“నా ప్రతి క్షణం నీ కోసమే” ;---- రవిబాబు పిట్టల పర్యావరణవేత్త.
ఆ నల్ల మబ్బుల ఆకాశాన్ని కమ్ముకొని ఆగమన ఆనందానికి
పుడమితల్లి పులకరించి పచ్చదనంతో పురుడోసుకుంటుంటే.......

కారుమబ్బులు తమ నిషా కురులతో అంబరాన్ని అలముకొని దుప్పటి కప్పే స్తుంటే...!

వరుణుడు తరుముకొస్తున్న నల్లని మేఘాల రధాన్ని చూసి
ఆనంద పారవశ్యంలో పురులు విప్పి ఆదమరిచి నాట్యంచేస్తు మయూరం ఆనందభాష్పాలతో ఆకర్షిస్తుంటే...

తాండవానికి ముగ్ధురాలై ఆకర్షించిన మరియురాంగిని 
ప్రణయ వల్లరికి పానుపేసి అర్ధాంగినైపోతు, 
ఆనంద భాష్పాలనాస్వాదిస్తుంటే ...

సిగ్గుపడుతూ పకృతమ్మ పరవశిస్తూ జారుతున్న పచ్చని పైటను సిగ్గుపడుతూ సరిచేసుకుంటుంటే...

ఆకాశమార్గంలో వరుణుడు భీకర కఠోర మెరుపు బాణాలను సంధిస్తుంటే...

వరుణుడి ప్రణయానికి మేఘమాల నల్లని కురులనుంచి ఆనంద భాష్పాలతో వర్షిస్తూండగా...

ఆకుపచ్చని ప్రకృతి అమ్మ పైట తాకిన పైరగాలికి
పుడమి తల్లి పైటను పానుపుగా పరిచి ప్రణయ 
యుద్ధానికి సిద్ధమని ప్రకటిస్తుంటే...

మేఘనాధుడు మెరుపులతో మోసుకొస్తున్న వరుణుడు సంధించిన మన్మధ బాణాలను పుడమి తల్లిని ముద్దాడుతుంటే...

చల్లగాలి పిల్లగాలై ప్రణయ బంధంలో ఇరుక్కుపోయి సిగ్గుతో ఉక్కిరి బిక్కిరౌతుంటే...

ఆ క్షణమే అదునుగా వరుణుడు మేఘుని సఖ్యంతో వంగి పుడమి తల్లి నడుమొంపుల్లో చుంబనాలతో స్పర్శిస్తుంటే...

ఇక చాలు అన్నట్టు పులకరించిన పుడమి తల్లి ఆదమరచి నిట్టూర్పులతో స్వేద బిందువులను వదిలేస్తుంటే...

బిందువు బిందువులేకమై  పిల్లకాలువలై, సెలయేళ్ళు జలపాతాలై, సరస్సులై, నదులై పరవళ్లు తొక్కుతూ సంతోషంతో సముద్రుని చేరుకుంటూంటే...

ఇంత అందమైన ప్రకృతిని...నచ్చని నరుడు మాత్రం నాశనం చేయాలని రాక్షసుడు అవుతుంటే...

వరుణ దేవుడిని, ప్రకృతి తల్లిని, నదీ నాగరికతను వర్ణించిన 
కవి కలం మాత్రం ప్రకృతిని రక్షించే కోణంలో కదల లేక పోతుంది... ఎందుకు??? 

అయినా పకృతి మాత్రం ఇంకా 
ఎదురు చూస్తూనే ఉంది తనను రక్షించాలని...
అందుకే పంచభూతాలు ఘోషిస్తున్నాయి...

అయినా “నా ప్రతిక్షణం నీ కోసమే”  నని........

===================================

(పంచ భూతాలే కవితాక్షరమాలతో అర్జించిన వేళ...“నా ప్రతి క్షణం నీ కోసమే” 2. సశేషం...)

కామెంట్‌లు