*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 024*
 *చంపకమాల:*
*రాముఁడు ఘోరపాతక వి | రాముఁడు, సద్గుణకల్పవల్లికా*
*రాముఁడు షడ్వికార జయ | రాముఁడు సాధుజనావనవ్రతో*
*ద్దాముడు రాముడే పరమ | దైవము మాకని మీ యడుంగు గెం*
*దామరలే భజించెదను | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయకు సముద్రము వంటి వాడవైన రామచంద్రా! ఆనందాన్ని కలిగించేవాడివి, ఘోరమైన పాపపు మూటలను పోగొట్టే వాడివి, కల్పవృక్షము లాగా మంచి గుణములను ఇచ్చే వాడివి, పుట్టడం, మరణించడం అనే ఆరు వికారములను జయించిన వాడివి, సాధువులు, మంచి వాళ్ళని ఉద్ధరించి కాపాడే వాడివి, అయిన రామా నీవే మాకు అందరి దేవతలకంటే ఎక్కువ. ఇన్ని లక్షణాలు కలిగి,  భద్రాద్రి పైన నెలకొన్న నీ పాదాలను ఎల్లప్పుడూ సేవించుకుంటాను ...... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"శ్రీ రఘురాం! జయ రఘురాం! సీతా మనోభిరాం!!" అన్న తమ్ములు ఎలా వుండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా వుండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వుండాలి, భార్యా భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలావుండాలి. రాజు, మంత్రి, సేవకుడు, ప్రజలు ఎంత బాధ్యతగా వుండాలి అని మనకందరకు అర్ధమయ్యేలా చెప్పిందే "రామాయణం". అందుకే అన్నారు పెద్దలు, " రామాయణం " చదవడం అంటే రాముడు చూపిన దారిలో "నడవడం" అని. అందుకే రామాయణం మనం చదివి, అర్థం చేసుకుని, పిల్లలకు చెప్పే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రయత్నం లో ఆ రామచంద్రమూర్తి మనకు అన్ని వేళలా, అన్ని విధాలా సహాయకారిగా వుండేలా అనుగ్రహించమని పరమశివుని వేడుకుందాము.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు