధ విగ్రహమును నిలిపిరి. అందుచేత అనేకశాఖలకు చెంది, ప్రత్యేక శిష్యవర్గములు కలిగిన, వివిధసన్యాసుల సమూహము ఇచట నాడు ఉండెడిది అని మనము ఊహించవచ్చును.
ఈగుహలందు సర్వపండితులను ఆశ్చర్యమొనర్చిన ఇంకోవిశేషము ఇంకొకటి ఉంది. ప్రతిగుహకు ఎదురున ఒక చిన్న నీటికుందు కానవచ్చును. వర్షపర్యంతము ఈ నీటికుండ్లు, చల్లటి మచితీర్ధముతో చేతి కందురీతిన నిండి ఉండును. ఈ నీటి ఉనికిని కనుగొని, ఆనాడు ఇచట ఇంత మహాగుహ వర్గమునకు శంకుస్థాపన మొనరించిన ప్రథమశిల్పి ప్రజ్ఞ మహాద్భుతమని వేరుగ చెప్పనక్కర్లేదు.


కామెంట్‌లు