భయం ఉండాలీ, ఉండకూడదూ!;-- యామిజాల జగదీశ్
 భయం అనే మాట చిన్నదీ. రాయడమూ తేలికా. కానీ ఆ చిన్న మాటే అవకాశమంటూ ఇచ్చామో మనతో ఓ ఆట ఆడుకుంటుంది. కింద పడేస్తుంది.
ఈతరమూ ఆతరమూ అని అనుకోవడానికి వీల్లేకుండా ఎందరో ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి "భయం"! భయపడవలసిన విషయానికి భయపడక ఉండటం, భయపడాల్సిన విషయానికి భయపడటం ఓ సమస్యే.
మన చిన్న వయస్సులో మనకు పెద్దలు చెప్పిన మాటలు "ఒరేయ్, స్కూలుకి వెళ్ళేమా చదువుకున్నామా ప్రశాంతంగా ఉండాలి. మాష్టారు ఏం చెప్తే అది అట్టాగే వినాలి...ఎవరితోనూ గొడవపడకూడదు" 
అయితే ఇలాటి మాటలన్నీ పదే పదే చెప్పి సంతోషంగా నేర్చుకోవలసిన పాఠాలను ఎందుకొచ్చినా గొడవా అన్నట్టుగా మారుస్తారు. గురు శిష్య సంబంధంలో జ్ఞానమనేది పక్కన పెట్టి చెప్పింది వినేద్దాం అనే నిర్ణయానికి వచ్చేస్తారు.
మనమేదో ఒకటి మాట్లాడి అనవసరంగా చిక్కుల్లో పడటం ఎందుకూ అనుకుని వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా తయారవుతారు కొంతమంది. వారలా అనుకోవడానికి కారణం "భయమే"
చిన్నతనం నుంచే అనుకునో అనుకోకుండానో ఈ భయం అనేది మనల్ని పాలిస్తుంది.
 
పన్నెండో ఏట నాన్నా నాకు సైకిల్ కావాలి అని అడిగితే "కొనిస్తానురా" అని చెప్పి ఓ ఖరీదైన సైకిల్ కొనిస్తారు. కానీ ఓ షరతు...
"మన ఇంటి ఆవరణలోనే తొక్కాలి. రోడ్డు మీదకు వెళ్ళావంటే ఏదన్నా ప్రమాదం జరగొచ్చు" అని సైకిలుతోపాటు భయాన్నీ కానుకగా ఇస్తాడు ఆ నాన్న.
నిజానికి సైకిల్ కొనిచ్చేటప్పుడు తండ్రి చెయ్యవలసిన పని...ఎలా తొక్కాలో నేర్పించడం. అంతేతప్ప భయాన్ని చెప్పడం ఏ ఫలితాన్నీ ఇవ్వదు.
సరే, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఏవన్నా చెప్తారా ఆనుకుంటే అదీనూ మరోలా ఉంటుంది.
"నీవల్ల ఈ కాలేజీకి పేరుప్రతిష్టలు రావు. నేను చెప్పినట్టు ఫలానా కోర్స్ ఎంపిక చేసుకుని చదువు" వంటి నిబంధనలతో పిల్లల్లో నమ్మకం కోల్పోవడంతోపాటు భయాన్నీ పెంచుతాయి.
తల్లిదండ్రులను రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి, చేపల వల కొనిచ్చి చేపలను పట్టడం నేర్పించడం. మరొకటి , చేపలనే కొనివ్వడం. 
ఇందులో రెండో రకం తల్లిదండ్రులవల్ల తర్వాతి తరంవాళ్ళ తెలివితేటలు లేకుండాపోతాయి. అలాకాక దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగపడేలా ఎదగాలంటే మనం మొదటి రకం వాళ్ళలా ఉండాలి.
అవసరమైన భయం, అర్థం లేని భయం మధ్య తేడా తెలీని తల్లిదండ్రుల వల్ల పిల్లలకూ భయం అంటుకుంటుంది. అవగాహన అనేదే లేకుండాపోతుంది.
కాలేజీలోనూ బయటి ప్రపంచంలోనూ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడం అనేది మన చేతుల్లో లేని అంశం. మాట్లాడితే సమస్య అనుకుని ప్రతి దానికీ తలవంచుతూపోతే ఎదురయ్యేది భయమే.
