చినుకై రాలవే మేఘమా!;-కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,NCVBDC సికింద్రాబాద్, 8555010108
మది దోచే నీ మధుర స్మృతుల కోసం
మరిచిపోలేని నీ జ్ఞాపకాల ప్రవాహం కోసం  
ప్రాణి కోటి నీ రాకకై కోటి కళ్ళతో నిరీక్షణ!
నింగిలో నెలవంకని చూస్తూ కొలువైతివా 
వర్షం సకల జీవుల ఎదలో హర్షం!

నీ తొలకరి చూపుకై ఎదురేగి
ఏరువాక పలికే సుస్వాగతం  
ఆనందంతో చిందులేసే ఆషాఢం
గల గలా పారుతున్న పిల్ల కాలువలో 
కాగితపు పడవ లేసే బాల్య  స్మృతులు 

చినుకు చినుకు చేయి కలిపితేనే 
వాగు వంకలు ముందుకు సాగేది 
టప టప రాలే చినుకు పువ్వుల్ని 
దోసిళ్ళతో నింపి దోబూచులాడేది
పసి మొగ్గలు బోసి నవ్వులతో మురిసేది 

వాన చినుకు వసుధని ముద్దాడితేనే 
విత్తనాలు పురుడు పోసుకునేది  
మోడు వారిన దేహాలు చిగుళ్ళు తొడిగేది
వొళ్ళంతా తడిసి ముద్దైన సీతాకోచిలుకలు 
అందాల రెక్కల్ని ఆరేసుకునేవి

అప్పుడప్పుడు పెను తుఫానుగా 
మహోగ్ర రూపం ప్రదర్శిస్తావు 
ఒక్కోసారి ఉరుముల మెరుపులతో
ఆకాశం బద్దలయ్యేలా గర్జిస్తూ, గాండ్రిస్తూ
ముఖానికి గాంభీర్యం పులుము కుంటావు 

చినుకై రాలవే మేఘమా!  
చిట పట సవ్వడితో నా చెలి 
కాలి అందెలకు సంగీతం నేర్పగ రావే!
ప్రకృతి పరవశాన పులకరించగ 
కమనీయ దృశ్యాలు కనువిందు చేయగా 

మేఘమా! మెరిసే నీ నిర్జీవ దేహంతో  
ప్రాణులకు ఊపిరి పోసి ఉత్తేజ పరుస్తావు 
నీ రాకడ ప్రాణం పోకడ ఎవరి కెరుక?
నీ కర స్పర్శతో ప్రకృతికి పచ్చని రంగులద్ది 
సుగంధ పరిమళాలు పంచుతావు 
నీవు కానరాని నాడు
మట్టి మనిషి తల్లడిల్లి సొమ్మసిల్లి పోతాడు


కామెంట్‌లు