నిద్రను హరించే స్ట్రాంగ్ కాఫీ;-- యామిజాల జగదీశ్
 రోజూ పొద్దున్న లేచీ లేవడంతోనే కాఫీ తాగే అలవాటున్న వారెందరో. వారిలో నేనూ ఒకడ్ని. ఎంతలా అలవాటై పోయిందంటే కాఫీ తాగకపోతే అనీజీగా uneasyగా ఫీలవుతాను. కనుక మా ఆవిడ లేచి నాకు కాఫీ ఇవ్వాలనేం అనుకోకుండా నేనే లేచి దంతావధానం కావడంతోనే వేడివేడి కాఫీ తయారు చేసుకుని తాగి అమ్మయ్య పొద్దున్నయ్యిందనుకుంటాను!  

కాఫీ గింజ అనేది కాఫీ చెట్టు విత్తనం. కాఫీ జన్మస్థానం ఇథియోపియా. కాఫీ చెట్టు ఈ దేశంలోని కప్పా ప్రాంతంలో పుట్టి  ఉండవచ్చని అంచనా. 
కాఫీకి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఎర్రని కాఫీ గింజలను నమిలిన తర్వాత తన మేకలు ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి ఒక ఇథియోపియా గొర్రెలకాపరి ఆశ్చర్యపోయాడట. 
మరొక కథనం ప్రకారం, ప్రస్తుతం కాఫీకి పర్యాయపదంగా ఉన్న అలనాటి ప్రసిద్ధ రేవు మోకా రేవు మార్గం ద్వారా సూడాన్ నుంచి ఎమెన్, అరేబియాలకు తరలింపబడే బానిసలు ఎక్కువ రసంతో నిండిన కాఫీ గింజ కండను నమిలేవారట. చరిత్రలో మక్కాలో ప్రారంభించబడిన మొట్టమొదటి కాఫీ షాపులను 'కవే కేన్స్' అనే పేరుతో పిలిచేవారు. అనంతరం అరబ్ ఇవి ప్రపంచమంతటా వ్యాపించాయి. 
అయితే డెత్ విష్ కాఫీ (Death Wish Coffee) అనే ఓ కాఫీ అమెరికాలో ఇప్పుడు కొత్తగా పాపులరైంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాఫీ అని పేరొందిన ఈ డెత్ విష్ కాఫీ ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ కాఫీ strong coffee గానూ ఇది మొదటి స్థానం ఆక్రమించింది. ఈ కాఫీ పేరులోనే ఉన్న ప్రమాదం ఈ కాఫీలోనూ ఉంది.
కారణం, ఇందులో ఎక్కువ మోతాదులో కెఫిన్ Caffeine కలిసుండటమే.
కాఫీలో అరబికా, రోబస్టా అని రెండు రకాలు ఉన్నాయి. రోబస్టా కాఫీలో అరబికా కాఫీ కంటే ఫినాలిక్ శాతం ఎక్కువ. కాల్చని, ఆకుపచ్చ కాఫీ గింజలు అధిక స్థాయిలో ఫినాలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అయితే వేయించే స్థాయిని బట్టి కొన్ని ఫినాలిక్ సమ్మేళనాలు విచ్ఛిన్నమవుతాయి.
మన భారత దేశంలో కాఫీ ఉత్పత్తి దక్షిణ భారత రాష్ట్రాల కొండ ప్రాంతాలదే కావడం గమనార్హం. కర్ణాటక 71 శాతం, కేరళ 21 శాతం, తమిళనాడులో అయిదు శాతం చొప్పున కాఫీ ఉత్పత్తవుతుంది. 
మన దేశంలో దాదాపు రెండున్నర లక్షల మంది  కాఫీ పెంపకందారులు ఉన్నారు. 
మన దేశం నుంచి దాదాపు ఎనభై శాతం కాఫీ ఎగుమతి అవుతుంది. అదలా ఉండనిచ్చి కాఫీలోని కెఫిన్ విషయానికొద్దాం. 
