*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0138)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి ప్రశ్న - శివ భగవానుని విజ్ఞానము, నవవిధ భక్తి వివరణ*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*శివాశివులు, కైలాసమునందు, హిమవత్పర్వతములందు ఆనందముతో విహరిస్తూ, తమ సృష్టి లో ఏర్పడిన ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ, భక్త పరిపాలన చేస్తున్నారు. ఒకానొక నాడు, ధ్యాన ముద్రలో వున్న శంకరుని చేరిన సతీదేవి, సభక్తికంగా చేతులు జోడించి స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి జపిస్తూ, వేచి చూస్తోంది, అమ్మలగన్న అమ్మ. విప్పారిన స్వామి అర్ధనిమీలిత కన్నుల అందాన్ని ఆస్వాదిస్తూ, దక్షకుమారి అయిన ఉమ తనవాడైన జగత్పతిని ఇలా ప్రార్థించింది.*
*"దేవదేవా! పరాత్పరా! మహాదేవా! భక్తపరాయణా! కరుణాకరా! మీరే పరమ పురుషులు. మీరే సర్వమునకు తండ్రి. మీరు సత్వరజస్తమో గుణములకు అతీతులైన నిర్గుణులు, సగుణులు కూడా. నిర్వికారులు అయినా అన్నిటికీ సాక్షీభూతులు. అందరికీ మీరే ప్రభువు. స్వామీ! మీచే కోరుకోబడి మిమ్మల్ని చేరుకున్న నేను ధన్యరాలను అయ్యాను. మీతో కలసి మీ సృష్టిలో వున్న ఎన్నో సుందరమైన ప్రదేశాల అందాలను చూడగలిగే భాగ్యం కలిగింది. ఎన్నో వేల సంవత్సరాలుగా నిరంతరము ధ్యానయోగాన్ని అనుభవిస్తున్న మిమ్మల్ని చూచి, ఇప్పుడు నాకు విషయ వాంఛలమీద మనసు తొలగిపోయింది."*
*"నిరతిశయ సుఖమును ఇవ్వగలిగిన పరతత్వ జ్ఞానము పొందాలి అని కోరిక కలిగింది. జీవుడు సంసార దుఃఖములనుండి అనాయాసముగా బయట పడగలిగే విధానము మీ నుండీ తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. ప్రతీ నిత్యము ఏదో ఒక కర్మ చేస్తూ, విషయ వలయంలో చిక్కుకున్న మానవులు ఉద్ధరింప బడేది ఎలా? ఏమి చేస్తే నిరంకుశ సంసార బంధనాలనుండి ముక్తుడు అవుతాడు. ఈ విషయములు అన్నీ నాకు తెలియచేయండి, దీనజనోద్ధారపరాయణా!" అని లోక హితం కోసం సతీదేవి అయిన ఉమ, పరమాత్ముడైన రయద్ర దేవుని ప్రార్థించింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు