యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ...; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది. ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి. గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబడినది.
ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, సంక్రమణపు రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్మకం.



కామెంట్‌లు