ముఖ్యంగా టీ, కాఫీ వంటి కొన్ని శీతల పానీయాలు కెఫిన్ ను కలిగి ఉంటాయి.  అధిక స్థాయి కెఫిన్ ఉన్న పానీయాలు శక్తి ఎనర్జిటిక్ డ్రింకుగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే కెఫిన్ అనేది తాత్కాలికంగా అలసటను పోగొట్టే ఒకరమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కొంత మంది నిపుణుల మాట. 
మరోవైపు కెఫిన్ అనేక అపోహలు లేకపోలేదు. చాలా మందిలో కెఫిన్ వాడకం వల్ల గుండె జబ్బులు వస్తాయని పలువురి అపోహ. 
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిత్యం కెఫిన్ వినియోగి స్తున్నవారిలో అకస్మాత్తుగా నిలిపివేస్తే కొంతమంది వ్యక్తులు తలనొప్పి, అలసట, మగతకు గురైనట్లు తెలింది. ఈ లక్షణాలు ఒక రోజంతా ఉంటాయి. కనుక క్రమంగా కెఫిన్ తీసుకోవడం తగ్గించుకోవటం ద్వారా వీటి నుండి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.కెఫిన్ వినియోగం గుండె జబ్బు ప్రమాదాన్ని పెంచదని, కొలెస్ట్రాల్ లేదా హృదయ స్పందన రేటుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని ఓ అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు ఉన్నవారు కెఫిన్ తీసుకోవడం తగ్గించటమే మంచిదన్నారు.
కెఫిన్ అనేది దాదాపుగా ఓమత్తు పదార్థమే. ఈ కెఫినే మనల్ని కాఫీకి దాసోహం చేస్తోంది. ఒకరు రోజుకు నాలుగు వందల మిల్లీ గ్రాముల కెఫిన్ మాత్రమే తీసుకోవాలట. పిల్లలైతే వంద మిల్లీ గ్రాములే తీసుకోవాలి. మనం తాగే కాఫీలో కెఫిన్ మోతాదు ఈ చెప్పిన గ్రాములలోపే ఉంటే మంచిది. అయితే ఈ మోతాదు గానీ మీరితే ఆరోగ్యానికి చేటు. 
డెత్ విష్ కాఫీలో కెఫిన్ మామూలు కాఫీలో కన్నా రెండు వందల శాతం అధికంగా ఉంటుందట. పేరుకు తగ్గట్టే ఈ రకం కాఫీని తాగడంవల్ల మరణం సంభవిస్తుందా అంటే అలాంటిదేమీ ఏర్పడదు. అయిదే అదే సమయం, ఇది తాగడం వల్ల నిద్రనేది లేకుండాపోతుంది.
అవును, ఈ కాఫీలో అధిక మోతాదులో ఉన్న కెఫిన్ మన నరాలపై ప్రభావం చూపుతుంది. ఈ రకం కాఫీని కొంచె తాగినా మూడు రోజులపాటు నిద్ర రాదు.
అమెరికాలో ఉన్న ఈ కాఫీ సంస్థను 2012లో మైక్ బ్రౌన్ ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్కులో ఉంది.
ఈ కాఫీ ఎక్కువగా ఆన్ లైన్లో అమ్ముడవుతుంది. న్యూయార్కులో కొన్ని సూపర్ మార్కెట్లలోనూ ఇది లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కాఫీని తాగడం ఏమాత్రం మంచిది కాదు. కనుక ఈ కాఫీని కొన్ని దేశాలు నిషేధించాయి. మన దేశానికి ఈ కాఫీ ఇంకా పరిచయమవలేదు.
అయినా అది రావడానికి ముందరే దాని వల్ల ఉండే ముప్పును తెలుసుకోవడం మంచిది కదూ?!

కామెంట్‌లు