నిజానికది అర్థం లేని భయం. ఎవరితో ఏ పరిస్థితిలో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది చెప్పడం పెద్దల కనీస బాధ్యత. ఇది ఆరోగ్యకరమైన అడుగుకి ఓ గట్టి పునాదవుతుంది.
కానీ అలా కాకుండా చదువుకుంటున్న రోజులలో అనవసరమైన భయాలను పుట్టించడంవల్ల పిల్లలు ఎందుకూ పనికి రాకుండా పోతారు. దారుణమైనరీతిలో చేదు ఆనుభవాలకు గురై మానసికంగా దెబ్బతింటారు. 
తప్పు చేస్తే సరిదిద్దుకోవడం ఎలాగో నేర్పించడం గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ద్వారాలు తెరచుకుంటాయి.
ఎగతాళి చేస్తారనో చిన్నచూపు చూస్తారనో చెప్పి అనవసరభయాన్ని తెప్పించడంవల్ల అవకాశాలను కోల్పోవడంతోపాటు ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఇది అర్థంపర్థం లేని భయమే అవుతుంది.
పది మందిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అని నేర్పడం ఎంతో ముఖ్యం. ఇటువంటి చోట భయం ఉండాలి. అణకువ ఉండాలి. అలాగని అనవసరంగా లేనిపోని భయాన్ని వారిలో పొదిగితే చిన్న చిన్న విషయాలలోనూ చేదు అనుభవాలను చవిచూడవలసి వస్తుంది.
చేసే పనిలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుల్కోవాలో తెలిసుండాలి. అదే పురోగతికి పునాదవుతుంది. కానీ అలాకాకుండా సవాళ్ళంటేనే సమస్యలని ఓ నిర్ణయానికి వచ్చేస్తే అక్కడ పుట్టుకొచ్చేది అనవసరపు భయం.
అందుకే భయం అని చెప్పేటప్పుడు మన భయం విజయానికా లేక ఓటమికా అనేది ఆలోచించి అడుగేయడం ముఖ్యం.
ఓ విషయంతో ఈ భయం విషయాన్ని ముగిస్తాను. 
నాలోకి ఎప్పుడు ఏ వయస్సులో భయమనేది జొరబడిందో తెలీదు కానీ అడుగడుగునా దానిని వదిలించు కోకపోవడంతో పురోగతికి నాకు నేనే అడ్డుకట్ట వేసుకున్న సందర్భాలున్నాయి. 
నేనొక పత్రికలో పని చేస్తున్న రోజుల్లో సారథ్యం వహించమని సంపాదకులు చెప్పినప్పుడు "వద్దండి, నేనిట్టానే ఉంటాను" అని పక్కనే ఉండిపోయాను. ఇందువల్ల జరిగిన నష్టం తర్వాతి కాలంలో అర్థమైంది. కానీ అప్పటికి అంతా అయిపోయింది.
అంతెందుకూ, ఓ ప్రభుత్వ కార్యాలయానికి ఓ పనిమీద వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఓ అధికారిని కలిసి నా విషయం చెప్పుకోవాల్సి ఉంది. కానీ ముందురోజు రాత్రి నిద్రపోతే ఒట్టు. ఏమడుగుతారో ఏం చెప్పాలి వంటి ప్రశ్నలూ జవాబులూ నాకు నేనే రెండు పాత్రలలోకి పోయి రాత్రంతా నిద్రకూ దూరమయ్యాను. నాకు నేనే అతిగా ఊహించుకుని ఒకరిద్దరితో ఈ విషయం చర్చించానుకూడా. ఆ అధికారిని కలవబోయే వరకూ మనసులో గూడుకట్టుకున్న భయం ఇంతా అంతా కాదు. తీరా ఆ అధికారి గదిలోకెళ్ళిన కొన్ని క్షణాలకే వారు పలకరించిన తీరుతెన్నులతో నాలోని భయం తొలగిపోయింది. వారి నెమ్మదైన, మర్యాదపూర్వకమైన మాటల తీరు నాలోని అనవసర భయాన్ని పోగొట్టింది. నేననుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటీ కావడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నాను. ఆ అధికారికి మనఃపూర్వకమైన నమస్సులు చెప్పుకుని బయటకు వచ్చాను. 

కామెంట్‌లు