మనసుని కట్టివేయాలి;-- యామిజాల జగదీశ్
 ఓరోజు ఇద్దరు బౌద్ధ భిక్షువులు ఓ రహదారిలో నడుచుకుంటూ పోతున్నారు. వర్షం పడుతోంది. 
ఓ మలుపులో ఓ అందమైన యువతి ఆవలి వైపునకు వెళ్ళలేక నిల్చునుంది.
"ఇటు రా" అంటూ ఓ భిక్షువు ఆమెను పిలిచి చేయిపట్టుకుని రోడ్డు దాటించాడు. 
ఆరోజు రాత్రి తమ మఠానికి చేరుకునే వరకూ రెండో భిక్షువు ఒక్క మాటా మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత మౌనంగా ఉండలేక పెదవివిప్పాడు. 
"మనలాంటి భిక్షువులు మహిళల దగ్గరకు వెళ్ళడం తప్పు. అందులోనూ అందమైన యవ్వనవతి దగ్గరకు అస్సలు వెళ్ళ కూడదు. కానీ నువ్వందుకు భిన్నంగా ప్రవర్తించావు. ఆమె చేయి పట్టుకుని రోడ్డు దాటించావు. ఇలా మనం చేయడం సబబేనా. ఒక్కసారి ఆలోచించు" అన్నాడు.
అప్పుడు మొదటి భిక్షువు "నేనా అమ్మాయిని అక్కడే వదిలేశాను. నువ్వింకా ఆ అమ్మాయిని నీ మనసుతో మోస్తూనే ఉన్నావుగా" అన్నాడు.
మనలో చాలా మందిమి అనవసరమైన విషయాలను, సమస్యలను మోసుకు తిరుగుతూ ఉంటాం. 
ఒకటి, సమస్యను మనసులోనే తాళం వేసి ఉంచి బాధ పడుతుంటాం. అంతేకాదు, నలిగిపోతాం.
లేదా సమస్యలను తలుస్తూ భయపడి పరుగులుపెడుతుంటాం.
సమస్యలను మనసులో నుంచి విసిరినవారే సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించేవారే విజయమనే లక్ష్యసాధనలో ముందడుగు వేస్తున్నారు. అనుకున్నది సాధిస్తున్నారు.
 
ఓమారు స్వామి వివేకానంద లండన్ కు వెళ్ళారు. అక్కడ ఆయన ఓ మిత్రుడి ఫాంహౌసులో బస చేశారు. ఆ ఫాంహౌస్ సువిశాలమైనది. ఆ ఆవరణలో పలు ఆవులున్నాయి. 
ఓరోజు సాయంత్రం, స్వామి వివేకానంద నడుచుకుంటూ పోతున్నారు. ఆయనతోపాడు మిత్రుడు మిత్రుడి భార్యకూడా ఉన్నారు. 
ఆప్పుడు ఉన్నట్టుండి ఎదురుగా ఓ ఆవు వస్తోంది. అది మామూలుగా రావడం లేదు. దాని వేగం చూస్తుంటే వీరి మీదకు దాడి చేయడానికి వస్తోందా అన్నట్టుగా ఉంది. దాని వేగాన్ని చూసి మిత్రుడి భార్య భయపడిపోయి సొమ్మసిల్లి పడిపోయింది.
మిత్రుడు తన భార్యను లేపి నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఆ ఆవు వారిని సమీపించింది. మిత్రుడికి కాళ్ళూ చేతులూ పని చేయలేదు భయంతో. 
ఇంకాస్సేపు అక్కడే ఉంటే ఆవు కొమ్ములకు బలి కావడం ఖాయం అనుకున్నాడతను. ఆ భయంలో అతను తన భార్యను అక్కడే విడిచిపెట్టో తన ప్రాణాలు కాపాడు కోవడానికి మరొక దిశలో పరుగులు తీశాడు. కానీ స్వామి వివేకానంద ఉన్న చోటనే నిల్చుండిపోయారు. గోడకు మేకు కొట్టినట్టు ఆయన అటూ ఇటూ కదలలేదు. తీరా జరిగింది వేరు. స్వామి వివేకానందను, కింద పడి ఉన్న మిత్రుడి భార్యను ఏమీ చేయని ఆవు ప్రాణం కాపాడుకోవడానికి పరుగులు తీసిన మిత్రుడి వెంటపడింది.
 
