*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0135)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివుడు దక్షుని ఇంటికి రావడం - సత్కారం పొందటం - సతీశివుల వివాహము*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దేవగణములతో కలసి, విష్ణువు, నేను కైలాసానికి చేరుకున్నాము. అక్కడ సదాసశివునితో నేను ఇలా చెప్పాను. "పన్నగభూషణా, మేమందరము దక్షుని గృహం నుంచి వస్తున్నాము. దక్షుడు తన కుమార్తె సతీదేవిని నీకు ఇచ్చి వివాహము చేయడానికి చాలా ఉత్సాహంగా వున్నాడు. సతీదేవి నిన్ను వివాహమాడటానికే పుట్టిన ఉమగా భావిస్తున్నాడు. సతీదేవి 4వేల సంవత్సరాలు మీ కోసమే తపస్సు చేసింది అని కూడా నమ్మికతో వున్నాడు. దక్షుడు తన కుమార్తె చేయి నీ చేతికి అందించడానికి ఎదురు చూస్తున్నాడు. ఒక శుభ మూహూర్తములో రుద్రుడు తన పరివారం తో కలసి ఇక్కడికి వస్తారు. అప్పుడు సతీదేవి ని ఆయనకు విధివిధముగా కళ్యాణం జరిపిస్తాను అని మీ రాక కోసం దక్షుడు ఎదురు చూస్తున్నాడు."*
*నా మాటలు విన్న పరమేశ్వరుడు అయిన రుద్రుడు లోకరీతిని అనుసరించి, నారదుడవైన నిన్ను, మరీచి, సనకసనందనాదులతో కూడిన నా మానస పుత్రులను, తన పార్షదులైన రుద్రగణములను వెంట పెట్టుకుని సతీదేవి ని వివాహమాడటానికి దక్షుని గృహానికి ప్రయాణమయ్యాడు. దారిలో శివ పార్షదులు, ఢమరు, శూలము, జడలు, పన్నగము ధరించి జగదేక సుందర మూర్తిగా వెలుగుతూ చక్కగా అలంకరించిన బలీవర్ధ నందికేశ్వరునిపై వున్న పరమేశ్వరుని చూచి సంబరాలు చేసుకున్నారు. రుద్రదేవుడు స్మరించగానే శివభక్తాగ్రేశ్వరుడైన విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీ దేవి తో కలసి వెంట వుండగా, రుద్రుడు దక్షుని గృహ ద్వారము వద్ద ప్రత్యక్షంగా వెలసాడు.*
*దేవ గణాలతో, శివపార్షదులతో, విష్ణుమూర్తి, నాతో కలసి తన గుమ్మం ముందు వున్న శివదేవుని చూచి పులకించి పోయిన దక్షుడు తన ఇంటి పురోహితులు, దేవర్షుల సలహాతో వచ్చిన శివదేవుని కి ఉచితాసనం ఇచ్చి గౌరవ సత్కారాలు జరిపించారు. మిగిలిన వారందిరికి గూడా వారి వారి అర్హతలను బట్టి గౌరవ సత్కారాలు చేసి, వివాహ విడిది గృహానికి తీసుకుని వచ్చాడు, దక్షుడు.*
*దక్షుని కోరిక మీద, శుభలగ్న సుమూహూర్తములో, అంబరాన్ని అంటుతున్న సంబరాల మధ్య బ్రహ్మ నైన నేను సతీదేవి చేతిని సదాశివుని చేతిలో వుంచాను. ఈ శుభ ఘడియ కోసమే వేచివున్న ప్రకృతి ఆనంద పారవశ్యంతో పూల వర్షం కురిపించింది. మేఘుడు చిరు చినుకిల ముత్యాలు రాల్చాడు. దేవగణాలు, శివ పార్షదులు మంగళ వాయిద్యాల ఘోష చేసారు. శివునికి కన్యదానము చేసి దక్షుడు పరమానందభరితుడు అయ్యాడు. శివా, శివులు కూడా పసన్నులయ్యారు. లోకమంతా మంగళ ప్రదంగా కనిపించింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు