కారుణ్యం -: సి.హెచ్.ప్రతాప్

 ఒకప్పుడు ఒక అడవిలో ఒక అందమైన జింక వుండేది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ వుండే ఆ జింక శరీరం పై నల్లని మచ్చలు దాని అందానికి మరింత వన్నె తెచ్చాయి. పచ్చిక బయళ్ళలో తాజా గడ్డిపరకలను తింటూ ఆ జింక ఆనందంగా గంతులు వేసి పరిగెడుతూ వుండేది.దాని ఆనందం చూసి ప్రకృతి అంతా పరవశిస్తూ ఉండేది.
పరివారం అతనిని అనుసరిస్తుండగా కనిపించిన జంతువులపై అతి లాఘవంగా బాణాలు వేసి వాటిని వధిస్తూ అమితానందం పొందుతున్నాడు ఆ రాజు. ఇంతలో అతడి కళ్ళు ఆ అందమైన జింకపై పడ్దాయి. కళ్ళు చెదిరే అందం తో వున్న ఆ జింకను వధించి, ఆ చర్మాన్ని రాజ ప్రసాదానికి తీసుకువెళ్ళి అలంకరిస్తే ఆ రాజ ప్రసాదం అందం మరింత ద్విగుణీకృతమౌతుందనుకున్నాడు రాజు.
ఇక ఆ ఆలోచన వచ్చిందే తరువాయి తన వింటికి బాణాలు సంధించి ఆ జింక వెనకాల పడ్డాడు.
ప్రమాదాన్ని పసిగట్టిన ఆ జింక రెట్టింపు వేగంతో పరుగులు తీయసాగింది. దానిని ఎలాగైనా అందుకోవాలన్న పట్టుదలతో రధసారధి గుర్రాలను అదిలిస్తూ రధాన్ని దాని వెనుకే పరుగులు పెట్టించాడు. ఆ జింక అలుపన్నది లేకుండా అడవిలో పరుగులు తీయడం, దానిని అంతే వేగంతో రధం అనుసరించడం కొనసాగింది. అలా ఆ రథం దట్టమైన ఆ అడవిలో మధ్య భాగానికి ప్రవేశించింది. ఆ రథం వేగం అందుకోలేక రాజపరివారం తలా ఒక దారి పట్టి చెల్లాచెదురయ్యారు.
ఇంతలో ఆ రథం తాలూకు ఒక చక్రం విడిపోయింది. అందువలన రధం సమతుల్యం తప్పి చెల్లాచెదురయ్యింది. గుర్రాలు కింద కూలబడి స్పృహ తప్పాయి. రధసారధి పట్టుతప్పి రధం చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
రాజు  మరొ వైపుకు విసిరి వేయబడ్డాడు. ఆ ఊపులో వెళ్ళి పక్కన వున్న చెరువులో పడ్డాడు. దురదృష్టవశాత్తు అతనికి ఈత రాదు. భయంతో ఎవరైనా రక్షించండి, నేను మునిగిపోతున్నాను, నాకు ఈత రాదు" అంటూ బిగ్గరగా కేకలు వేయసాగాడు. సమీపంలో ఉన్న జింక, రాజు అరుపులు విని, అతనిని నీటి నుండి బయటకు లాగింది. వేటాడి చంపాలనుకున్న జింకే అతనిని  రక్షించిందన్న సంగతి అర్ధమైన రాజుకు తన క్రూర ప్రవర్తనకు సిగ్గు వేసింది. మానవులకు, జంతువులకు వున్న తేడా స్పష్టంగా రాజుకు అర్ధమయ్యింది. 
మానవులు తమకు హాని తలపెట్ట యత్నించిన వారిపై కక్షలు, కార్పణ్యాలు పెంచుకొని, వారిపై ఎలా పగ సాధిద్దామని ఎదురుచూస్తుంటారు. శరీరం నుండి ప్రాణం పోయేంతవరకు ఆ పగ వారిలో రగులుతునే వుంటుంది.జంతువులు మరొక పక్క ప్రవృత్తిపై ఆధారపడతాయి. ఈ సందర్భంలో తమకు ప్రాణ హాని తలపెట్ట యత్నించిన వారిపై కూడా దయ తలచి రక్షించి దైవత్వాన్ని ప్రదర్శించింది ఆ జింక. అందుకే మానవులు అసుర ప్రవృత్తికి వదిలిపెట్టి, దైవత్వాన్ని సంతరించుకోవడం జీవన విధానంగా మారాలని, అదే  ఆధ్యాత్మికకు తొలిమెట్టని వేదం ప్రవచించింది.కళ్ళకున్న అజ్ఞానపు పొరలు విడిపోయాయి. మనసులో పేరుకున్న అజ్ఞానాంధకారం పటాపంచలు అయ్యింది.కారుణ్యం ఉప్పొంగింది. తాను తన ప్రాణాలు రక్షించుకోవాలనుకున్నప్పుడు ప్రదర్శించిన తెగింపు, ధైర్య సాహసాలు, రధాన్ని అటు ఇటూ పరిగెట్టించిన వైనంలో చూపించిన సమయస్పూర్తి తో పాటు తనకు హాని చేయబోయిన మానవుడు ప్రమాదంలో ఇరుక్కుంటే తన ప్రాణాలకు తెగించి రక్షించడంలో చూపించిన మానవత్వం, కరుణ - వీటిని బట్టి మానవుల కంటే జంతువులు ఎంత ఉన్నతంగా ప్రవర్తిస్తాయో అర్ధం చేసుకున్న రాజు ఇక జీవితంలో వేటాడనని శపధం చేసాడు. అంతేకాకుండా తన రాజ్యంలో నాటి నుండి వేటను, జంతు వధ నిషేదించాడు.
కామెంట్‌లు