గొప్ప స్థపతి మా శివనాగి రెడ్డి (5);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.9492811322.

జానపద వక్ర భాష్యం విని
రెడ్డి గారు చెప్పినట్లు నేను బాధపడడం నిజం  నేను ఏమైనా కఠినంగా మాట్లాడితే క్షమించండి అంటూ విరమించ గానే రెడ్డిగారు వేదికపైనేనన్ను కౌగిలించుకొని ఇన్ని అర్థాలు ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు  చక్కటి విశ్లేషణతో చేసిన మీ ఉపన్యాసం నాకు చాలా బాగా నచ్చింది అని అభినందించారు  తెలియని విషయాన్ని తెలిసినట్లుగా మాట్లాడటం శివ నాగ రెడ్డి గారి నిఘంటువులో లేదు. ఆయన మనసు వెన్న లాంటిది తత్వం చంటిపిల్ల వాడిది. మనసులో ఏదీ దాచుకునే వారు కాదు  అందుకే వారంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి నమస్కరించి వేదికపై నుంచి వచ్చాను. ప్రేక్షకులందరూ బాగా చదువుకున్న వాళ్ళే అందరూ కరతాళధ్వనులతో నన్ను  ఆశీర్వదించారు. ఇంతమంది ఉండగా ప్రత్యేకించి రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీ రెడ్డి కులమనా అన్న వారు లేకపోలేదు. కానీ నేను రెడ్డిని అన్న విషయం వారికి తెలియదు నేను చెప్పిన తర్వాతనే నా పూర్తి పేరు వారికి తెలిసింది. ఆకాశవాణి లో నా గొంతు విని ఆకర్షితులై నన్ను స్నేహితునిగా ఆహ్వానించారు. వక్తగా వారి  ఉపన్యాసాలు విన్న తర్వాత  ఆకర్షించి నేను వారి స్నేహాన్ని కోరాను. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే నేను చిన్నప్పుటి నుంచి రేడియోలో  వార్తలు వినడం అలవాటు చేసుకున్నాను మా అన్నయ్య ద్వారా. నేను కూడా రేడియో లో మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఇంట్లో ఎవరికీ తెలియకుండా సాధన చేసే వాడిని. నేను కాలేజీ కి వచ్చిన తర్వాత ఆడిషన్ కి వెళితే నీవు పనికిరావు ఆకాశవాణి అన్నది బ్రాహ్మణుల సొత్తు నీది కాదు అని పంపించారు. దానితో కసి పెరిగింది  పట్టుదలతో  సాహిత్యం మీద కృషి చేశాను. అదృష్టవశాత్తూ ఆకాశవాణిలో పనిచేస్తున్న నండూరి సుబ్బారావు గారు  విజయవాడ మాచవరంలో నేను ఉంటున్న ఇంటి దగ్గర లోనే ఉన్నారు. వారిని చూస్తూ రేడియోని ఊహించుకున్నాను అనుకోకుండా నేను కాలేజీలో నాటకం  ప్రదర్శించడానికి  వారి వద్దకు వెళ్లి మా నాటకానికి దర్శకత్వం వహించాలని కోరితే ఆయన  అంగీకరించి వచ్చారు. నేను చదువుతున్న ప్రతి వాక్యాన్ని విని ఒక రోజు ఆనందా నీ కంఠం బాగుంది, ఆకాశవాణికి పనికొస్తుంది ప్రయత్నం చేయగలవా  అంటే అది బ్రాహ్మణులకే సార్ మాకు కాదు అన్నాను నిర్లిప్తంగా వారేమీ సమాధానం చెప్పకుండా రెండోరోజు  ఆకాశవాణిలో నాటకానికి సంబంధించిన ఆడిషన్ ఫామ్ తీసుకు వచ్చి  నన్ను ఏకాంతంగా కూర్చోబెట్టి నీ పేరు చివర రెడ్డి తీసివేస్తే నీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. రేడియోలో మాట్లాడటం కన్న నాకు వేరే ఆలోచన లేదు సార్ మీరు ఎలా చెబితే అలాగే వింటాను అన్నాను. అలా నా పేరు ఏ బి ఆనంద్ అయింది. అలాగే  శివ నాగ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది. వారి జీవితంలో స్థపతిగా రణించాలన్నది వారి జీవిత ఆశయం.

కామెంట్‌లు