సైనికులం మేము;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 తెలిసినదే కదా!!!
పాపం అని తెలిసిన
పశ్చాతాపం ఎరుగని పశువులు వారు...
అహంకారం అన్న అజ్ఞానంలో
ఆత్మాహుతికి సైతం తెగబడే అసురులు వారు...
కుట్రలను పన్ని కసితీరా చంపుతూ
కనికరం మరచిన కఠినాత్ములు వారు...
అంతా మన అందరికి తెలిసినదే కదా...
మరి ఎందుకు ఏడుస్తున్నారు 
ఎందుకు బాధపడుతున్నారు
మేము చనిపోయామనా
మమ్మల్ని చంపేశారనా...
ఎందుకు?? మారేందుకు???
ఓ... మా అమ్మనాన్నలను, భార్య పిల్లలను చూసి 
గుబులు చెందుతున్నారు కాబోలు
ఆర్మీలోకి గర్వంగా పంపిన రోజే తెలుసు
మా అమ్మనాన్నలకు తమ కొడుకు చితిమంటలలో ఎప్పుడైన రగలవచ్చని...
యూనిఫామ్ ను ఒంటిపై ధరించిన రోజే మాకు తెలుసు
మా జీవితం, కాలం లాగా నిలకడ లేనిదని...
పెళ్ళి చేసుకునే రోజే మా భార్యలకు తెలుసు తమ
భర్త బంధాలను బాధ్యతగా నిర్వహించలేదని, భర్త కన్న ముందు 
మేము భరతమాతకు సేవకులమని...
నాన్న మొహం ఎరుగని మా పిల్లలకు తెలుసు
తమ తండ్రి తన కుటుంబాన్నే కాకుండ సమస్తాన్ని కాపాడుతూ 
వీరయోధుడిలా పోరాటం చేస్తున్నాడని...
ఎవరూ ఏడవకండి...మేము చావలేదు
నిజానికి మాకు చావేలేదు...
జై హింద్ అన్న పదంలో సజీవంగా బ్రతికేవున్నాం...
మేము కోట్లాది మంది ప్రజల తలపులలో బ్రతికేవున్నాం...
పగవాడికి చావుని రుచిచూపా లనే ప్రతి సైనికుడి తపనలో బ్రతికేవున్నాం...
మేము బ్రతికేవుంటాం
కానీ మా బాధ ఒక్కటే
యుద్ధం చేస్తూ తుది శ్వాస విడవలేదని మాత్రమే,
రణరంగంలో వెనుతిరిగే అలవాటే లేని మాతో నేరుగా యుద్ధం చేయలేక
వెన్నుపోటు పొడిచారని... అదే...అది మాత్రమే...
(పుల్వామా ఘటనలో ప్రాణాలను కోల్పోయిన సైనికులకు అంకితమిస్తూ...)

కామెంట్‌లు