*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0123)*
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని తపస్సు -  శివదేవి వరము ఇవ్వడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*నా మాట ప్రకారం, దక్షుడు పాలసముద్రం ఒడ్డున తపస్సు చేయడానికి అనువైన ప్రదేశం తయారు చేసుకుని, జగదంబ అయిన ఉమను కూతురిగా పొందాలి అనే కోరికను మనసులో వుంచుకుని, అంబను ప్రత్యేకంగా చూడాలి అని జగదంబ ను మనసులో నింపుకుని, అంబను గురించి తీవ్రమైన తపస్సు మొదలు పెట్టాడు. ఎన్నో కఠినమైన నియమాలు పాటించాడు. ఒక్కో సారి మంచినీరు తాగి, ఆకులు అలములను ఆహారంగా తీసుకుని, ఒక్కో మారు గాలని మాత్రమే పీల్చుతూ ఇల మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసాడు, దక్షుడు. యమనియమాలను పాటించి జగదంబను పూజించేవాడు. ఇంత తీక్షణమైన తపస్సు కు మెచ్చిన జగదంబ దక్షుని ఎదుట ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చింది.*
*అలా దక్షుని ఎదుట ప్రకటితమైన అంబ, బంగారు కాంతులు కలిగిన శరీరంతో, ఎంతో అందమైన కాంతి కలిగిన ముఖముతో, నాలుగు చేతులు కలిగి సింహ వాహనం మీద కూర్చుని వుంది. నాలుగు చేతులలో అభయ, వరద, ఖడ్గం, నీలి రంగు కమలం ధరించి వుంది, అంబ. లేత ఎర్రని రంగులో వున్న కళ్ళు, ఒత్తుగా అందమైన కురులు కలిగి కమనీయ విగ్రహం లాగా జగదంబ ప్రకటితమైంది. అలా ఎంతో ఉత్తమమైన కాంతిలాగా కనబడుతున్న అంబను చూచి దక్షుడు, "అంబా! నువ్వు మహామాయవు. ఈ జగత్తుకు తల్లివి. నీవే ఆద్యా శ్రీ మహాలక్ష్మివి. భగవతీ, నాయందు ప్రసన్నురాలవు అవు తల్లీ. నీవు నన్ను కరుణించి నా ముందుకు వచ్చావు. కానీ, నా కర్మ చక్షువులతో నిన్ను చూడలేక పోతున్నాను. నాకు దివ్య దృష్టిని ఇచ్చి, నిన్ను చూచే భాగ్యం కలిగించు తల్లీ!" అని ప్రార్ధించాడు దక్షుడు.*
*దక్షుని ప్రార్ధనలకు కరిగిపోయిన జగదంబ దివ్య దృష్టిని ఇస్తుంది. అంబను మనసారా దర్శంచుకుంటాడు దక్ష ప్రజాపతి. అప్పుడు, దక్షుని మనసు చదవగలిగిన అంబ, దక్షుని ద్వారా తనకోరిక తెలుసుకోవాలని, ప్రజాపతిని చూచి,  "దక్షా నీవు ఏవిధమైన వరం అయినా పొందడానికి అర్హుడవు. నీ మనసులో వున్న కోరికను, నిస్సంకోచమగా నాకు చెప్పు. నీ కోరిక ఎటువంటిది అయినా, అది తీరుతుంది." అని పలుకుతుంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు