*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 043*
 *ఉత్పలమాల:*
*కలియుగ మర్త్యకోటి నినుఁ | గన్గొనరాని విధంబొ భక్తవ*
*త్సలత వహింపవో! చటుల | సాంద్రవిపద్దశవార్ధిఁ గ్రుంకుచోఁ*
*బిలిచునఁ బల్క వింత మరపే | నరులిట్లనరాదు గాక నీ*
*తలఁపునలేదె సీత చెర | దాశరధీ !కరుణాపయోనిధీ !.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా!  ఈ భూమి మీద వున్న మనుషులు నిన్ను గుర్తించ లేక పోతున్నారో, లేక నీవు భక్తులను కాపాడాలి అనే నీ బాధ్యతను మరచిపోయావో. సముద్రము వంటి స్థాయిలో పేరుకున్న విపత్తుల లో మునిగి పోతూ పిలుస్తున్నా మాట్లాడటం లేదు ఎందుకనో! ఇంత మరపా! రామచంద్రా! మానవులము మేము ఇలా మాట్లాడకూడదు కానీ, రావణుని చెరలో సీతమ్మ అనుభవించిన బాధలను అప్పడే మరచి పోయావా, దాశరథీ!....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"నిందా స్తుతి!" "సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము, రామచంద్రా, ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు, రామచంద్రా!", " పరిదానమిచ్చితే పాలింతువేమో...", పరమేశ్వరా! బాధలను తట్టుకోలేక ఆర్తితో పిలుస్తున్నాను. పలుకు స్వామి. నీకు సైన్యాన్ని, చక్కని కన్యను ఇచ్చుకోలేను. నేనొక సామాన్య మానవ మాత్రుణ్ణి. నీవు కాకుంటే నన్ను ఇంక ఎవరు రక్షిస్తారు. ఈ సంసార సముద్రంలో దిక్కు తోచక కొట్టుకుని పోతున్నాము. "నీవు తక్క ఇతః పరం బెరుగ". నువ్వే, ముమ్మాటికీ నీవే మమ్మల్ని రక్షించ గలవు. వేరెవరి వల్ల కాదు. దయతో మమ్మల్ని కాపాడు, కాపాలికా!......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు