' బాల ' వాక్కు!;-- బాలవర్ధిరాజు
 ఓ మనిషీ!
నీకు డబ్బే  ప్రధానమైనప్పుడు,
మోసం , ద్రోహం చేస్తూ 
స్వార్థంతో జనాలను
దోచుకోవడమే
నీ ధ్యేయమైనప్పుడు,
దాచుకోవడమే
నీ  విధానమైనప్పుడు
కొన్నాళ్ళకు...
నీలో
బంధాలు మాసి పోతాయి
ఆత్మీయతలు బోసి పోతాయి
ప్రేమలు పేలి పోతాయి
భ్రమలు కూలి పోతాయి
స్నేహాలు విడి పోతాయి
మోహాలు వాడి పోతాయి
పంతాలు వీడి పోతాయి
ఆదర్శాల వేడి పోతాయి
 
ఆశలు చేరి పోతాయి
ఆశయాలు మారి పోతాయి
పలకరింపులు తరిగి పోతాయి
చీదరింపులు పెరిగి పోతాయి
సహకారాలు అంతమై పోతాయి
స్వీకారాలు అనంతమై పోతాయి
ఎదుర్కోల్లు తక్కువై పోతాయి
వీడ్కోల్లు ఎక్కువై పోతాయి
ఇచ్చేటప్పుడు శూన్య హస్తాలై పోతాయి
పుచ్చుకునేటప్పుడు మంచి నేస్తాలై పోతాయి
కొన్నేళ్ళకు..
ఆస్తులు కరిగిపోతే..
అంతస్తులు ఒరిగిపోతే..
వృద్ధాప్యం దరి చేరితే...
అప్పుడు...
కుటుంబ సభ్యులకు భారమవుతావు
బంధువులకు దూరమవుతావు
స్నేహితులకు కనుమరుగవుతావు
ఒంటరిగా
ఏకాకిగా
ప ' రాయి ' లా
మిగిలి ' పోతావు ' !
నిజంగా నువ్వు మనిషివి కావాలంటే
నీలో 
మానవత్వము , సహాయత్వమే ఉండాలి!
స్నేహ తత్వము ,ప్రేమ తత్వమే నిండాలి!!

కామెంట్‌లు