ఆకవి అదృష్టం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అదిగో అటుచూడండి
ఎవరో గుంపుగా వెళుతున్నారు
ఎందుకో ఆదుర్దాపడిపోతున్నారు
ఏదో అత్యవసరపనిమీద వెళ్తున్నారు

చీమల దండులా
వరుసక్రమంలో వెళుతున్నారు
జింక పిల్లలులా
పరుగెత్తుకుంటూ పోతున్నారు

అందముగా ఉన్నారు
వెలిగిపోతున్నారు
ఆకర్షిస్తున్నారు
అబ్బురపరుస్తున్నారు

అనుమానం దేనికి
అడుగుతా 
అసలు విషయం
తెలుసుకుంటా

ఆగండి ఆగండి
ఏవరు మీరు
ఎక్కడకు వెళుతున్నారు
ఏపనిమీద పోతున్నారు

ఆగకుండా
ఆలశ్యంచేయకుండా
సమాధానమిస్తూనే
సాగిపోయారు

ఆపకండి ఆపకండి
అక్షరాలము మేము
ఆకవిదగ్గరకు వెళుతున్నాము
అమ్మభారతీదేవి ఆఙ్ఞపై పోతున్నాము

కవిగారు పిలిచినట్లున్నారు
కలం పట్టుకున్నట్లున్నారు
కవనం చేస్తున్నట్లున్నారు
కవితలు వ్రాస్తున్నట్లున్నారు

ఆ కవిని చూడవలె
ఆ కవితను చదవవలె
అందరితో పంచుకొనవలె
ఆనందంలో తేలిపోవలె

ఆకవిపై
అమ్మవారికి
అంతవాత్సల్యం 
ఎందుకో

అక్షరాలకు
ఆకవినిచేరాలని
అంతతొందర
ఎందుకో

ఓరి పిచ్చోడా తెలుసుకోరా
ఆకవికి ఆవేశమొచ్చింది
అమ్మశారదాదేవికి అనురాగంపుట్టింది
అక్షరాలతో అవసరంపడింది

ఆకవిగారు
అదృష్టవంతుడు
సరస్వతీపుత్రుడు
సాహితీప్రియుడు


కామెంట్‌లు