మారగలమా;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 న్యూస్ చానల్స్ లో హార్ట్ ని బ్రేక్ చేస్తున్న బ్రేకింగ్ న్యూస్ లను చూసి
అయ్యో పాపం అని అనుకోవడం
అసలు మనసెలా వచ్చింది అని తిట్టుకోవడం
నలుగురితో ఆ సంఘటన గురించి చెప్పుకోవడం
మహా అయితే దుఃఖాన్ని తాళలేక కన్నీటి చుక్కలను రాల్చడం
అరరే చాలా సెన్సిటివ్ అయి పోతున్నాం అని మరొక ఛానల్ ని తిప్పుకోవడం
తర్వాత ఏ సినిమానో, యూట్యూబ్ నో చూస్తూ 
కాసేపు అలా మైండ్ ని రిఫ్రెష్ చేసుకోవడం
ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ లలో వచ్చే అదే 
హెడ్ లైన్స్ ని చదువుకోవడం 
ఈ విషయాలపై సోషల్ మీడియా, ఫేస్ బుక్ లలో, వచ్చే పోస్టింగ్ లకు 
లైకో, కామెంటో, షేరో కొట్టు కోవడం
ఓ మూడు, నాలుగు రోజుల పాటు ఆరాటం తీరక న్యాయం కావాలంటూ 
రచ్చలు,ర్యాలీలు, రాస్తారోకోలను చేసు కోవడం
చివరకు చేతులు కట్టుకొని కూర్చోవడం తప్ప ఏం చేయలేని 
చవటలం మనం అని ఒప్పుకోవడం
తెగ తికమకపెట్టి తరుముతున్న ఆ తలపుల నుంచి సైలెంట్ గా తప్పుకోవడం
మన దారిని మనం చూసు కోవడం... మన పనిని మనం చేసుకోవడం
అంతే... అంతవరకే
అంతేకానీ...అంతకు మించి
అసలు మనం ఏం చేయగలం??
అరాచకాలను ఆపేయగలమా
అందరిని మార్చేయగలమా
కిరాతకులను కట్టడి చేయ గలమా
మన్నులో కలిసిపోతున్న మానవత్వానికి మెరుగులు పెట్టగలమా
అరే అసలు ఇంతింత పెద్ద పెద్ద మాటలన్నీ మనకెందుకండి
మనకెందుకంటూ స్వార్థంగా బ్రతికేస్తున్న మనం ఈ సమాజాన్ని 
మార్చే దిశగా ముందడుగు వేసి ముందు మనం మారగలమా...


కామెంట్‌లు