*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 034*
 *ఉత్పలమాల:*
*భండన భీముఁడార్తజన | బాంధవుఁడుజ్జ్వల బాణతూణ కో*
*దండ కళా ప్రచండ భుజ | తాండవకీర్తికి రామమూర్తికిన్,*
*రెండవ సాటి దైవమిఁక | లేఁడనుచున్ గడగట్టి భేరికా*
*ఢాండడ ఢాండ ఢాండ! నిన | దంబుల జాండము నిండమత్త వే*
*దండము నెక్కి చాటెదను | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! రామభద్రుడా!  నీవు యుద్ధభూమిలో గొప్ప పరాక్రమము చూపగలవు. కష్టాలలో వున్న వారికి స్నేహితుడు వంటి వాడివి. వాడి అయిన బాణలు వున్న తూణీరాలతో కోదండమనే ధనస్సుతో చాలా గొప్పగా భుజబలము చూపగలవాడివి. ఇవి అన్నీ రామమూర్తివైన నీ సుగుణాలు. ఇటువంటి నీకు పోటీగా రెండవ దైవము లేడు లేడు అనే విషయాన్ని నీ కీర్తి అనే ధ్వజ స్థంభంనాటి, మదగజాన్ని ఎక్కి గట్టిగా ఎలుగెత్తి చాటి చెపుతాను..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఈ పద్యం కంటే రామనామ వైభవాన్ని గొప్పగా చెప్పలేమేమో. ఎంత చక్కగా చెప్పారు. పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుని, ఆ తత్వ రహస్యాన్ని ఎలుగెత్తి నలుగురుకీ చెపడం కంటే సౌభాగ్యం ఈ మానవ జన్మకు వుంటుందా. అంతటి సద్భాగ్యం వస్తే ఎటువంటి వారైనా వదలుకోరు. మానవ జాతి మొత్తానికి పరమేశ్వరుని కీర్తిని పొగడగల సదవకాశం రావాలని, ఆ అవకాశాన్ని పరాత్పరుడే కలిగించాలని, కోదండపాణినే వేడుకుందాము. మనమందరం రామనామ గానపాన మత్తులము అవ్వాలని, అలా అనుగ్రహించమని అలన్మేలమంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధిద్దాము....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు