*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 042*
 *ఉత్పలమాల:*
*గద్దరియోగి హృత్కమల | గంధ రసానుభవంబుఁజెందు పె*
*న్నిద్దపు గండుఁదేఁటి ధర | ణీసుత కౌగిలిఁ పంజరంబునన్*
*ముద్దులు గుల్కు రాచిలుక | ముక్తి నిధానము! రామ! రాఁగదే*
*తద్దయు నేఁడు నాకడకు | దాశరధీ !కరుణాపయోనిధీ !.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా!  నీవు, గొప్ప గొప్ప యోగుల మనసులు అనే పద్మముల తేనే త్రాగి ఆనందము పొందేవాడవు. మా తల్లి, సీతమ్మ ఒడిలో ముద్దుల మూటలు తీసుకునే రామ చిలుకవు. ముక్తి ఇవ్వగల వాడవు నీవు. ఇటువంటి నీవు నా యందు దయతో ఇప్పుడు నా దగ్గరకు రా రామభద్రా!....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*అహల్య చేసిన మౌన జపానికి ఫలితం ఆమె శాప విమోచనం. మౌనంగా మనసులో పలుకుతేనే శాపవిమోచనం చేసిన కౌసల్యానందనుడు, గొంతెత్తి నువు నన్ను కాపాడాలి రామా! అంటే రాడా! వస్తాడు. "సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై" అని పోతనామాత్యలు చెప్పారు కదా! మన ద్వారం దగ్గర వేచి వుంటాడట, నా వారు నన్ను ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ. మరెందుకు ఆలస్యం. పిలిచేద్దాం. గొంతెత్తి జగద్రక్షకుని, "రామా! రామా! రామా!"......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు