మృగరాజు అత్యాశ ;-- యామిజాల జగదీశ్
 అనగనగా ఒక అడవిలో ఓ సింహం. అది ఓ రోజు ఆకలి తీర్చుకోవడానికి బయలుదేరింది. దారి మధ్యలో ఒక చోట బొద్దుగా ఉన్న కుందేలు ఒకటి ముద్దుగా పడుకుని ఉండటం చూసింది సింహం. 
"ఇప్పటికైతే ఈ కుందేలుని లాగించెయ్యాలి" అనుకున్న సింహం అటుకేసి నెమ్మదిగా అడుగులు వేసింది. తీరా ఒకటి రెండు అడుగులు వేసేసరికి మరోవైపు ఛెంగు ఛెంగున దూకుతూ రమ్యంగా పోతున్న ఓ జింక సింహం కంట పడింది. 
అప్పుడు సింహం, పడుకున్న కుందేలుని పడుకోనిచ్చి ముందుగా జింకను ముందుగా వేటాడి తినాలనుకుంది.
అనుకున్నదే తడవుగా సింహం జింకకేసి అడుగులు వేసింది. 
అయితే జింక అటూ ఇటూ దూకుతూ పరిగెడుతూ వేగంగా పోతూ సింహానికి అందకుండా ఉంది. 
మధ్యలో గుట్టలూ. లోతులూ...అయినా జింక తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం వేగాన్ని పెంచుకుంటూపోవడమే కాకుండా ఎక్కడో అక్కడ చాటుమాటై తప్పించుకుపోయింది. 
దాంతో సింహానికి చెడ్డకోపం వచ్చింది. జింకను దాడి చేసి చంపాలేకపోయానన్న కోపంతో పడుకున్న కుందేలు వైపుకి మళ్ళింది సింహం దృష్టి.
వేగంగా వస్తే ఆ అలికిడికి కుందేలు పారిపోతుందనుకుని నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ వచ్చింది. 
ఈలోపు కుందేలు అక్కడి నుంచి పారిపోయింది. నిజానికి పడుకోలేదు. సింహాన్ని చూసిన క్షణంలోనే నిద్రపోతున్నట్టు పటిస్తూ కళ్ళు మూసుకుంది. అది తెలివైన కుందేలు. జింకమీద దాడికి ఎప్పుడైతే సింహం అటు వెళ్ళిందో ఇటు కుందేలు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. 
దాంతో సింహం తాను వేటాడి ఆకలి తీర్చుకోవాలనుకున్న కుందేలు, జింక నోటికందక అదృశ్యమవడంతో నీరసంతో గుహకు చేరుకుంది.
"చేతిలో ఉన్న దానిని వదులుకున్నాను కదా. దొరికింది దొరికినట్టే పని కానిచ్చేసుంటే కొంతమేరకైనా ఆకలి తీరేది కదా. అత్యాశకు పోయి చివరికి ఏదీ దక్కక ఇట్టా పస్తుండిపోవలసి వచ్చిందే" అని బాధ పడింది మృగరాజు సింహం.

కామెంట్‌లు