తనకేం తెలుసురా; -డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
ఇల్లంతా కేరింతలు కొడుతూ, చిరునవ్వులతో చిందులేస్తూ,
అల్లరి చేస్తూ, ఆడుకుంటూ, అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ,
అమాయకమైన ఆ పసితనంలో ఎవ్వరు పిలిచినా సరే 
తన చిట్టి పొట్టి పాదాలతో పరుగులు తీసే ఆ పసిపాపకు ఏం తెలుసురా...???
కోరలు చాచిన పాములా పక్కింటి వాడే పగబట్టి వున్నాడని....
చొరవ చూసి చెరబట్టాలని చూస్తున్నాడని....

పొద్దున్నే స్కూల్ కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి పొద్దుపోయేలోగా ఇంటికి చేరుకోవాలని హడావిడిగా
తలదించుకొని ఒంటరిగా నడిచి వెళ్ళే ఆడపిల్లలకు ఏం తెలుసురా...???
కాలం విలువ తెలియని జులాయి కామం నిండిన కళ్ళతో కసాయిగా మారి కాపుకాసి వున్నాడని....
అదను చూసుకొని అమాంతం తెగబడతాడని......

కొత్తగా వచ్చిన కోడలికి ఏం తెలుసురా...???
కన్న తండ్రి తరహాలో వున్న మామయ్యే మృగరాజై వేచివున్నాడని....

వంటవండే వదినకేం తెలుసురా..???
మాటిమాటికి సాయం
చేస్తూ, చుట్టూతిరిగే మరిది మాటలలోని మర్మం వేరని...

చీర కట్టిన చెల్లెలకి ఏం తెలుసురా...???
చెలికి...చెల్లికి మధ్య తేడాను మరిచి తన అన్నయ్యే ఆశగా తన వంక చూస్తున్నాడని...

పుస్తకాలు పట్టుకొని కూర్చొని చదివే కూతురికి ఏం తెలుసురా...???
తాగి వచ్చిన తన తండ్రే తనను బలవంతం చేస్తాడని....

ముద్దుముద్దుగా మాటలు చెప్పే మనవరాలికి ఏం తెలుసురా...???
తాతయ్య తన తనువును తడమాలన్న తపన కలిగి వున్నాడని....

ఇలా ఒక్కటేమిటి..... రెండేమిటి...
మానవత్వం మరిచిన మగ మహారాజుల అరాచకాలు ఎన్నో.... ఎన్నెన్నో.... మరెన్నో
ఎవ్వరైనా సరే.... ఏ వయసు వారైనా సరే....
తేడా లేకుండా వావివరుస మరిచి వెంటపడుతున్నారు.....
ఎదురు తిరిగితే తెగబడి చంపేస్తున్నారు....
ఇలానే మీరు మీ దృష్టిని మార్చుకోకుండా ముందుకు సాగితే....
ఆలికి అమ్మకి కూడా తేడా తెలియని దౌర్భాగ్య స్థితికి దిగజారి పోతారేమో...????
ఈ దురాచారాలను ఏదో పొరపాటేలే అనుకుంటే
అది అలవాటుగా మారింది మీకు....
దీనికి అడ్డుకట్ట వేయ్యకపోతే నీతిని మరిచిపోతున్న 
మగ జాతికి ఆనవాయితీగా
మారే అవకాశం పొంచివుంది.....జాగ్రత్త... తస్మాత్ జాగ్రత్త...



కామెంట్‌లు