అయితే అదృష్టవశాత్తు ఆ మిత్రుడు ఓ భవనంలోకి పోయి ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
 
ఇంతలో ఫాం హౌస్ పనివాళ్ళు వచ్చి ఆ ఆవుని పట్టుకుని కట్టేశారు. 
ఆ తర్వాతే స్వామి వివేకానంద ఎక్కడైతే నిల్చున్నారో అక్కడి నుంచి ముందుకు నడిచారు.
స్వామీజీని చూసి మిత్రుడు విస్తుపోయారు. మరోవైపు సొమ్మసిల్లి పడిపోయిన మిత్రుడి భార్య కూడా లేచి అక్కడికొచ్చారు. 
 మిత్రుడు స్వామీజీతో "మీరు రవ్వంత భయంకూడా లేకుండా ప్రమాద సమయంలో ఉన్న చోటనే ఎలా ఉండగలిగారు?" అని అడిగాడు. 
అప్పుడు స్వామి వివేకానంద "నేనేమీ భిన్నంగా ఏమీ చేయలేదు. జరిగేది జరగనీ. ఎదుర్కొందాం అనే కృత నిశ్చయంతో ఉండిపోయాను. పరుగులు తీసేవారిని చూస్తే వారి వెంటపడి తరమడం జంతువుల సహజగుణం. అందుకే ఆ ఆవు నన్నొదిలి పరుగెత్తిన నౌ వెంటపడింది" అన్నారు.
 
మనలో చాలా మంది ఇలానే సమస్యలను చూసి భయపడి పారిపోతుంటాం.అందుకే ఆ సమస్యలు మరింత ఎక్కువ బలం పుంజుకుని మనల్ని తరుముతుంటాయి. అలాకాకుండా సమస్యలకు భయపడక కృతనిశ్చయంతో సమర్ధంగా ఎదుర్కుంటే ఆ సమస్యలు పారిపోతాయి.
 మనసు అనేది ప్రధాన విషయం. మన మనసులో ఆరోగ్యకరమైన ఆలోచనలను తాళం వేసి ఉంచితే మంచి అలవాట్లు అలవడుతాయి.
 
మనసులో మంచి ఆలోచనలు చేస్తే జీవితంలోనూ గెలంపు, ఆనందమూ వాటంతటవే వస్తాయి..
కానీ మనలో పలువురం భయం, ద్వేషం, అపనమ్మకం వంటి వాటినే మనసులో తాళం వేసి ఉంచుతాం.
సముద్రంలో ఉన్న పడవను ఆ సముద్రనీరు బోల్తా కొట్టించలేదు. కానీ ఆ పడవకు చిల్లు ఉంటే నీరు క్రమంగా లోపలికి చేరి మునిగిపోయేలా చేస్తుంది. 
మన మనసూ అలాంటిదే. మన మనసు గట్టిగా స్పష్టంగా ఉంటే బయటి నుంచి ఎవరూ మనల్ని గాయపరచలేరు. ప్రశాంతంగా ఉండటమే మనసు సహజత్వం. 
కానీ మనసుని మనం అలా ఉండనివ్వం.
ఎలుక ఓ చోట ఉండక అటు ఇటు ఎలా పరుగులు తీస్తుంటుందో అలాగే మనసుని  పరుగులు పెట్టిస్తుంటాం. దాంతో అనవసరమైన ఒత్తిడికి లోనవుతాం. కనుక మనసుని నియంత్రించాలనుకుంటే దానిని కట్టివేయడం ఒక్కటే సరైన దారి.

కామెంట్‌లు