పరివర్తన;-సి.హేమలత-పుంగనూరు
 రాము రాజు ఇద్దరూ మంచి స్నేహితులు రాము చదువులో ముందుండే వాడు ,కానీ రాజు ఎప్పుడూ ఏదో అల్లరి చేస్తూనే ఉంటాడు. ఊర్లో మామిడి తోటలో జామ తోటలో కాయలు దొంగతనం చేసి అమ్మి ఆ డబ్బులుతో  పాన్ బీడా,గుట్కాలు నమిలేవాడు.
ఇంట్లో వాళ్ళు బుద్ధి మాటలు చెప్పినా మారడం లేదు. ఇంట్లో వాళ్ళ అమ్మ బడిత పూజ చేయడం సర్ది చెప్పడం పాఠశాలకు పంపడం పరిపాటి అయింది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ   కుక్క తోక వంకర అంటూ వేళాకోళం చేసే వాళ్ళు.
లక్ష్మి శంకరయ్య ల ఒక్కగానొక్క బిడ్డ రాజు. రాజు ఇలా దొంగతనాలు చేస్తుండడంతో శంకరయ్య  ఊరిలో తల ఎత్తుకో లేక పోతున్నాడు. ఒకరోజు దారిలో రాజుకు తెలుగు మాస్టారు ఎదురుపడ్డాడు. ఏం శంకరయ్య బాగున్నావా అన్నాడు. శంకరయ్య బోరున విలపిస్తూ రాజు రోజురోజుకు పెంకీల తయారవుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా మందలించినా ఆ దొంగతనం చేసే బుద్ధి పోలేదు.
మాస్టారు ఎలాగైనా  మా వాడిని మీరే మార్చాలి అంటూ చేతులు జోడించాడు. శంకరయ్య బాధపడకు రాజు మంచి కుర్రవాడే ఏదో తెలియక చిన్నతనంతో అలా చేస్తూ ఉంటాడు నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను సరేనా.. ఇక అతను దొంగతనాలు చేయడం మానేస్తాడు. నాది బాధ్యత అంటూ హామీ ఇచ్చాడు తెలుగు మాస్టారు.
అంతా మీ దయ మీరు ఆ పని చేయగల సమర్ధులు అని మీతో నా బాధ వెళ్లబోసుకున్న మాస్టారు అని చెప్పి శంకరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
పాఠశాలకు వచ్చిన తెలుగు మాస్టారు జాతీయాలు సామెతలు పాఠ్యాంశం చెబుతూ కుక్క తోక వంకర, రెక్కాడితే గానీ డొక్కాడదు .నీరు పల్లం యెరుగు..నిజం దేవుడెరుగుఅంటూ కొన్ని సామెతలు చెప్పాడు.
ప్రతి రోజు ఇంట్లో తాను వింటున్నా సామెత కుక్క తోక వంకర. రాజు గాడికి వెంటనే కుక్క తోక వంకర అనేదానికి అర్థం తెలుసుకోవాలనిపించి అదే విషయం మాస్టారు ని అడిగాడు
మాస్టారు నవ్వుతూ దీనికి అర్థం రేపు చెబుతా కానీ ఇవాళ పిల్లలూ ఊరంతా పరిశీలించి,  తోక వంకర లేని కుక్కను తీసుకురావాలి. ఎవరైతే తీసుకొస్తారు వారికి బహుమతి ఉంటుంది అని చెప్పాడు. పిల్లలంతా ఉత్సాహంగా సరే అన్నారు. రాజు రాము ఇద్దరూ బడి బడి లేక ఊరంతా వెతికారు ఎక్కడ వంకర లేని తోక ఉన్న కుక్క కనబడలేదు. నిరాశగా ఇంటికి చేరిన రాజుకి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన పెంపుడు కుక్క తోకకు దబ్బలు వేసి గట్టిగా కట్టాడు.
ఉదయం  పాఠశాలకు తీసుకెళ్లి తెలుగు మాస్టారు ముందర నిలబెట్టాడు.అందరూ చప్పట్లు కొట్టారు.
తెలుగు మాస్టారు చుట్టూ పరికించి రాజు వైపు చూసి నవ్వుతూ ఆ కట్లు విప్పు అన్నాడు కట్లు విప్పగానే తోక యధాస్థితికి వచ్చేసింది. తనకు కుక్క వైపు గుర్రుగా చూస్తూ తలదించుకున్నాడు రాజు. తెలుగు మాస్టారు రాజు నీ దగ్గరికి తీసుకుని భుజంపై తట్టి పిల్లలను ఉద్దేశించి కుక్క సహజలక్షణం తోక వంకర గా ఉండడం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుక్క తోకను నేరుగా మార్చలేము
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక అవలక్షణం ఉండే ఉంటుంది మన శ్రేయోభిలాషులు పెద్దవాళ్ళు అలవాటు మార్చుకోమని సామవేద దాన దండోపాయాలు ఉపయోగించి చెప్పినా మారకపోతే అలాంటి వారిని కుక్క తోక వంకర అంటారు. అంటే మనిషికి అవలక్షణం సహజ లక్షణం గా మారి ఎప్పటికీ మంచి నేర్చుకోడు అన్న ఉద్దేశంతో ఆ మాటను అంటుంటారు.
ఆలోచించే జ్ఞానం లేని కుక్కే తన సహజలక్షణం కొరకుమొండిగా ప్రవర్తిస్తుంది. ఆలోచించే జ్ఞానం కలిగిన మనం అలా ఉండొచ్చా మనలోని చెడును తుంచి మనుషులుగా మారాలి కదా అప్పుడే కదా చదువుకున్నందుకు అర్థం పరమార్థం అన్నాడు.
తన ప్రవర్తన కోసమే మాస్టారు ఇంత  చెప్పాడని అర్థమైన రాజు సిగ్గుపడ్డాడు. ఇకపై తను దొంగతనం అనే చెడు అలవాటుని మాని జ్ఞానవంతుడు అని రుజువు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.దొంగతనం మాని మంచి విద్యార్థిగా మారాడు.
తల్లిదండ్రులు సంతోషించారు.
✍️లతాశ్రీ

కామెంట్‌లు