*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0137)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివా శివుల అగ్ని నమస్కారం - వివాహ వేదిక మీద శాశ్వతంగా నిలిచి వుండటం - కైలాసమునకు వెళ్ళడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దక్షుని నుండి సతీదేవిని కన్యదానముగా స్వీకరించిన రుద్రుడు, విష్ణువు మొదలైన దేవగణములు చేసిన స్తుతి విని సంతోషపడి, బ్రహ్మ ను చూచి వరం కోరుకోమన్నప్పడు, నేను సదాశివునితో, " నిరంజనాకారా! నేను మీ కృపకు అర్హుడను అయితే, మీరు ప్రసన్నులు అయితే, లోక కళ్యాణము చేయగల ఈ కళ్యాణ రూపంలో సతీదేవి సమేతంగా ఈ కళ్యణ మండపంలో శాస్వతముగా ఉండి సకలజనులను అనుగ్రహించండి. మీరు అనుగ్రహిస్తే, ఈ మీ కళ్యాణ వేదికకు దగ్గరగా ఒక ఆశ్రమం నిర్మించుకుని, నేను తపస్సు చేసుకుంటాను. ప్రతీ చైత్రమాసంలో, శుక్లపక్ష త్రయోదశి, పూర్వఫల్గుణీ నక్షత్ర ము నాడు మిమ్మల్ని సేవించుకున్న మానవులకు అన్ని దుఃఖాలనుండి విముక్తి లభించాలి అని నా అభిలాష."*
*నా ఈ ప్రార్ధనకు అంగీకరించిన పరమేశ్వరుడు, సతీ సహితముగా తన అంశ రూపమున కళ్యాణ వేదిక మధ్యభాగంలో వెలశాడు. ఆ తరువాత, దక్షుని వద్ద సెలవు తీసుకొని సతీదేవి సహితంగా తన పరివారం తో కలసి కైలాసానికి పయనం అయ్యారు, రుద్రుడు. చక్కగా అలంకరణ చేయబడిన వృషభము మీద ముందుగా నగరాజ తనయను కూర్చోబెట్టి, తరువాత రుద్రుడు తాను కూడా ఆ వృషభవాహనాన్ని ఎక్కారు. శివపార్షదులు జయజయ ధ్వానాలు చేస్తుండగా, దేవగణముల వాద్యగోష్టితో, అంబరం నుండి పూల వర్షం కురుస్తుండగా, తనతో కొంతదూరము వచ్చిన దక్షుని కి సెలవు చెప్పి, హిమవత్పర్వత సానువులవైపు, కైలాసానికి బయలు దేరాడు. లక్ష్మీ దేవితో విష్ణువు, సరస్వతి తో నేను, మిగిలిన దేవ, రుషి గణములు మా మా స్వగృహాలకు బయలు దేరాము.*
*సతీదేవి తో కూడిన భగవంతుడు అగు శివుడు హిమాలయ శిఖరము మీద ఆనందముగా నివసించు చుండెను.*
*ఫలశ్రుతి:- యజ్ఞము, వివాహము, మొదలైన శుభకార్యములు మొదలు పెట్టేటప్పుడు, ముందుగా ఈ శవాశివుల కళ్యాణ కథను శాంతంగా ఏకాగ్ర చిత్తంతో, వినాలి. ఆ తరువాత, ప్రారంభించే ఏ కార్య మైనా నిరాటంకంగా, నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. ఈ కథను విని వివాహం చేసుకొనే కన్యలు, సుఖసౌభాగ్యము, సౌశీల్యము, సదాచారము అనే సద్గుణములను పొంది, పుత్రవంతులు అవుతారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు