ఎవరి ప్రతిభ వారిదే!;-- యామిజాల జగదీశ్
అదొక పెద్ద వనం. ఆ వనంలో కుందేలు, ఉడుత, జింక స్నేహంగా ఉండేవి.
ఓరోజు ఈ మూడూ కలిసి పక్కనున్న అడవిలో జరిగే ఓ ఉత్సవానికి బయలుదేరాయి. 
దారిలో అవి ఓ మొసలిని చూసాయి.
"మిత్రులారా! ఎక్కడికి బయలుదేరారు?" అని అడిగింది మొసలి ఆ మూడింటినీ చూసి.
ఇక్కడికి దగ్గర్లో ఉన్న అడవిలో జరిగే  ఉత్సవానికి పోతున్నాం" అన్నాది జింక  కొండంత ఉత్సాహంతో.
"అలాగా, నేనూ మీతో వస్తాను. కలసిపోదాం" అంది మొసలి.
వెంటనే కుందేలు ఫకాలున నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావు?" అక్కడి ఉత్సవాన్ని నేను చూడకూడదా?" అడిగింది మొసలి.
"నువ్వు రాకూడదని నేను నవ్వలేదు. మా ముగ్గురికీ వేగంగా పరుగెత్తగల శక్తి ఉంది. కానీ నువ్వు మాలాగా పరుగెత్తలేవుగా. మెల్లగా పాక్కుంటూ వస్తావు. నీతో కలిసొస్తే అక్కడ ఈలోపు ఉత్సవం ముగిసిపోతుంది కదా" అంది ఉడుత. 
"మీరంటున్నది నిజమే. కాదనను. అయితే నేను రాను కానీ. మీరు తిరిగొస్తున్నప్పుడు మీ అనుభవాలను చెప్పండి" అంది మొసలి.
అలాగేనని కుందేలు, ఉడుత, జింక మొసలి నుంచి వీడ్కోలు పొందాయి. ముగ్గురు మిత్రులూ వేగంగా పరుగు తీశారు.
వాళ్ళు వెళ్ళదలచుకున్న అడవికి పోయే మార్గమధ్యంలో ఓ సరస్సు ఉంది. నీటిప్రవాహం జోరుగా ఉంది.
ఎంతో ఆశతో బయలుదేరిన మూడూ సరస్సునెలా దాటాలా అని సందిగ్ధంలో పడ్డాయి.
"మిత్రమా, నీటిప్రవాహం ఎక్కువగా ఉంది. ఎలా దాటాలి?" అడిగింది కుందేలు.
"అవును. అదే నాకూ అర్థం కావడం లేదు. మనం ఉత్సవానికి వెళ్ళలేకపోతామేమో?" అని జింక ఆందోళన పడింది.
"రండి. మనం చాలా దూరం వచ్చేసాం. కన్పిస్తున్న ఆ చెట్టు నీడలో కాస్సేపు సేదదీరుదాం. ఈలోపు నీటి ప్రవాహ వేగం తగ్గుతుందేమో చూద్దాం" అంది ఉడుత.
కాస్సేపటకి ఆ సరస్సులో ఈదుకుంటూ వస్తున్న మొసలి కనిపించింది.
"ఏం చేస్తున్నారిక్కడ? సంబరాలకు సమయం కావస్తోందిగా" అడిగింది మొసలి ఆ మూడింటినీ చూసి. 
"సరస్సులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆ ప్రవాహాన్ని అధిగమించి ముందుకు పోవడం మావల్ల కాదు" అని కుందేలు, ఉడుత, జింక ముక్తకంఠంతో చెప్పి బాధపడ్డాయి.
అప్పుడు మొసలి "ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నారు? నేనున్నాగా, నేను మిమ్మల్ని ఆవలితీరానికి చేరుస్తాను" అంది. 
"అవునా?" అంది జింక.
"అవును. మీరు ముగ్గురూ నా వీపుమీద కూర్చోండి. మిమ్మల్ని సులభంగా ఆవలి తీరానికి తీసుకుపోతాను" అంది మొసలి.
 "చాలా చాలా థాంక్స్ అన్నా. మేమిందాక నీ మనస్సు నొప్పించేలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించు. మేమలా మాట్లాడినా నువ్వు మనసులో అవేవీ పెట్టుకోకుండా మమ్మల్ని ఆవలి తీరానికి తీసుకుపోతాను అని ఎంతో ప్రేమగా చెప్తున్నావు. ఇంకెప్పుడూ నీ మనసుని నొప్పించం" అంది కుందేలు.
"అదొక విషయమా? నేనేమీ మీ మాటలను సీరియస్సుగా తీసుకోలేదు. వీపుమీద కూర్చోండి. మిమ్మల్ని ఆవలి తీరానికి తీసుకుపోతాను. సంబరాలకు సమయం మించిపోవచ్చు" అంది మొసలి.
వెంటనే ఆ మూడూ మొసలి వీపుమీద కూర్చున్నాయి. మొసలి అనుకున్నట్టే ఆవలి తీరానికి ఆ ముగ్గురినీ చేర్చడం, అవి అడవిలోని సంబరాలలో పాల్గొనడం అంతా సరదాగా సాగిపోయాయి. 
ఈ కథవల్ల తెలుసుకోవలసిందల్లా ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని. ఒక్కొక్కరిలోనూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎవరి ప్రతిభ వారిదే. కనుక ఏదున్నా ఎంతున్నా అణకువ ముఖ్యం.
కామెంట్‌లు