పక్షుల సాయం; -- యామిజాల జగదీశ్
 "ఒసేయ్. ఈరోజు మధ్యాహ్నం లంచుకి నిమ్మకాయన్నం, బంగాళదుంపకూర పెట్టానే" ఆన్న తల్లి మాటకు సీసాలో నీరు నింపుతున్న వనజ "సరేనమ్మా" అంది.
అది స్కూలు ఆవరణ. 
మధ్యాహ్నం లంచ్ వేళ. 
తోటి స్నేహితురాళ్ళతో కలసి అన్నం తింటోంది వనజ. వాళ్ళు వలయాకారంలో కూర్చుని తింటున్న దృశ్యాన్ని దూరం నుంచి కాకులూ, పిచ్చుకలూ చూస్తున్నాయి. వాటిని గమనించిన వనజ ఓ పిడికెడు అన్నం తీసుకుని పక్షులవైపు విసిరింది.
వెంటనే వనజ మిత్రురాలు సల్మా "ఎందుకే అన్నాన్ని వాటికి పెడుతున్నావు?" అని అడిగింది.
"వాటికీ ఆకలేస్తుంది కదా. ఆ పక్షులు రోజూ మనం అన్నం తినే వేళకు వస్తుంటాయి. పోతుంటాయి. నువ్వు వాటిని చూడలేదా? వాటికి మాట్లాడే శక్తి లేదు కనుక ఆకలిగా ఉంది...అన్నం పెట్టండని అడగలేవు. వాటిని చూస్తుంటే జాలేస్తోంది. అందుకే వాటికి అన్నం పెట్టాను. మనం పెట్టకపోతే అవి  నిరాశతో వెనక్కు వెళ్ళిపోతాయి కదా?" అంది వనజ.
"అవునే...వనజా...నువ్వు చెప్పేది నిజమే...కాదనను...." అంటూ మాట కొనసాగించింది కల్పన "స్కూలు ఉన్న రోజుల్లో పరవాలేదు. స్కూలుకి సెలవిచ్చినప్పుడు వాటికెవరు అన్నం పెడతారూ? అప్పుడవి ఆకలితో అవస్థ పడాల్సిందేనా? పాపం కదూ" అంది.
"మరి సెలవు రోజుల్లో ఏం చేయాలి? త్వరలోనే పది రోజులు మన స్కూలుకి సెలవులు రాబోతున్నాయి. అప్పుడేం చేద్దాం..." అంది రాగిణి.
"మనం పది మంది ఉన్నాం కదా. మన ఇళ్ళు ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నాయి కదా.  కనుక సెలవు రోజుల్లో రోజుకొకరు చొప్పున స్కూలుకొచ్చి వాటికి ధాన్యం గింజలు వేద్దాం" అంది ఉష.
ఉష ఆలోచన అందరికీ నచ్చింది. పది మందీ తమ క్లాస్ టీచర్ రాధిక దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పారు.
"పక్షులు మనం ఆహారం పెడతామని నిరీక్షించవు. మనం అన్నం పెట్టకపోయినంత మాత్రాన అవేమీ పస్తులుండవు. అయినా మీ అందరికీ పక్షుల మీదున్న ప్రేమను కొనియాడుతున్నాను. సెలవు రోజుల్లో మీరు స్కూలుకి రానక్కర్లేదు. మీరందరూ మీ వంతుగా సెలవు ముందు రోజు నాకు ధాన్యగింజలివ్వండి. వాటిని వాచ్ మాన్ గోవిందయ్యకి ఇస్తాను. అతనిని రోజూ వాటిని పక్షులకు పెట్టమంటాను" అంది టీచర్ రాధిక.
టీచర్ సూచన అందరికీ తృప్తినిచ్చింది. మరుసటి రోజు అందరూ డబ్బాలతో ధాన్యం గింజలు తీసుకొచ్చి క్లాస్ టీచరుకిచ్చారు.
దీంతో సెలవు రోజుల్లోనూ పక్షులకు ఆహారం లభించినట్లయ్యింది.
ఓరోజు డ్రిల్ పీరియడ్లో మైదానంలో ఓ పక్కగా నిల్చున్న వనజ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది.
ఒకింత దూరంలో ఉన్న తోటి స్నేహితులెవరూ ఇది గమనించలేదు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన పక్షులు వనజ చుట్టూ వాలి అరవడం మొదలుపెట్టాయి.
ఆ అరుపులకు దూరంలో ఉన్న స్నేహితులు వెనక్కు తిరిగి చూసారు. వెంటనే వనజ దగ్గరకొచ్చి ఆమె ముఖాన నీళ్ళు చల్లి మెల్లగా లేపి కూర్చోపెట్టారు. 
స్కూల్లోనూ ఇంట్లోనూ వనజ పడిపోవటాన్ని గమనించి తోడ్పడిన పక్షుల గురించే అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. వాటికి కృతజ్ఞతలు చెప్పారు. రోజూ పక్షులకు అన్నం పెట్టిన వనజకు సాయపడిన పక్షులు సామాన్యం కావని మెచ్చుకున్నారు.

కామెంట్‌లు