*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 038*
 *ఉత్పలమాల:*
*ఘోరకృతాంత వీరభట | కోటికి గుండె దిగుల్ దరిద్రతా*
*కారపిశాచ సంహరణ | కార్యవినోది వికుంఠ మందిర*
*ద్వారకవాటభేది నిజ | దాస జనావళి కెల్ల ప్రొద్దు నీ*
*తారకనామ మెన్నుకొన | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా! నీ నామాన్ని తలచుకునే వారి వల్ల యమ భటులకు కూడా గుండె గుభేలు మంటుంది. నీ నామ స్మరణ భయంకరమైన పిశాచములను కూడా సంహరిస్తుంది. వైకుంఠ ద్వార పాలకురు అయిన జయవిజయులు కూడా నీ నామ భజనలో వున్న నీ దాసులైన వారిని ఆపలేరు. అంతటి గొప్పది గదా నీ నామ మహిమ..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*కేవలం రామ నామ బలంతోనే వెయ్యి యోజనాల సముద్రాన్ని సునాయాసంగా దాటగలిగాడు అనేది రామనామమంత నిజం. రామనామ బలం వల్లనే అహల్యా శాపవిమోచనం పొందగలిగింది. రామ బలం వల్లనే సుగ్రీవుడు కిష్కింధకు రాజు కాగలిగాడు. రామనామ బలంతోనే భరతుడు పదునాలుగు ఏళ్ళు పాలించాడు. రామనామ మహిమతోనే సీతమ్మ సంవత్సర కాలం అశోకవనంలో కాలం గడపగలిగింది. అదే నామ బలంతో అగ్ని పరీక్షలో దీటుగా నిలబడ గలిగింది. మనమధ్య తిరుగాడిన MS Rama Rao గారు ఆ నామ బలంతోనే మనకు తెలుగులో హనుమాన్ చాలీస అందించారు కదా! ఇంత బలవత్తరమైన నామాన్ని వదలి పెట్టకుండా పట్టుకుని వుండవలసిన అవసరం మనకు వుంది........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు