దేనికదే మంచిది!;-- యామిజాల జగదీశ్
 గృహస్థు జీవితం మంచిదా...
లేక సన్న్యాసి జీవితం మంచిదా...
రెండూ మంచివే. 
కానీ ఒక్కటి. గృహస్థు జీవితంలో ఉన్న వారికి సన్న్యసించడంపైనో, సన్న్యాస జీవితంలో ఉన్న వారికి గృహస్థు జీవితంపైనో మనసు మళ్ళకూడదు. ఇదెంతో ముఖ్యం.

అనగనగా ఒక వ్యక్తికి సంసార జీవితం నచ్చలేదు. అన్నింటిని వదిలిపెట్టి సన్న్యసించాలని నిర్ణయించుకున్నాడు.
సరే. అనుకోవడానికేం, బాగానే ఉంది. సన్న్యసించే ముందర ఓ మహాత్ముడిని కలవాలనుకున్నాడు. 
తిరువణ్ణామలైకు బయలుదేరారు. భగవాన్ రమణ మహర్షిని కలవాలనుకున్నాడు. అది ఆయన ఆశ. అక్కడికి వెళ్ళడంతోనే రమణ మహర్షి తీరుని చూసి ఆయన విస్తుపోయాడు.
ఎందుకంటే ఆయన వెళ్లేసరికి రమణమహర్షి విస్తరాకులు కుడుతున్నారు. ఆకులను పుల్లలతో కుడుతున్నారు.

ఆయనతో ఎలా మాట మొదలుపెట్టాలా అని ఆలోచించాడు. 
అయితే ఇంతలో రమణ మహర్షే మాట మొదలుపెట్టారు.
ఇదిగో చూడండి.  కష్టపడి ఈ విస్తరాకులను తయారుచేస్తాం. దానిని ఉపయోగిస్తాం. ఆ తర్వాత దాని అవసరం తీరిపోయిందని విసిరేస్తాం అన్నారు రమణమహర్షి.
ఈ మాటలతో ఆ గృహస్థుడికి అదనంగా ప్రశ్నలు అడగవలసిన అవసరం కలగలేదు. నోరు మెదపలేదు.
అనంతరం, ఆలోచించడం మొదలు పెట్టారు.
నిజమే. మన జీవితం ఓ విస్తరాకులాంటిది. మనకంటూ కొన్ని పనులు ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా భయపడిపోయి సన్న్యాసాశ్రమానికి వెళ్ళడం కుదరదు. తగదు. అది సరైన పద్ధతికాదుకూడా.
ఆ గృహస్థుడు అయోమయంలో పడ్డాడు. ఇంటికి తిరుగుప్రయాణం చేశాడు.
ఎవరి బాధ్యతను వారు సక్రమంగా చేయడానికి దారి చూపించేదే ఆధ్యాత్మికం. కానీ ఈరోజుల్లో చాలా మంది తమ బాధ్యతలనుంచి తప్పించుకు పారిపోవడానికి ఆధ్యాత్మిక మార్గం ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తున్నారు.
సంసారిగా బాధ్యతలను సక్రమంగా చేయాలనుకున్నారొకడు.
తొలి దశగా భార్యకు సాయపడాలనుకుని ఇంట్లో ఉన్న చిరిగిన బట్టలను కుట్టా లనుకున్నాడు.
మొదటగా సూది ఒకటి తీసుకున్నాడు. ఇంకొక చేతిలో దారం తీసుకున్నాడు. సూదిలోకి దారం ఎక్కించడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన వల్ల అది కాలేదు. చాలాసేపే ప్రయత్నించాడు. కానీ ఆయన వల్ల కాలేదు.
అయితే అనుకోకండా అటువైపు వచ్చిన ఆయన భార్య ఇది గమనించింది.
"ఎంతసేపండీ సూదిలో దారం ఎక్కించడం...మీ వల్ల అది కాని పని" అన్నాదామె.
"ఎందుకు?" అడిగాడాయన.
"ఎందుకంటే ఏం చెప్పను? మీ చేతిలో ఉన్నది సూది కాదు కనుక. అది గుండుసూదండీ"కామెంట్‌లు