జాలిగా ఉంది దేవిసుకన్య
జాలిగా ఉంది నాపై నాకు...
ఆడ అని అనిపించుకోడానికి..

నాలాగే ఎందరో ఆడజన్మలను చూసి 
జాలిగా ఉంది నాకు..

నేను అబలను కాదు సబలను అంటూ
బతుకు రణాన అలుపు లేని పోరాటం చేస్తూ
అతివ లానే ఆలోచించే నాలాంటి అతివలపై జాలిగా ఉంది నాకు...

మేరు పర్వతమంటి ధీరత్వానికి ప్రతీకలై కూడా  అగాధమంటి మనసుని కలిగిన
నాలాంటి అధీర లను చూసి జాలిగా ఉంది నాకు....

సర్దుబాట్లనే దిద్దుబాట్లుగా చూపిస్తూ
కట్టుబాట్ల పంజరం మద్యనుంచి లోకాన్ని చూపించిన ఆ ప్రతి కన్నవారిపై జాలిగా ఉంది నాకు...

ఎన్నెన్నో ఆశలు..ఏవేవో ఊహలు అన్నిటిని
మనసు అనే అగాధంలోకి నెట్టేసి పగలు అతికించుకున్న నవ్వులు రాతిరి ఆగని కన్నీటి ధారాలతో దాన్ని పూడ్చి పెట్టేసామనుకుంటూ మభ్య పెట్టుకునే నాలాంటి ఇంతులపై జాలిగా ఉంది నాకు..

అనుకోని పరిచయపు ప్రవాహాలు..
ఆ అగాధపు ఖాళీలను అవలీలగా ఆక్రమిస్తాయి..

మన ఆకాంక్షలు ఆలోచనలు అన్ని అపురూపమనే భావం కలిగిస్తూ పేక మేడలు
నిర్మిస్తాయి...

మళ్ళీ మళ్ళీ మానసాన అగాధలు సృష్టించబడతాయి..

అయినా నమ్మకాన్ని వీడలేని నాలాంటి వాడిన కుసుమాలని చూసి జాలిగా ఉంది నాకు...


కామెంట్‌లు