*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 033*
 *చంపకమాల:*
*జలనిధిలోన దూరి కుల | శైలముమీటి ధరిత్రిగొమ్మునన్*
*దలవడమాటి రక్కసుని | యంగము గీటి బలీంద్రునిన్ రసా*
*తలమున మాటి పార్ధివ క | దంబము గూల్చిన మేటి రామ! నా*
*తలఁపున నాటి రాఁగదవె | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! రామభద్రుడా! నీవు మత్స్యావతారంలో నీటిలో దాగి వున్న సోమకాసురుని చంపావు. కూర్మ అవతారంలో సముద్రపు నీళ్ళలో వున్న మందర పర్వతాన్ని పైకి తెచ్చావు. వరాహావతారంలో నీటి లోపల దాచిపెట్టబడ్డ భూమిని నీ కొమ్ములతో పెకలించి పైకి తీసుకు వచ్చావు. నారసింహుడవై హిరణ్యకశిపుని దేహాన్ని చీల్చావు. ఇంద్రుని తో సమానంగా వెలుగుతున్న బలిచక్రవర్తి ని వామునుడిగా వచ్చి అణచివేసావు. పరశురాముడివై దుష్ట రాజులు అందరినీ సంహరించావు. ఇంతటి ఘనమైన వాడా! రామా! నన్ను రక్షించడానికి నా ఆలోచనలలో, మనసులో స్థిరముగా వుండు ..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రామ నామము, రామ ధ్యానము తప్ప వైతరణి దాటడానికి వేరొక దారి కనబడదు. లేదు. మనం ఏ పనిలో వున్నా, ఏ రూపంలో వున్నా, రామనామ జపాన్ని వదలకుండా వుండటమే మనకు పరమావధి. తను రావణుని నిలబెట్టలేను అని తెలిసి కూడా, జటాయువు రామసాయం కోసం ప్రయత్నించాడు కదా! తన చిన్న శరీరం తో ఏమి చేయాలి అని ఉడుత ఇసుకలో దొర్లి ఇసుకను మోసుకు వెళ్ళింది కదా వారధి కట్టడానికి. వీరు ఇద్దరూ కూడా రామ సాన్నిధ్యం పొందారు కదా! అందుకే, చేతనైన రీతిలో, ప్రయత్న లోపం లేకుండా రామ నామ జపం చేయడమే మనం చేయగలిగింది. ఈ నామ జపం నిరంతరంగా మనతో చేయించమని ఆ లోకాభిరాముని వేడుకుందాము......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు